గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

26, ఏప్రిల్ 2018, గురువారం

శ్రీమన్నారాయణ శతకము. 7/20వ భాగము. 31 నుండి 35 రచన చింతా రామకృష్ణారావు

జైశ్రీరామ్
శ్రీమన్నారాయణ శతకము.
రచన. చింతా రామకృష్ణారావు
31. శా. నిన్నుం జూచెద పక్షులన్ బశువులన్, దృగ్గోచరంబౌచు నీ
వెన్నింటం గలవన్నిటన్ గనియెదన్ సృష్టిం వివేకంబుతోన్.
భిన్నంబింతయు కానరాదవియు నీవేగా! దయాపూర్ణ! శ్రీ
మన్నారాయణ! నీవె లేని యెడలన్ మాకెట్లు కానంబడున్? 
భావము.   శ్రీమన్నారాయణా! పక్షులయందున, పశువులయందున నేను నిన్నే చూచెదను సుమా. కంటికి కనఁబడుచు నీవు ఎన్నింటిలో ఉండియుంటివో అన్నింటియందును నిన్ను వివేకముతో చూచెదను.ఏమాత్రము భేదమనునదే సృషికి నీకు మధ్య కనఁబడదు. కనిపించెడి గొప్ప శోభలెల్లప్పుడు నీకు సంబంధించినవే కదా! నీవు లేవు అనునదేదైనా ఉన్నచో అది మాకు ఏవిధముగ కనబడును?

32. శా. మన్నై పోవఁడు దేహీ. దేహ జగతిన్ మార్తాండుఁడై వెల్గు తా
నెన్నోకర్మలు చేయఁ జేసి తుదకున్ హీనంబవన్ శక్తి, యా
మన్నున్వీడి పరంబు చేరు నిహమున్ బ్రాప్తించు పాపంబొ. శ్రీ
మన్నారాయణ  పుణ్యమో. తమరివే. మాకేలనీ ప్రాప్తముల్. 
భావము. ఓశ్రీమన్నారాయణా! దేహముననుండు దేహియైన ఆ ప్రాణశక్తి మట్టిగా అవడు. అతడు యీ శరీలమనెడి లోకములో సూర్యుడై వెలుగుచుండి ఆ దేహముచే ఎన్నో కర్మలను చేయజేసి, తుదకు శరీరమునందలి శక్తి క్షీణించగా ఆ శరీరమును విడిచి వెడలిపోవును. ఇక్కడ చేసెడి కర్మల వలన లభించెడిది పాపమో లేక పుణ్యమో, అవి తమరివేసుమా. ఈ కర్మ ఫలములు మాకవసరము లేదు.

33. శా. మిన్నున్ మన్నును నేకమైననగు, నీ మీదన్ ప్రమోదంబు పొ
మ్మన్నన్ బోవగరాని మార్గమిడు నీ మంచిన్, మనోజ్ఞంబుగా
నెన్నంజాలు పదంబులే దొరకవే, హే భక్త మందార! శ్రీ
మన్నారాయణ! సత్ పదాంబుజములన్ మాకందనీ కొల్వగా. 28 . 01 . 2018.
భావము.   ఓశ్రీమన్నారాయణా! ఆకాశము భూమి ఒకటిగా ఐపోయినను ఐపోవచ్చునుగాక.మాకు నీపై ఉన్న మిక్కిలి యిష్టము మాత్రముపొమ్మన్నను పోకుండా ఉండు మార్గమును మాకు కల్పించునటువంటి నీలో ఉన్న  మంచిని మనోజ్ఞముగా ఎన్నుటకు తగిన పదములే కరువైపోయినవి. భక్త మందారా! మంచి పద పద్మములను మేము కొలుచుకొనుటకు వీలుగా మాకు అందనిమ్ము.

34. శా. విన్నన్ జాలును నీ మహాద్భుత కథల్ విశ్వాసమున్ నిల్పి. నే
నున్నానంచు మనమ్మునన్ నిలిచి దీనోద్ధారకుండా మమున్
మన్నున్ జేతికినంటనీక జగతిన్ మన్నించి కాపాడు శ్రీ
మన్నారాయణ! భక్త బాంధవ! తరమ్మా నిన్ బ్రశంసింపగన్?  
భావము.   దీనులనుద్ధరించెడివాడవైనఓ శ్రీమన్నారాయణా! నీపై విశ్వాసముంచి నీకు సంబంధించిన అద్భుతమైన కథలను విన్నచో సరిపోవును. నేనున్నాను మీకు అనుచు మా మనస్సులలో నీవు నిలిచి మాచేతికి ఎటువంటి ఖిలము అంటుకోకుండా చూచుచు, లోకమును కాపాడు భక్తబాంధవుఁడవు. అట్టి నిన్ను ప్రశంసించుట మా తరమగునా.

35. శా. నిన్నేనమ్ముచు నైహికంబు విడు నీ దృష్టిన్ మనీషాళి, నీ
దన్నున్ గైకొను జీవులయ్య కననీ దారిద్ర్యనారాయణుల్,
కన్నా! నిన్నె మనమ్ము నెన్ను  ఘనులన్  కాపాడు నిత్యంబు శ్రీ
మన్నారాయణ! భక్త పాలన చణా! మా మాట మన్నింపుమా.  

భావము. భక్తులను పాలించుటయందు నైపుణ్యము కలవాడా! శ్రీమన్నారాయణా!మహనీయులు నిన్నే విశ్వసించిఐహిక  వాంఛలను విడిచిపెట్టి మనుచుడిరి. దారిద్ర్యముతో కొట్టుమిట్టాడుచున్న వారు నీ దన్నునే స్వీకరించు జీవులు. కన్నా! నిన్నే నిత్యము మనసులో భావించు మహనీయులను నిత్యము నీవే  కాపాడుము. విషయములో నీవు మా మాటను మన్నించితీరవలయునుసుమా.  
జైహింద్..
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
శ్రీమన్నారయణ శతకమును నిత్యము పఠించగల అదృష్టము మాకు లభింప జేసి నందులకు కృతజ్ఞతలు .ఆ శ్రీమన్నారాయణుని పాదపద్మములకు ప్రణామములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.