గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

17, ఏప్రిల్ 2018, మంగళవారం

ఛందస్సు .. .. .. బ్రహ్మశ్రీ కొరిడే విశ్వనాథశర్మ.

జైశ్రీరామ్.
ఛందస్సు -వృత్తాలు -1
ఛందశ్శాస్తము వేదాంగాలలో ఒకటి. వేదములలో అంతర్భాగమైనది. మంత్రాలు ఛందోబద్ధకమైనవి. మంత్రాలు కాని శ్లోకాలు కాని వర్ణనిబద్ధతతో నుండటమే ఛందస్సుయొక్క ప్రథమలక్ష్యం. చాలావరకు శాస్త్రవిషయాలు ఛందోబద్ధకంగా ఉండటంవలననే కంఠస్థానికి అనుకూలమైనాయి. "అపి మాషం మషం కుర్యాత్. ఛందోభంగం న కారయేత్ " అని చెప్పబడ్డది. ఛందస్సుకు అంతప్రాధాన్యం ఇచ్చారు.
ఛందస్సు నేర్చుకోవాలంటే ముందుగా లఘువు , గురువు గురించి తెలుసుకోవాలి. అదేవిధంగా గణములను తెలుసుకోవాలి.
లఘువు : - హ్రస్వాంతమైన అచ్చులు , అట్టి అజంతమైన హల్లులు లఘువులుగా లెక్కించబడును. లఘువు పలికే కాలము ఏకమాత్రాకాలము. అనగా ఒక చిటిక వేసే కాలము.
ఉ. అఇఉఋ కఖగఘఙ మొ. అలాగే కి , చు , టృ తృమొ. విధంగా
గురువు :- గురువు పలికే కాలము ద్విమాత్రాకాలము. అనగా రెండు చిటికలు వేసే కాలము. గురువును నిర్దేశించడానికి కొన్ని నియమాలున్నాయి. అవి :-
1) దీర్ఘములైన అచ్చులు .దీర్ఘాన్తములైన హల్లులు.
2) అనుస్వారాన్తమైన అచ్చులు , హల్లులు.
3) సంయుక్తాక్షరము పరముగా నున్న ( తన కంటే తరువాతనున్న) చో లేదా కేవలం హల్ ఉన్ననూ అట్టి ( వెనుక ) వర్ణము.
4) విసర్గాంతమైన వర్ణము.
5) లఘువైననూ పాదాంతమందు గురువు ఉండవలిసిన చోట నున్న చో వికల్పంగా గురువుగా గణించబడును.
వి. తాను సంయుక్తాక్షరమైననూ హ్రస్వాంతమైనచో లఘువే అగును కాని గురువు కాదు.
ఇవి లఘుగురువుల వివరణ.

ఛందస్సు -వృత్తాలు - 4
మాత్రావృత్తాలు, వర్ణవృత్తాలు అని రెండు విధాలు. ప్రతి పాదములలో ఎన్ని మాత్రలుండాలో తెలియజేసేవి మాత్రావృత్తాలు. ఇవి ఆర్యా , గీతములు మొదలైన వృత్తాలు . ప్రస్తుతం వీటి జోలీకి వెళ్ళకుండా ప్రసిద్ధమైన సమవృత్తములగురించి మాత్రమే చెప్పడానికి ముందుకు వెళ్ళుతున్నా.
వర్ణ (గణ) వృత్తాలు మూడురకాలు . 1 )సమవృత్తాలు. 2) అర్ధసమవృత్తాలు. 3) విషమవృత్తాలు.
అన్నీ (4) పాదాలయందు సమానమైన లక్షణము గల వృత్తాలు సమవృత్తాలు.
1 , 3 పాదాలందు ఒక లక్షణము , 2,4 పాదాలందు మరొక లక్షణము కలిగి యున్న వృత్తాలు అర్ధసమవృత్తాలు.
నాలగుపాదాలయందు కూడ భిన్నములైన విడి విడి లక్షణములు కలిగిన వృత్తాలు విషమవృత్తాలు.
ప్రస్తుతం సమవృత్తాలు గురించి తెలుసుకొందాం .
నాలుగు పాదాలుంటూ పాదానికి ఒక వర్ణం చొప్పున ఉన్న " ఉక్తా " ఛందస్ మొదలుకొని పాదానికి 26 వర్ణములుండు " ఉత్కృతి " వఱకు ఛందశ్శాస్త్రం తెలిపి అనంతములైన ఈ వృత్తలక్షణాలను ఆపివేసింది. ఉక్తా నుండి ఉత్కృతి వరకే కొన్ని లక్షల వృత్తాలౌతాయి. అందుకే ఆ తర్వాత దండకాదులని విడిచిపెట్టింది.

