జైశ్రీరామ్
శ్రీమన్నారాయణ శతకము.
రచన. చింతా రామకృష్ణారావు.
రచన. చింతా రామకృష్ణారావు.
21. శా. ఉన్నావీవిట నన్నుఁ జేరి యని, స్నేహోత్సాహ సంపన్నులై
నన్నున్ మాన్యులు సన్నుతింతురయ. నేనా? నీవ? స్తుత్యార్హతన్
వన్నెన్ గాంచుట? నే గ్రహించితిని. నీ వన్నెల్ ననుం జేరి శ్రీ
మన్నారాయణ! నన్ను నిల్పుటను, సన్మాన్యత్వమున్ గొల్పుటన్.
భావము. ఓ శ్రీమన్నారాయణా! ఇచ్చట నీవు నన్ను చేరి ఉన్నావని స్నేహ భావముచే కలిగిన ఉత్సాహమే సంపదదగా
కలవారైమాన్యులు నన్ను సన్నుతి చేయుదురు. స్తుత్యార్హతతో నీవా నేనా వన్నెను గాంచిట? ఆలోచింపగా నీవు నన్ను చేరి నన్ను స్థిరపరచుటకును, సమ్మాన్యత్వము
కల్పించుటకును నీవు చేయుచున్నదని నేను గ్రహించితిని.
22. శా. నిన్నున్ గోరగ లేదు పుట్టుటకునై, నీవేల బుట్టించితో?
పున్నెంబీయఁగ వేడ లేదు. నిను నే భోగంబులం గోరలే
దున్నన్నాళ్ళును నీదె బాధ్యత కదా! ఉద్ధారకుండీవె. శ్రీ
మన్నారాయణ! కన్న నీవె సతమున్ మమ్మున్ గృపన్ జూడనౌన్.
భావము. ఓ శ్రీమన్నారాయణా!నిన్ను మేము మమ్ములను పుట్టించమని మేము కోరలేదుకదా. మరి నీవేల మమ్ము పుట్టించితివి?నిన్ను మేము పుణ్యమునీయమని కోరలేదు. భోగభాగ్యములను కోరుట లేదు. ఉన్నన్నాళ్ళును బాధ్యత నీదే కదా.మమ్ములను ఉద్ధరించువాడవు నీవే కదా. మమ్ములను కన్నట్టి నీవే ఎల్లప్పుడూ కృపతో చూడనగును కదా.
23 శా. పున్నెంబెన్నఁగ నేది యౌను? గుడిలోఁ బూజించ నిన్ బున్నెమా?
మన్నున్ దున్నుచునుండి, పంట ప్రజకై పండించినన్ బున్నెమా?
ఎన్నాళ్ళైనను సేద్యమున్ విడిచి పూజింపంగ నెట్లౌను? శ్రీ
మన్నారాయణ! నిన్ను నాత్మఁ గనుచుం బ్రార్థింప పున్నెంబెగా.
భావము. ఓ శ్రీమన్నారాయణా! ఎన్నిక చేసి చూచినచో పుణ్యమనాగా ఏది యగును? గుడిలో నిన్ను పూజించుట పుణ్యమగునా? భూమిని దున్నుచు ప్రజలకై పంటలు పండించుట పుణ్యమా?ఎన్నాళ్ళు గడుచుచున్నను వ్యవసాయము చేయుట మాని నిన్ను గుడికి వచ్చి కొలుచుట ఎట్లు కుదురును? నిన్ను మనసులో తలచుకొని, ప్రార్థించినచో పుణ్యమేకదా.
24. శా. సాన్నిధ్యంబున నిల్పు నీకు ననునీశా భక్త కల్పద్రుమా!
సన్నద్ధుండను నీ పదార్చనవిధిన్ సంతోషమున్ బొంద నీ
మున్నున్నన్ భవ బంధముల్ తొలఁగు సంపూర్ణాకృతిన్ గాంచ, శ్రీ
మన్నారాయణ భక్తియుక్తునయి నీ మాహాత్మ్యమున్ గాంచనీ.
భావము. ఓ శ్రీమన్నారాయణా! ఓ పరమేశా! భక్తులపాలిటి కల్పవృక్షమా! నన్ను నీకు సమీపమున నిలుపుము. నీ పాదార్చన చేయుట అనే పని వలన సంతోషము పొందుటకు నేను సిద్ధముగా ఉంటిని. నీ ముందు ఉన్నచో నీ పరిపూర్ణమైన ఆకారము చూచుటచేత మా భవ బంధములు తొలఁగిపోవును. భక్తితో కూడుకొన్నవాడినయి నీయొక్క మాహాత్మ్యమును చూడనిమ్ము.
25. శా. ఉన్నావీవు మదిన్ సుచేతనముగా, నున్నావు దేహంబువై.
యున్నావెల్లెడ
స్థావరంబులను నీవున్నావుగా జంగమం
బున్నిత్యుండుగ
నుంటి వెల్లెడల, సంపూర్ణుండవౌ నిన్ను శ్రీ
మన్నారాయణ! కానలేకునికి యీ మాలోని `మా’భావనే.
భావము. ఓ శ్రీమన్నారాయణా! నీవు చైతన్య రూపములో నిత్యము మాలో ఉంటివి. ఈ శరీర ముగా ఉన్నదియు నీవే. అన్ని కదలని వాటియందును నీవుంటివి. అన్ని
కదిలెడి వాటియందును నీవుంటివి. నీవు
ఇత్యుఁడవై అంతటను ఉంటివి. పరిపూర్ణ స్వరూపుఁడవైన మేము కానలేకపోవుటకు కారణము మాలో గూడుకట్టుకొని యున్న మాది, మేము అనే మా అహం భావనయేయే కదా!
జైహింద్.
1 comments:
నమస్కారములు
రోజు చూస్తున్నాను కానె ఒంట్లో బాగుండక రాయలేక పోతున్నాను. సోదరా . ఆ శ్రీమన్నారాయణుని పాద పద్మములకు శిరసాభి నమస్సులు . ఇంకా, ఇంకా వ్రాయాలని ఆశీర్వదించి అక్క
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.