జైశ్రీరామ్
శ్రీమన్నారాయణ
శతకము.
రచన. చింతా రామకృష్ణారావు
1. శా. శ్రీన్నీవక్షమునందు నిల్పి, సుజన
శ్రేయంబు చేయించు నీ
వన్నన్ మాకు ప్రమోదమే. సుగుణ
సౌహార్ద్రంబులన్ మాకు మే
మున్నన్నాళ్ళునుఁ దక్కఁ జేతువని దీనోద్ధారకా! దేవ!. శ్రీ
మన్నారాయణ! సత్య సన్నుత గుణా! మద్భాగ్య సంవర్ధనా!
భావము. దీనోద్ధారకా!
ఓ దేవాది దేవా! సత్యము కారణముగా సన్నుతింపఁ బడెడి
గుణములు కలవాడా! నా భాగ్యమును ప్రవృద్ధి చేయువాఁడా! శ్రీమన్నారాయణా! మేమున్నన్నాళ్ళును సుగుణ సౌహార్ద్రంబులను మాకు కలుఁగ చేతువని లక్ష్మీదేవిని నీ వక్షస్థలముపై నిలిపి, మంచివారికి శ్రేయస్సును చేయించెడి నీవన్నచో మాకు చాలా యిష్టమే సుమా.
2. శా. నిన్నున్నే ధర నెంచఁగా తగుదునా? నీరేజపత్రేక్షణా!
పున్నామాదులనుండి కాచెదవుగా, పూజ్యుండ! నన్నెంచుచున్.
మన్నింతున్ మది నిన్ను నేను. కనుమా మర్యాదనే నిల్పి, శ్రీ
మన్నారాయణ! కావుమీజగతిఁ బ్రేమన్ మీ రమా సాధ్వితోన్.
భావము. ఓ శ్రీమన్నారాయణా! ఓ పద్మనేత్రుఁడా!
భూమిపై నిన్ను నేను ఎంచుటకు సరిపోదునా? ఓ పూజ్యుఁడా! నన్ను గుర్తించుచు పున్నామాది నరకముల నుండి మమ్ము కాపాడుదువు కదా. నిన్ను గుర్తించి నేను గౌరవింతును. నామర్యాద నిలిపుచు, లోకమును ప్రేమ అతిశయించు మీ రమా సాధ్వితో కాపాడుము.
3. శా. క్రన్నన్ గావఁగ వచ్చి ప్రోతు వనుచున్, కన్పింతువీవంచు నో
కన్నా! చిత్త కవాటమున్ దెరచి, నీకై వేచి నేనుంటి, నా
కన్నుల్ కాయలు కాచుచుండె, నయినన్ గన్పింప రావేల? శ్రీ
మన్నారాయణ! గాంచ నేరనొ నినుం భాసించుచున్నన్ హృదిన్.
భావము. ఓ శ్రీమన్నారాయణా! ఓ కన్నతండ్రీ! వేగమే కాపాడుటకు వచ్చి నన్ను కాపాడుదువనియు, నీవు నాకు కనిపింతువనియు, నా హృదయ కవాటమును తెరచి నీకై వేచి యుంటిని. నా కన్నులు కాయలు కాచుచుండెను అయినప్పటికీ నీవు నాకు కనిపించగా రావేమి? నా హృదయముననే నీవు ప్రకాశించుచున్నప్పటికీ నిన్ను చూచుట నే నెఱుఁగకుంటినా?
4. శా.
అన్నా కేశవ! మాధవా! నృహరి! మోహాతీత! గోవింద! రా
మన్నా! కృష్ణుడ! వామనా! సకల ప్రేమాధార! విశ్వేశ! యే
మన్నన్ నీదు ప్రశస్తనామమగు. మోహాంధంబునే బాపు. శ్రీ
మన్నారాయణ! నీదు నామ మహిమన్ మమ్మున్ సుఖంబందనీ.
భావము. ఓఅన్నా. శ్రీమన్నారాయణా! కేశవా! మాధవా ! నరహరీ ! మోహాతీతుడా ! గోవిందుడా! ఓ రామన్నా ! ఓ కృష్ణుడా! వామనా! సమస్తమైన ప్రేమాధారమైనవాడా! ఓ లోకేశా! మేము ఏది పలికినప్పటికీ అది నీ యొక్క.పేరే యగును. మోహాంధకారమును పోగొట్టును. నీ నామ మహీమచే మమ్ములను సుఖమునందనిమ్ము. పోగొట్టెడివాడా. నీ నామ మహీమచే మమ్ములను సుఖమునందనిమ్ము.
మన్నా! కృష్ణుడ! వామనా! సకల ప్రేమాధార! విశ్వేశ! యే
మన్నన్ నీదు ప్రశస్తనామమగు. మోహాంధంబునే బాపు. శ్రీ
మన్నారాయణ! నీదు నామ మహిమన్ మమ్మున్ సుఖంబందనీ.
భావము. ఓఅన్నా. శ్రీమన్నారాయణా! కేశవా! మాధవా ! నరహరీ ! మోహాతీతుడా ! గోవిందుడా! ఓ రామన్నా ! ఓ కృష్ణుడా! వామనా! సమస్తమైన ప్రేమాధారమైనవాడా! ఓ లోకేశా! మేము ఏది పలికినప్పటికీ అది నీ యొక్క.పేరే యగును. మోహాంధకారమును పోగొట్టును. నీ నామ మహీమచే మమ్ములను సుఖమునందనిమ్ము. పోగొట్టెడివాడా. నీ నామ మహీమచే మమ్ములను సుఖమునందనిమ్ము.
5. శా. ఎన్నం జాలుదె? నీ ప్రసిద్ధ పద సంస్పృత్యంబు నా చిత్తమం
దెన్నెన్నో మహిమల్ కనం బరచునే దృగ్గోచరంబైన నో
కన్నా! నా కనులార చూచుటకు నే కాంక్షించుదున్. నీవె శ్రీ
మన్నారాయణ! నీదు పాద వరపద్మమ్ముల్ కనం జేయుమా.
భావము. ఓ దేవా! శ్రీమన్నారాయణా! నీ ప్రసిద్ధమైన పాద స్పర్శను కనీసము నేను మనసున ఊహించుటకైనను సరిపోదునా? ఓ కన్నతండ్రీ! నా కంటికి ఆ పదములు కనిపించినచో ఎన్నెన్నో మహిమలను చూపించును కదా. అట్టి నీ పాద పద్మములను నా కనులారా చూడవలెనని నేను కోరుకొందును. నీవే నీ పాద పద్మములు నాకు చూచునట్లుగా చేయుము.
(సశేషమ్)
జైహింద్.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.