గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

22, ఏప్రిల్ 2018, ఆదివారం

శ్రీమన్నారాయణ శతకము. 3/20వ భాగము. 11 నుండి 15 రచన చింతా రామకృష్ణారావు

జైశ్రీరామ్
శ్రీమన్నారాయణ శతకము.
రచన. చింతా రామకృష్ణారావు
11. శా.  పున్నెంబుండును పేదలన్ గనుమయా. పోషింపగా లేక తా
మన్నంబైనను పెట్ట లేక సుతులం బాధించుచున్నారు. నీ
వున్నావన్నది సత్యమై ప్రబలగానోదార్చి పోకార్పు శ్రీ
మన్నారాయణ! భాధలన్ బ్రజలకున్, మాకీవ మూలంబుగా.
భావము.  ఓశ్రీమన్నారాయణా! నీకు పుణ్యముఃడును. పేదవారిని చూడుము. తమ 
సంతానమునుపోషింప.లేక కనీసము వారికన్నమైనను పెట్ట లేక  ఆకలిబాధకు లోనగునట్లు
చేయుచున్నారు. నీవున్నావన్నవిషయము సత్యమై వ్యాపించునట్లుగా అట్టి
పేదలనోదార్చి వారి పేదరికమును పోగొట్టుము. శ్రేష్టమైన మనసు కలవాడవయి వారి
కష్టములను మాపివేయుము.

12. శా. పున్నెంబే కద పేద సాదలకు ప్రాపుం గొల్ప నీవున్నచో
మన్నింపంబడు దీవెగా? దయను రామా! కావు మమ్మంచు వా
రున్నం గానవు, నీకు నొప్పగునొ? కాదో పాపమిట్లున్న? శ్రీ
మన్నారాయణ! శ్రీరమా రమణ! ప్రేమం జూపుమా వారిపై!  

భావము.   శ్రీమన్నారాయణా! నీవున్నట్లైనచో పేదసాదలకు ఆధారము కల్పించితివేని అది నీకు పుణ్యమే కదా. వారిచేత నీవేకదా గౌరవింపఁబడుదువు? రామా దయతో మమ్ము కాపాడుమయ్యా అనుచు పేదలు నిన్ను ప్రార్థించుచున్నను నీవు చూడవుకదా. ఇది నీకు సముచితమగునాయేమి? విధముగ చేసిన నీకు పాపమంటదా? రమారమణా! నీవు అట్టి వారిపై ప్రేమను చూపుము.

13. శా. కన్నుల్ ల్గఁగఁ జేసితీవె కనఁగా కన్నార నిన్ గానగాన్.
కన్నా! నిన్ గనుఁగొన్న మన్ననమెగా? కాన్పింప రావేలఁ, గా
కున్నన్ సర్వ జగంబునన్ గనమనా కూర్మిన్ నినున్? దేవ! శ్రీ
మన్నారాయణ! కాంతుమన్నిట నినున్ మర్మంబు పోకార్పినన్!  
భావము.   శ్రీమన్నారాయణా! ఆలోచింపగా కన్నులనిండుగా నిన్ను చూచుట కొఱకు నీవు మాకు కన్నులను కల్గునట్లు చేసితివి. కన్నయ్యా! నిన్ను చూచినచో మాకు గౌరవమే కదా. అటువంటప్పుడు మాకు కనిపించవేమి? విధము కానిపక్షమున సమస్త లోకమున ప్రేమతో నిన్నే చూడమనా. దేవా! మాలో మాయను నీవు పోవునట్లు చేసితివేని అన్నింటి యందును నిన్నే మేము చూచెదము.

14. శా. కన్నుల్ జూచెడి శక్తి కల్గియును నిన్ గాంచంగ లేవేలనో?
మన్నైపోయెడి దేహమందు కల నిన్ మర్యాదగా జూడలే
కున్నన్ గన్నులవేల మాకు? కననీవో నిన్ను గుర్తించి, శ్రీ   
మన్నారాయణ! దేహివౌచు గల నిన్ మా కండ్లతోఁ జూడనీ.   
భావము.   శ్రీమన్నారాయణా! కన్నులకు చూచెడి శక్తి యున్నప్పటికీ ఎందుచేతనో కాని నిన్ను చూడలేకపోవుచున్నవి మన్నైపోయే శరీరమునగల నిన్ను గౌరవప్రదముగా చూడలేకపోయినచో అట్టి కన్నులు మాకెందులకు? నిన్ను గుర్తించి చూడనీయవా యేమి? దేహధారివై మా రూపములో నున్న నిన్ను కన్నులతో చూడనిమ్ము.

15. శా. కన్నారన్ నినుఁ గాంచ వేడుక, జగత్ కల్యాణ రూపుండ! నే
నున్నానంతట చూడు నన్ననుచు మా యూహల్ నిజంబంచు, మా
పున్నెంబై కనిపించుమొక్కపరి. మేమున్ నీకు కన్పింప. శ్రీ
మన్నారాయణ నీదు మంచి కననీ. మాపూజలందించనీ. .
భావము. లోక కల్యాణ స్వరూపా! శ్రీమన్నారాయణా! మా కన్నులారా నిన్ను చూడవలెనని మాకు వేడుక. నేను అంతటా ఉన్నాను అనుచూ మా ఊహలు నిజమే అనుచు ఒక్కపర్యాము మేమూ నీకు కనిపించు విధముగా మా ముందు నిలిచి, మా పుణ్య ఫలమై కనిపించుము. నిన్ను మనసారా చూడనీ. మా పూజలు నీకు మేమందించునట్లు అనుగ్రహింపుము
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.