గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

27, ఏప్రిల్ 2018, శుక్రవారం

శ్రీమన్నారాయణ శతకము. 8/20వ భాగము. 36 నుండి 40 రచన చింతా రామకృష్ణారావు

జైశ్రీరామ్
శ్రీమన్నారాయణ శతకము.
రచన. చింతా రామకృష్ణారావు
36. శా. పన్నీటన్ జలకంబు లాడెదవు నీ భక్తాళిచే నిత్యమున్.    
కన్నీరింతయు కారనీయక కనే కారుణ్యమే లేదొకో?
యెన్నాళ్ళీ కరుణావిహీన మతివై యిట్లుందువో నీవు? శ్రీ
మన్నారాయణ! కావు భక్త జనులన్ మన్నించి పోషించుమా!  
భావము శ్రీమన్నారాయణుడ! నిత్యము నీ భక్తుల సమూహముచేత పన్నీట జలకములాడెదవు. అట్టిన్నీకు, ఆ భక్తులకు కన్నీరించుకైనను కారకుండా చూచే కరుణా స్వభావమే లేదా యేమి? నీవింకా ఎన్నినాళ్ళు ఈ విధముగా కరుణ లేనివాడవై విధముగా ఉందువు?భక్తజనులను మన్నించి, కాపాడుచుచు, వారిని పోషించుము.

37. శా. నిన్నున్ గోరెద నాలకించు మనవిన్. సృష్టిన్  గుణోపేత సం
పన్నుల్, పేదలటంచు నెంచకుము. సంభాసించు నీ మానసం
బెన్నంజాలఁ జేసి మేల్కొలుపు, నీవే వారియందుండి. శ్రీ
మన్నారాయణ! సత్య పోషణ గుణా! మాన్య స్వరూపా! ఘనా!   
భావము. శ్రీమన్నారాయణా!సత్యమును పోషించు గుణము కలవాడా! శ్రేష్ఠమైన పూర్ణ చంద్రుని బోలు ముఖము కలవాడా! గొప్పవాఁడా!  నిన్ను నేను కోరుచుంటిని. నా మనవినాలకించుము. గుణ సంపన్నులనీ, పేదలనీ భేదమును లిగియుండకుము. వారిలో నీవుండి ప్రకాశించే నీ మనసును గుర్తించునట్లు చేయుము.

38. శా. జన్నంబుల్  పచరించి సాధకుఁడు నీ సామీప్యమున్ జేరఁగా
నెన్నున్. నేనెటు నిన్ను జేరుదునొ? నే నే జన్నమున్ చేయలే
దిన్నాళ్ళైనను. దేవదేవ నిను నే నే రీతి దర్శింతు? శ్రీ
మన్నారాయణ! నీదు నామ జపమున్ మానన్ నినున్ జేరగన్!   
భావము శ్రీమన్నారాయణా! నిన్ను దర్శింప గోరు సాధకులు యజ్ఞములాచరించినీ సమీపమునకు చేరగా తలంచును. నేను నిప్పటికినీ యజ్!జమూ చేయలేదు కావున విధముగా నిన్ను చేరగలను? దేవదేవా! నేను నిన్నేరీతిని దర్శింప గలుగుదును? నిన్ను చేరుట కొఱకు నేను నీ నామ జపమును మాత్రము మాననుసుమా.

39. శా. అన్నంబో రఘురామ యంచధికులాహారంబు నర్ధింత్రుసం                                          
పన్నుల్ తిన్నది జీర్ణమే యవదనన్ భవ్యా ! మదింగాంచితే?                              
అన్నంబీవె.  లభింపుమందరికి.  దేహార్తిన్ తొలంగించు! శ్రీ                               
మన్నారాయణ! పేద సాధు జనులం బాలించు, భుక్తిప్రదా.    .                                  
భావముభవ్యుఁడవైన శ్రీమన్నారాయణా!అన్నమో రామచంద్రా యని పెక్కురు ఆహారము కొఱకై నిన్ను వేడుకొందురు. సంపన్నులు తాము తిన్నది జీర్ణమవక బాధపడుచుండుటను మనసుపెట్టి చూచితివా? అన్నము నీవే కదా? అందరికీ లభింపుమయ్యా. ఆకలి బాధను తొలగించుము. భుక్తిప్రదా! పేదలను సాధుజనులను నీవు పాలించుమయ్యా.

40. శా.  ఉన్నావన్నిట. కానరావు. హృదిలో నున్నట్టి నీ రూపమున్
గన్నారం గన జాలు వారలు కనన్ గల్యాణ మూర్తుల్ కదా!
పున్నెంబుండును నీకు, కానఁబడుమా. బుద్ధిన్ బ్రసాదించు. శ్రీ
మన్నారాయణ !  నిన్ను నమ్మిన ననుం భావింపుమా నీ మదిన్.        
భావము.   ఓ శ్రీమన్నారాయణా ! నీవు అన్నింటిలోను ఉన్నావు. ఐనా కంటికి కనబడవు. మనసులోనే ఉండే నీ రూపమును ప్రత్యక్షంగా చూడగలుగువారు మంగళస్వరూపులే కదా ! నీకు పుణ్యముండును. మాకు కనిపింపుము. చక్కని బుద్ధిని మాకు ప్రసాదించుము. నిన్ను నమ్మియున్న నన్ను నీ మనసులో ఒక్కపర్యాయము భావన చేయుము.
 జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
నవరస భరితమైన పద్యములు చక్కగా వేడుకొనుచు అలరించు చున్నవి . శ్రీమన్నారాయణుని పాదపద్మములకు ప్రణామములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.