ఛందస్సు -వృత్తాలు - 13
యతి
క్రితం పాఠంలో యతికి ఎక్కువ ఉదాహరణలు ఇవ్వబడలేదని ఇంకొంత వివరణ కావాలని నన్ను వ్యక్తిగతం గా అడిగినందున మరి కొంత వివరణ .
యతి అంటే అర్థవంతమైన పదముయొక్క విఱుపు ఆ అక్షరముపై పడాలి. సంస్కృత లక్షణము ప్రకారము ఏ అక్షరమైతే యతి అని చెప్ఫబడినదో ఆ వర్ణమువరకు పదము విఱువబడాలి. సమాసము మధ్యలోనిదైనా సరే విచ్ఛేదకమవాలి. తెలుగులోని అదే వృత్తములో ఆ తదుపరి వర్ణానికి యతి అని చెప్పబడుతుంది. అంటే సంస్కృతమందు 12 వ వర్ణం యతి . ఐతే తెలుగులో 13 వ వర్ణం యతి గా చెప్పబడుతుంది.అంటే సంస్కృతం లో అక్కడ మరొకపదం ఆరంభించబడవలెను కాని వర్ణసామ్యాది విషయప్రస్తావనలుండవు. సంస్కృతంలో పదవిచ్ఛేదకమైతే తెలుగులో మొదటి (ఋవళి)వర్ణంతో సమాన మైత్రి వర్ణముండాలి. కాని సంస్కృతములో ఆ వర్ణమైత్రి అవసరం లేదు.
ఉదా. శార్దూలవిక్రీడితవృత్తానికి మీకు పరిచయమున్న ఈ శ్లోకముల పాదమును చూడండి. (* గుర్తుల కంటే ముందున్న వర్ణముల చోట్ల యతి)
" శ్రీవాణీగిరిజాశ్చిరాయ దధతో* వక్షోముఖాంగేషు యే‌‌* "
ఇందు సంస్కృత లక్షణము ప్రకారము 12,+ 7 వర్ణములకు యతి . కావున 12 వ వర్ణమైన 'దధతో ' తో విరామం ఇవ్వాలి. అక్కడ తృటి కాలం విశ్రాంతి. వక్షో....తో మరల ప్రారంభించి తర్వాత 7 వ వర్ణానికి విశ్రాంతి. ఈశ్లోకములో ఇదే పాదాంతం కావున ఆ 7వ వర్ణము తో విఱుపు .
మరొక శ్లోకం 17 వర్ణములుగల ' మందాక్రాంతం' పాదాంత యతితో పాటు మొత్తం మూడు యతులు.
1) 4వర్ణముల తర్వాత , మరియు
2) ఆ పై 6 వ వర్ణములకు అంటే 10 వ వర్ణమునకు మరియు
3) ఆ పై 7 వ వర్ణములకు అంటే 17 వ వర్ణమునకు అనగా చివరి వర్ణమునకు యతి.
మీకు తెలసిన శ్లోకం :-
"శాంతాకారం* భుజగశయనం * పద్మనాభం సురేశం*"
కాళిదాసకృత మేఘ సందేశమందు అంతయునూ ఈ వృత్తములోనే యున్నది.
మరొక ఉదా.
మాలినీ15వర్ణముల శ్లోకము. (8 + 7)
" లిఖితమపి లలాటే * ప్రోజ్ఝితుం కః సమర్థః. * "
ఇంకొక ఉదా.
కవిరాజవిరాజితం. :- 23 ( 4 + 9 + 6 + 4 )
" జయ జయ * హే మహిషాసురమర్దిని * రమ్యకపర్దిని* శైలసుతే * "
ఇదే విధంగా ముందుముందు ఊహించదగును.
జైహింద్.. 

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.