జైశ్రీరామ్
శ్రీమన్నారాయణ శతకము.
రచన. చింతా రామకృష్ణారావు
41. శా. సున్నా పూర్ణము. సృష్టి మూలము. సుధీశుల్ నిన్ను పూర్ణంబుగా
నెన్నున్ గావున నీవు పూర్ణమగుదో? యెన్నన్ మహత్ పూర్ణుగా
కన్నుల్ గానఁగ లేని రూపమున నాకాశంబునన్ నిండి, శ్రీ
మన్నారాయణ! మొత్తమీవె యగుదో? మన్నించి నన్ దెల్పుమా.
భావము. సున్నాయే పూర్ణమని, సృష్టికి మూలమని జ్ఞానులు నిన్ను పూర్ణ స్వరూపుఁడవని, భావింతురు. కావున
నీవు పూర్ణ స్వరూపుఁడవా? పరిశీలించి చూచినచో మహత్తరమైన పూర్ణ స్వరూపుడుగా కన్నులు చూడలేని సుస్వరూపమున ఆకాశమంతయు నిండియుండి మొత్తమంతా నీవే నిండి యున్నావా? నన్ను
మన్నించి నాకు తెలియఁ జేయుము.
42. శా. అన్నంబెవ్వనిచే సృజింపఁబడునయ్యాద్యుండు
రైతన్నయే.
మన్నింపంబడునెల్ల
వేళలను, సమ్మాన్యుండ
నీచేతనే.
ఎన్నాళ్ళైనను
మారనట్టి బ్రతుకై యిబ్బందులన్ బొందు. శ్రీ
మన్నారాయణ! హాలికున్ గనుమ ! సమ్మాన్యున్ గృపన్ బ్రోవుమా.
భావము. ఓ శ్రీమన్నారాయణా! మేము తినెడి ఆహారమైన అన్నము ఎవనిచే సృజింపఁబడుచున్నది? ఆ ఆది పూజ్యుఁడు వ్యవసాయము చేయు రైతన్నయే కదా. సన్మానింపఁబడువాడా ! ఆతఁడు ఎల్ల సమయములందు నీచేతనే మన్నింపఁబడు చుండును కదా. అట్టి ఆ రైతన్న బ్రతుకు ఎన్నాళ్ళైనను మారక ఎప్పుడూ ఇబ్బంది పడుతూనే ఉండెను కదా! అట్టి హాలికుని నీవు కరుణతో చూడుము. సన్మాన్యుఁడైన అతనిని ఎల్లప్పుడు నీవు కాపాడుచుండుము.
43. శా. ఖిన్నుండై తపియించు హాలికుననకున్ కేలిచ్చి కాపాడి నీ
వున్నావన్న నిజంబు
నెన్నునటు నీవున్నన్ నిరూపించు. భా
వౌన్నత్యుండగు
హాలికున్ కనుము స్నేహార్ద్రాంతరంగుండ! శ్రీ
మన్నారాయాణ! పోతనన్
గనితివే! మా రైతులన్ గానవో?
భావము. శ్రీమన్నారాయణా! వ్యవసాయము చేయు హాలికుడు కష్టములవలన శోకించుచు మిక్కిలి తపించుచుండెను అట్టి రైతునకు నీచేతిని అందించి సహాయపడి నీవు ఉన్నావన్న సత్యమును గుర్తించునట్లు నీవు న్నటులైన నిరూపించుము.
స్నేహముతో ఆర్ద్రమగు మనస్సు కలవాడా! ఉన్నత
భావములు కలిగియున్న రైతును చూడుము. పోతన్నను చూచితివికదా, మాకు ఆహారము పండించు రైతులను కాపాడకుందువా?
44. శా. కన్నా! నీ పద సేవకై విరులు వేగంబే విడున్ బ్రొద్దుటే.
వన్నెల్ చిన్నెలు నీ పదాంకితముగా భావించి పొంగున్ మదిన్,
మున్నేపున్నెము చేసెనో కనగ నీ పూవుల్ నినున్ జేర. శ్రీ
మన్నారాయణ! నా హృదబ్జమును ప్రేమన్ నిన్నికన్ జేరనీ.
భావము. ఓ కన్నా! పూవులు నీ పాద సేవకొఱకు ప్రొద్దున్ననే వేగముగా వికసించును. తమ వన్నెలు, చిన్నలు నీపాదములకంకితమగునని మనసులో భావించుకొనుచు పొంగిపోవుచుండును. నీపాదములను చేరుటకు ఈ పూవును పూర్వము ఎటువంటి పుణ్యమును చేసియుండెనోకదా! ఓ శ్రీమన్నారాయణా! నా హృదయ పద్మమును కూడా ఇంక ప్రేమతో నిన్ను చేరనిమ్ము.
45. శా. పున్నెంబో, మరి పాపమో యెఱుగ
నేన్. పుష్పంబులన్
గోయుచున్ ,
నిన్నున్ పూజలొనర్చుచుంట. జగతిం ధీశాలి పాపయ్య తా
నెన్నెన్ పుష్ప విలాపమున్ , తెలుసుగా. హృద్యంబుగానుండు. శ్రీ
మన్నారాయణ ! పుష్పముల్ తునుముటన్ మాకబ్బవా పాపముల్ ?
నిన్నున్ పూజలొనర్చుచుంట. జగతిం ధీశాలి పాపయ్య తా
నెన్నెన్ పుష్ప విలాపమున్ , తెలుసుగా. హృద్యంబుగానుండు. శ్రీ
మన్నారాయణ ! పుష్పముల్ తునుముటన్ మాకబ్బవా పాపముల్ ?
భావము. ఓ శ్రీమన్నారాయణా! పుష్పములను తునిమి నీకు పూజలు చేయుచుండుట అను పని పుణ్యమో లేక పాపమో నేను ఎఱుఁగను. లోకమున ధీశాలియైన జంధ్యాల పాపయ్యశాస్త్రి పుష్ప విలాపమును గుర్తించి ఖండికగా వ్రాసెను. ఆ విషయము నీకు తెలుసును కదా. అది మిక్కిలి హృద్యమైన ఖండిక. ఆ విధముగ పుష్పములు తునుముట వలన మాకు పాపములు కలుగునా?
జైహింద్.
1 comments:
నమస్కారములు
శ్రీమన్నారాయణుని స్తుతిస్తూనే , రైతులబాధలనూ , జంధ్యాలవారి పుష్ప విలాపములనూ , జోడించి చక్కని శార్దూల వృత్తములను రస రమ్యముగా రచించిన ప్రతిభ కొనియాడ దగినది. . ఇలాగే మరిన్ని మాకండిమ్చ వలసిందిగా కోరుతూ దీవించి అక్క.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.