గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

23, ఏప్రిల్ 2018, సోమవారం

శ్రీమన్నారాయణ శతకము. 4/20వ భాగము. 16 నుండి 20 రచన చింతా రామకృష్ణారావు

జైశ్రీరామ్
శ్రీమన్నారాయణ శతకము.
రచన. చింతా రామకృష్ణారావు
16. శా. విన్నన్ నీ శుభ నామమే వినవలెన్ విభ్రాంతులం బాయగా.
కన్నన్ నీ దర హాసమే కనవలెన్ గాంచం మోక్షంబు. లే
కున్నన్ జన్మము వ్యర్తమే కనగ. దీనోద్ధారకా! దేవ! శ్రీ
మన్నారాయణ! ప్రేమతోడ మములన్ మన్నించి రక్షింపుమా. 
భావము.  దీనోద్ధారకా! శ్రీమన్నారాయణా! విన్నట్లైతే మాలో క్రమ్ముకొనిన భ్రాంతులు మాసిపోవువిధముగా నీ నామమే వినవలెను కదా. చూచినట్లైతే మోక్షము పొందజేయు నీ చిఱునగవే కనవలెను. విధముగ కానినాడు  జన్మము వ్యర్థమే సుమా. ప్రేమతో మమ్ములను మన్నించి రక్షించుము.

17. శా. వన్నెల్, చిన్నెలు, భ్రాంతి కారకములా భ్రాంతిన్ హృదిన్ గోర్కెలౌ
నెన్నన్, గోర్కెల శత్రు షట్కమలమున్, దృష్టంబధోదుర్గతుల్.
కన్నుల్ మూలములింతకున్ కనుక నే కాంక్షింతు జ్ఞానాక్షి. శ్రీ
మన్నారాయణ! జ్ఞాన నేత్రమగుచున్ మాయందు నీవుండుమా.  
భావము.   శ్రీమన్నారాయణా! జగత్తులోని వన్నెలు చిన్నెలు కేవలము మాలో భ్రాంతి పుట్టుటకు మూలములు. అట్టి భ్రాంతి కారణముగా మాలో కోరికలు జనించును. కోరికల కారణముగా అరిషడ్వర్గము మాలో అలముకొనును. ఆపై దుష్టమైన అధోగతులు  నిశ్చయము.. ఇన్నింటికీ కన్నులే మూలము కనుక నేను నిన్ను జ్ఞాననేత్రమును మాకు ప్రసాదించుమని కోరుచుందును. నీవే జ్ఞాన నేత్రముగా ఉండుము.
18. శా. విన్నన్ జాలును నీదు నామ మహిమల్ వీనుల్ శుభంబుల్ కనున్.
విన్నన్ లౌకిక దౌష్ట్యముల్ పతనమే వీనుల్ ప్రబంధించు, నో
యన్నా నీ శుభ నామ దివ్య సుధ జ్ఞేయంబై వినం జేసి, శ్రీ
మన్నారాయణ ముక్తి దాతవయి మా మర్యాదనే నిల్పుమా. 
భావము.
శ్రీమన్నారాయణా!నీ నామ మహిమను విన్నంత మాత్రమున చెవులు శుభములు పొందును.లౌకికమైన దౌష్ట్యములను చెవులు విన్నచో పతనమునే ప్రబంధించును. నీయొక్క శుభప్రదమైన దివ్యమైన నామామృతమును జ్ఞేయమగుచు వినునట్లు చేసి మాకు ముక్తి దాతవయి, మా మర్యాదను నిలుపుము.

19. శా. పున్నెంబెంతగ కావలెన్ గొలువ నీ పూజ్యాంఘ్రి సాహస్రమున్?
కన్నుల్ కాయలవెంత కాయవలె నిన్ గాంచంగ విశ్వేశ? పో
తన్నన్ గావలెనా నుతింప నిను మోహ భ్రాంతులన్ వీడి? శ్రీ
మన్నారాయణ! మా మదిన్ నిలువుమా! మమ్మున్ గృపన్ జూడుమా.         
భావము.
శ్రీమన్నారాయణా! నీ పూజ్య పాదములను సేవించవలెనన్న మాకెంతటి పుణ్యఫలము ఉండవలెనయ్యా? విశ్వేశ! నిన్ను చూచుటకొరకై ఎదురు చూచుచు కన్నులెంతగా కాయలు కాయవలెను? మోహభ్రాంతులను విడిచిపెట్టి నిన్ను నుతింపవలెనన మేము భాగవతోత్తముఁడైన పోతన్నగా అవవలెనా? మా మదిలో నీవు నిలిచియుండుము. మమ్ములను కృపతో చూడుము.

20. శా. జున్నున్, బాలును, మీగడల్, పెరుగు, సంశోభన్ మదిన్ దోచు నా
వెన్నల్, ఘుంఘుమలాడు నేయియును, భావింపంగ నీకేలయా?
మన్నున్ మెక్కితి వంచు నీ జనని నిన్ మర్దింపగా జూచె, శ్రీ
మన్నారాయణ! చూడ నన్నిట నినున్మాకున్ బ్రబోధింపనో? 
భావము.
శ్రీమన్నారాయణా! మన్నును తింటివని నిన్ను నీ తల్లి దండింపఁ జూచెను కదా! ఆవిధముగా మన్నుతినెడి నీకు జున్ను, పాలు, మీఁగడ, పెరుగు, వెన్న, నేయి, ఇవన్నియు యెందులకు? నిన్ను అన్నింటిలోను చూచెడి విధానమును మాకు ప్రబోధించుట కనియా?  
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.