గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

26, మార్చి 2025, బుధవారం

761 - 770. లలిత

 

జైశ్రీరామ్.

761. ఓం సుభగాయై నమః.
నామ వివరణ.
గొప్ప తేజస్సుకలిగిన తల్లి సౌభాగ్య రాశి, గొప్పభాగ్యస్వరూపిణి మన అమ్మ.
ఆ.వె.  సుగుణ, భక్తి, గణ్యసూనృత వాగ్ఝరుల్
*సుభగ*! నీదు మహిమ, సుజనులందు
ప్రభవ మగును నిజము, ప్రఖ్యాతిగా నాకుఁ
గొలుపుమమ్మ! కృపను, గొలుతు నిన్ను. 
762. ఓం త్ర్యంబకాయై నమః.
నామ వివరణ.
సూర్యచంద్రాగ్నులను మూడు నేత్రములుగా కలిగిన అమ్మ లలితాంబ.
తే.గీ.  సోమసూర్యాగ్ని నేత్రవు, శుభద వీవు,
*త్ర్యంబకా*! నీవు సృష్టికే తల్లివమ్మ!
నీదు తనయుఁడ నేను నన్ నీ దరి నిక
సంతసంబుగ నిలుపుమా, శంభు రాణి! 
763. ఓం త్రిగుణాత్మికాయై నమః.
నామ వివరణ.
సృష్టిస్థితిలయలకు మూలమయిన సత్వము,రజస్సు, తమము అను త్రిగుణములు ఆత్మగా కల 
తల్లి.
తే.గీ.  దివ్య! *త్రిగుణాత్మికా*! సతీ! భవ్య! నీవు
సత్వమై వెల్గు నాలోన సన్నుతముగ,
పుట్టినందున మహిపైన పుణ్య కార్య
కలన సంతృప్తి కలిగించు ఘనతరముగ. 
764. ఓం స్వర్గాపవర్గదాయై నమః.
నామ వివరణ.
నిత్య సుఖము, మోక్షము ప్రసాదించు జనని మన అమ్మ.
తే.గీ.  జనని! *స్వర్గాపవర్గదా*! జయము నీకు,
కలుగు స్వర్గాపవర్గముల్, కరుణ తోడ
నీవు నాయందు నిలిచి, సద్భావనలను
సత్య సద్వృత్తిఁ గలిగింప, సత్య భాస! 
765 ఓం శుద్ధాయై నమః.
నామ వివరణ.
అవిద్యా సంబంధమయిన మాలిన్యము లేని శుద్ధ చైతన్య స్వరూపిణి మన అమ్మ.
కం.  *శుద్ధా*! శూన్యావిద్యా!
బుద్ధిన్, విజ్ఞానదీప్తి, మోక్షార్థంబై
బద్ధకము వాపి గొలుపుము,
శ్రద్ధను సేవించనిమ్ము శర్వాణి! నినున్. 
766. ఓం జపాపుష్పనిభాకృత్యై నమః.
నామ వివరణ.
దాసాని పుష్పముతో సమానమయిన ఆకారము కలిగిన తల్లి జగన్మాత.
కం.  సుతుఁడ, *జపాపుష్పనిభా
కృతీ*! య కుంఠిత జపా! ప్రకృతి సద్రూపా!
క్షితి నన్ నిలుపుము శుభాళిగ
మతి నరుణప్రభ! వెలుంగు మహనీయముగా.
ఉ.  పుష్ప పరాగమే కనగ పుణ్యద! నీ వర పాద ధూళి, వా
చస్పతియున్ నుతింప నిను చక్కని వర్ణములే కనండు, శ్రీ
పుష్ప సుపూజితా! కవన పుష్పములన్ నిను గొల్తు నో *జపా
పుష్ప నిభాకృతీ*! సకల పుణ్యఫల ప్రద! ముక్తిదా!, సతీ!

767. ఓం ఓజోవత్యై నమః.
నామ వివరణ.
తేజస్సుతో, బలముతో నొప్పారు జనని మన అమ్మ.
కం.  *ఓజోవతీ*! కొలువ నిను
నోజస్సు లభించు నాకు నొప్పుగ, నిది నీ
నైజము, భక్తుల మదిలో
సాజంబుగ వెలుఁగుచుంట, సరసిజ నయనా!
768. ఓం ద్యుతి ధరాయై నమః.
నామ వివరణ.
కాంతిని ధరించిన జనని. కాంతియే స్వరూపముగా నొప్పారు తల్లి లలితామాత.
కం.  మహిమాన్విత లలితాంబా!
గ్రహియించితి నీవె నాకుఁ గలిగిన ద్యుతిగా,
దహరాకాశమునందున
రహియించెద వీవె *ద్యుతిధరా*! వందనముల్.
769. ఓం యజ్ఞరూపాయై నమః.
నామ వివరణ.
మహావిష్ణువు కంటే వేరు కానటువంటి యజ్ఞ రూప మన అమ్మ.
తే.గీ.  నిత్య యజ్ఞంబుగా మదిన్ నిలువుమమ్మ!
*యజ్ఞ రూపా*! మహద్జ్ఞేయమై  వెలింగి
మాయ చీకట్లు పాపుమా మహిమఁ జూపి,
వందనంబులు చేసెద ప్రణవ తేజ!
కం.  నీవే సర్వము మాకిల
ప్రోవుచు నడిపించు *యజ్ఞ రూపా*! ప్రణతుల్,
నీవే జ్ఞానము నొసగుచు,
బ్రోవుము మము జనని! యజ్ఞముగ నీవగుచున్ . 
770. ఓం ప్రియవ్రతాయై నమః.
నామ వివరణ.
సకల దేవతా వ్రతములయెడ ప్రియము ఉన్న తల్లి మన అమ్మ.
పం.చామ.  మహత్వ మీవు చూపి సత్య మార్గమందు నిల్పి నన్
సహించి నాదు దోషముల్, ప్రశస్తిఁ గొల్పుచున్ సదా
మహోన్నతంబుగా గణించి మంచి మార్గమిచ్చితే?
యహంబు బాపి కాచు శ్రీ *ప్రియవ్రతా*! నమోస్తుతే. 
జైహింద్.




















Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.