గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

25, మార్చి 2025, మంగళవారం

711 నుండి 725 వరకు లలిత...

జైశ్రీరామ్. 

711. ఓం సాధునే నమః. 
నామ వివరణ.
సాధు స్వభావము కలిగి, పరమపాతివ్రత్యమును కలిగి భర్తతో అవినాభావ సంబంధము కలిగిన సాధ్వి  
సధతిని ప్రసాదించు తల్లి సాధ్వి మన జగన్మాత.
ఆ.వె.  *సాధ్వి*! సుస్వరూప! సరస సద్వరభావ 
సద్గుణంబు లొసఁగి సాఁకు నన్ను!
నిరుపమాన! నేను నిన్నున్ స్మరింతును  
నీదు దయయె నన్ను నాదుకొనును.
712. ఓం (ఈ)యై నమః.
నామ వివరణ.
ఈ తురీయస్వరూప మేకాక్షరము, కామ కలా సంజ్ఞికమయిన నామమిది. 
సాధ సాధ్వీ నామం మరొకచోట సాధ్వీ సద్గతిదాయినీ అనేచోట యున్నందున. 
పునరుక్తి వారించుటకు ఇక్కడ సాధు, ఈ అని రెండు నామాలుగ చేయబడినవి. 
సాధు , సాధునే నమః , 
ఈ అను నామము గౌరీ-ఈకారాంత శబ్దంవలె గౌర్యై అయినట్లు యై అయినది( యై నమః) 
తురీయస్వరూపురాలు .అ=విష్ణువు  అస్య=విష్ణవుయొక్క అస్య భగినీ   అనే అర్థంలో కూడా (జ్ఈష్ 
ప్రత్యయం వచ్చును.)ఈ అనే రూపం ఉండును (జయంతుని సోదరి జయంతీ వలె).కావున అమ్మ 
విష్ణు రూపురాలు ఆయన సోదరరూపురాలు. ఒకే బ్రహ్మ ధర్మము ధర్మి ధర్మము పురుష స్త్రీరూపమున 
రెండు విధములు. పురుషుడు విష్ణువు, జగదుపాదాన కారణం. స్త్రీ  పరమశివ మహిషి. ఇట్లు పురుష 
స్త్రీ వాటిధర్మాలు నాల్గింటిలో తురీయము అమమ్మ 
 (ఈకారాద్విశ్వకర్త్రీయం మాయా తుర్యాత్మికా ప్రియా)
ఉ.  *ఈ*! లలితాంబికా!  శరణు. హేయ నిరర్థక జీవితంబు నా
కేల? శుభాస్పదంబగు మహేశ్వరి! నీ పద పంకజంబు నా
కేల  లభింపకుండెఁ? బరమేశ్వరి! నే విడ నీ పదాబ్జముల్,
జాలము సేయకమ్మ, నను చక్కగ నిన్ గని పొంగఁ జేయుమా. 
713. ఓం గురుమండల రూపిణ్యై నమః.
నామ వివరణ.
శ్రీచక్రమున  అష్టకోణము మీద అమ్మవారు పూజలందుకొనుదురు. 
కావున గురుమండలరూపిణి మన అమ్మ.
చం.  గురువుల రూపులందు వెలుగుం గన నీవె జగద్వరేణ్య! నీ
నిరుపమ తేజమౌను మహనీయ మహోత్తమ విద్యలెల్ల, నిన్
గురువుల తేజమందుఁ గని, కోరి భజింతును, బోధఁ గొల్పుచున్
మరుపును బాపుమమ్మ! *గురుమండల రూపిణి*! దేవతా మణీ!  
714. ఓం కులోత్తీర్ణాయై నమః.
నామ వివరణ.
కులము అనగా యింద్రియముల సమూహము, ఈ సమూహమును అధిగమించు గొప్ప కులోత్తీర్ణ 
మన జగన్మాత.
తే.గీ.  నను గులోత్తీర్ణుఁ జేసిన జనని వగుచు,
నిరుపమానందమందించి, వరలఁ జేసి
నిండు మనమున కాఁపాడుచుండు, నీకు
జయము దుర్గా! *కులోత్తీర్ణ*! జయము జయము.

715. ఓం భగారాధ్యాయై నమః. 
నామ వివరణ.
భ గ ము అనగా కాంతిరూపమై గమించు సూర్యమండలము. ఆ సూర్యమండలము మన అమ్మయే, 
భగమండలముననుండి ఆరాధింపఁబడు జనని మన అమ్మ.
మ.  దహరాకాశ విరాజమాన రవి మోదంబొప్పగాఁ గొల్వఁగా
మహిమోపేతముగా చెలంగుదువు సమ్మాన్యా! *భగారాధ్య*! నీ
విహమున్ సత్ పర సౌఖ్యమున్ గొలుపుదే, యీ భక్తునిన్ నిత్యమున్ 
స్పృహలోనుంచి త్వదీయ పాద యుగళిన్ సేవింపఁగాఁ జేయుమా.
716. ఓం మాయాయై నమః.
నామ వివరణ.
పరబ్రహ్మమును ప్రకటించుటకు అనుకూలమయినది మాయ. అది మన అమ్మ లలితాంబయే.
శా.  శ్రీ మాయా! మహిమాన్వితా! జగతియే, చిద్రూపి! నీ మాయచే
శ్రీమంతంబుగఁ గాంచఁ జాలదు నినున్, చిత్తేజమౌ నిన్ను నే
నేమాత్రంబు నెఱుంగఁ జాలను, భవానీ! మాయనుం బాపి, నీ
ప్రేమోద్భాసిత రూపమున్ గనునటుల్ ప్రీతిన్ సదా ! చేయుమా.
717. ఓం మధుమత్యై నమః.
నామ వివరణ.
సూర్యుఁడు దేవతలకు తృప్తి కలిగించువాడై మధువు వంటివాఁడు. సవితృదేవతా శక్తి సావిత్రి
కావున మధుమతి మన జగన్మాత.
తే.గీ.  మధుమతిన్ గృపఁ గూర్చుమా, సుధలు చిందు
పద్యపద్మముల్ నీ పాదపద్మములకు
నర్పణము సేయ వ్రాసెద, నాంధ్రమాత
పొంగునటుల నో  *మధుమతీ*! ముక్తిఁ గనగ.

