గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

26, మార్చి 2025, బుధవారం

771 - 780 లలిత.

 జైశ్రీరామ్.

771. ఓం దురారాధ్యాయై నమః.
నామ వివరణ.
ఆరాధించుటకు అత్యంత కష్టతరమయిన జనని. నిశ్చలచిత్తులకే ఆరాధింపసాధ్యమయిన జనని.
తే.గీ.  మనము చంచలమైనది, కనఁగ లేను
నిను, దురారాధ్యవగుటచే, నేను కాన
చిత్త చాంచల్యమును బాపి బత్తినిచ్చి,
కనగ నిమ్ము *దురారాధ్య*! కరుణను నిను. 
772. ఓం దురాధర్షాయై నమః.
నామ వివరణ.
చపల చిత్తులచే అర్చింపఁబడనటువంటి తల్లి మన అమ్మ.
తే.గీ.  కనఁగ నర్చింపబడవమ్మ కంబు కంఠి!
నుత దురాధర్షవగుటచే క్షితిని నీచ
చంచలాత్ములచేఁ, గను సతిరొ! నిన్ను
గూర్మితోడ *దురాధర్ష*! కొలువనిమ్ము.
773. ఓం పాటలీ కుసుమప్రియాయై నమః.
నామ వివరణ.
పాటలీ కుసుమములయెడ ప్రీతి కల తల్లి మన అమ్మ.
తే.గీ.  *పాటలీ కుసుమప్రియా*! పరవశమున
చిత్తమునఁ బ్రీతి వెల్గుమహోత్తమముగ,
పాటలీ కుసుమంబె నా సాటి లేని
భక్తినొప్పెడి చిత్తము, భద్రకాళి! 
774. ఓం మహత్యై నమః.
నామ వివరణ.
మహత్తరమయిన తల్లి మన అమ్మ.
కం.  *మహతీ*! నీ కొనరిన యీ
మహిమ మసాధ్యము పరులకు, మదిఁ దోచఁగనే
మహనీయ సృష్టిఁ గొలిపెడి
మహిమను కలదానివమ్మ! మంజులవాణీ!

775. ఓం మేరు నిలయాయై నమః.
నామ వివరణ.
మేరుపర్వతము నివాసముగా కలజనని.  శ్రీచక్రములోని తొమ్మిదవ ఆవరణ 
మేరువు. అట్టి మేరువును నివాసముగా కలిగి మన అమ్మ మనలో ఉండును.
కం.  మేరువిదియె నా దేహము
నీ రాకను గోరె, *మేరు నిలయా*! రమ్మా!
కారణ మీవే కర్తవు
ప్రేరకమును నీవె కాన వెలయింతుఁ గృతుల్.

776. ఓం మందార కుసుమ ప్రియాయై నమః. 
నామ వివరణ.
దేవతావృక్షమయిన మందార పుష్పములయెడ ప్రీతి కలిగిన జనని మన అమ్మ.
కం.  సుమ కోమల! *మందార కు
సుమ ప్రియా*! కొలిచెదనిను, శోభిలు మదిలో,
ప్రముదము గొలుపుము జయమును
శ్రమగా భావించకొసఁగు సన్నుత చరితా!

777. ఓం వీరారాధ్యాయై నమః.
నామ వివరణ.
వీరులచే ఆరాధింపఁబడు తల్లి మన అమ్మ.
కం.  అద్వైతాశ్రయ మహితులు
సద్వరులే వీరులు కన సన్నుత చరితుల్,
సద్వర! *వీరారాధ్యా*!
సద్వర పూజిత! బుధులను సదయఁ గనుమిలన్.
778. ఓం విరాడ్రూపాయై నమః
నామ వివరణ.
విరాట్ స్వరూపమయిన విశ్వమే రూపముగా కల తల్లి.
కం.  జయము *విరాడ్రూపా*! సత్
ప్రియమున నీ దర్శనంబు వేగమె యిమ్మా!
క్షయమవ దుర్గుణములు, నే
నయముగ నిను గొలుతునమ్మ!, నన్ గృపఁ గనుమా.
779. ఓం విరజాయై నమః.
నామ వివరణ.
విగతమయిన పాపము కల తల్లి. పాపరహిత జనని మన అమ్మ.
మ.  *విరజా*! దోష విదూర భక్తతతి నిన్ వేవేల చందంబులన్
పరమానందముతోడఁ గొల్తురుగ నీ ప్రాశస్త్యమున్ గాంచుచున్,
వరమై మాకు లభించి పద్యములలో భవ్యంబుగా వెల్గుమా.
కరుణన్ జూపుమ, నీవె మాదుమదులన్ గణ్యంబుగా నుండుమా.
780. ఓం విశ్వతోముఖ్యై నమః
నామ వివరణ.
విశ్వవ్యాప్త ముఖము కలిగిన తల్లి మన జనని.
తే.గీ.  *విశ్వతో ముఖీ*! మది నిలు శాశ్వతముగ 
నీవు నిలిచి, నీ తలపులన్ నిలుపు మదిని.
జన్మ ధన్యమౌ నమ్మరో జయవిభాస!
వందనములమ్మ! శతకోటి భానుతేజ!,
తే.గీ.  *విశ్వతోముఖీ*! జయము, భావించి చూడ
సృష్టి మొత్తము నీవేను, కష్టములవి
మాకు కల్గుచుండుట వింత, మాత వీవె
రక్షగానుండుటన్ జేసి, రమ్య నామ!

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.