718. ఓం మహ్యై నమః.
నామ వివరణ.
అమ్మ భూమివలె ప్రకటితమై అన్నింటా వ్యాపించియున్న తల్లి మహి. మన్బ అమ్మయే మహి.
కం.  మహిమోపేత! *మహీ*! నన్
మహిపైఁ గాఁపాడెడి నిను మరువను జననీ!
దహరాకాశ సువర్తీ!
యిహమట్టులె పరము గొలుపు మీశ్వరి! కృపతోన్.
719. ఓం గణాంబాయై నమః.
నామ వివరణ.
అన్ని గణములకూ తల్లి మన అమ్మయే, గణాంబ మన అమ్మ.
ఉ.  జీవగణాంబవీవె, వరసిద్ధిని గొల్పెడి తల్లి వీవె, నిన్
భావనఁ జేసినంతనె స్వభావమె మంచిగ మారునమ్మ,రా
జీవ ముఖాంబుజా! శరణు, సేవలు నీకు నొనర్చు భాగ్యమున్ 
నీవె యొసంగుమమ్మ, మది నీవె వసించి *గణాంబ*! సత్కృపన్..
720. ఓం గుహ్యకారాధ్యాయై నమః. 
నామ వివరణ.
దేవతలలో వివిధ విభాగములకు చెందినవారు గుహ్యకులు. వారిచే ఆరాధింపఁబడు తల్లి మన 
అమ్మ.
తే.గీ.  భక్తినారాధనను జేయ ముక్తినొసఁగు
తల్లివీవమ్మ! కరుణించు చల్లనమ్మ!
జన్మ రాహిత్యమును గొల్పి శాంతినిచ్చు
*గుహ్యకారాధ్య*! నిన్ను నేఁ గొలుతునమ్మ! 
721. ఓం కోమలాంగ్యై నమః. 
నామ వివరణ.
వేద స్వరూపిణి అమ్మ, కోమలవేదాంగి మన అమ్మయే.
కం.  ధర నిహ పరములనిడ, నీ 
దరిఁ జ్చగ మార్గ మీవె దయచేయఁ గదే,
భరియింపఁ జాల బాధలు,
కరుణింపుము *కోమలాంగి*! కలుష విదారీ! 
722.  ఓం గురుప్రియాయై నమః.
నామ వివరణ.
జగద్గురువు ఆది శంకరుఁడు. వారియందు ప్రీతి కలిగి యున్న మన అమ్మ గురుప్రియ.
కం.  జగదీశుండగు శివునకు
నిగమాంత సువేద్య! ప్రియవు నీవే కద? యీ
జగముల నేలెడి జననీ!
యగణిత శుభదా! *గురుప్రియా*! వందనముల్.
723.ఓం స్వతంత్రాయై నమః.
నామ వివరణ.
సృష్టి మొత్తమును నడిపే స్వతంత్ర మన అమ్మ.
శా.  సౌమ్యోద్భాస ముఖారవింద! గుణ పోషా! సత్య సద్రూప! నా
గమ్యంబున్ గన నేర, నీవె కరుణన్ గమ్యంబు నన్ జేర్చుమా.
సామ్యం బెన్నగ లేని నిన్ను గనెదన్స్వాతంత్ర్యమే యున్నచోన్,
రమ్యా! నీవిడు నిన్ గనంగను *స్వతంత్రా*! నాకు స్వాతంత్ర్యమున్.
724. ఓం సర్వతంత్రేశ్యై నమః.
నామ వివరణ.
అరువదినాలుగు తంత్రములకూ ఈశ్వరి మన అమ్మ.
కం.  పలుపలు రీతులఁ బొగడుచుఁ
దలచెద నిను నేను *సర్వ తంత్రేశీ*! ని
స్తుల భక్తియు, నేకాగ్రత,
సలలిత పద పద్య రచన చక్కగనిమ్మా.
725. ఓం దక్షిణామూర్తిరూపిణ్యై నమః. 
నామ వివరణ.
సగుణ నిర్గుణ స్వరూపిణి యైన దక్షిణా మూర్తి రూపిణి మన అమ్మయే.
తే.గీ. జ్ఞాన శూన్యుండ, నెఱుఁగ నిన్, మౌనముగనె
సన్మహా జ్ఞాన దాతవై సత్ సుదర్శ
నమ్ము నిమ్ము, నా మది నిలు నమ్మకముగ,
*దక్షిణామూర్తి రూపిణీ*! దయను కనుమ.
జైహింద్.





















Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.