గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

25, ఏప్రిల్ 2018, బుధవారం

శ్రీమన్నారాయణ శతకము. 6/20వ భాగము. 26 నుండి 30 రచన చింతా రామకృష్ణారావు

జైశ్రీరామ్
శ్రీమన్నారాయణ శతకము.
రచన. చింతా రామకృష్ణారావు
26. శా. ఉన్నామంచు నహంకరించితిమొ, మేమున్నట్లు సాక్ష్యంబుగా
మన్నున్ జేరక వన్నెలన్వెలుగుచున్ మాన్యత్వమున్ జూపనౌ
నెన్నాళ్ళైనను. కాని లేమటుల మా యిచ్ఛానుసారంబు. శ్రీ
మన్నారాయణ! నీవె మేమగుటచే మాయన్నదే లేదుగా!   
భావము.  మేముంటిమి అని అహంకరించుచు మేము ప్రవర్తించుదుమా? అట్లైన మా ఉనికికి సాక్ష్యముగా ఎన్నటికీ మట్టిలో కలియకుండా, ఏన్నాళ్ళైనను కళ కాంతులతో మా మాన్యత్వమును ప్రదర్శింప వలెను కదా? మరి మేము కోరుకొను విధముగా మేము ఉండలేము. శ్రీమన్నారాయణా! నీవే మేమయి యుండగా మరి మా అనేది ఎక్కడ కలదు? అంతా నీవే సుమా!      

27. శా. నిన్నున్ నమ్మిన మేలటంచు సుజనుల్ నిత్యంబు నమ్మున్ నినున్,
నిన్నున్ నన్నును నమ్ముకొన్న ఘనులన్ నేర్పున్ గృపం గావుమా
పన్నత్రాతగ నిల్చి, భక్త సులభా! ప్రారబ్ధముల్ బాపు శ్రీ
మన్నారాయణ! మంచి మార్గమిడు సంపత్కారకా శ్రీధరా!  
భావము.   శ్రీమన్నారాయణా! నిన్ను నమ్మినచో తప్పక మేలు కలుగుననుచు భావించి సుజనులు నిన్నునమ్ముదురు. నిన్ను నిన్నుగూర్చి తెలిపెడి నన్నును నమ్ముకొనెడివారిని నిత్యము కృపతో కాపాడుము. సంపత్కారకా! శ్రీధరా! భక్త సులభా! ఆపదలనుండి రక్షించువాడివై నిలిచి మా ప్రారబ్ధములు పోఁగొట్టి, మాకు మంచి మార్గమిడుము.

28. శా. నిన్నే గంటిని పండితాళి మదులన్ నేర్పార నుండంగ, ని
న్నెన్నున్ మన్నన నా సుధీమణి గణం బేమా మహత్వంబు! మా
కన్నుల్ ముందర నిన్ను నిల్పుదురు రాగ ద్వేషముల్ బాప, శ్రీ
మన్నారాయణ! పండితాళి మదులన్ భాసింతువో నిత్యమున్?  
భావము.   శ్రీమన్నారాయణా! పండితుల మనసులలో నీవు నైపుణ్యముతో ఉండగా నేను వారిలో నిన్నే చూచితిని. జ్ఞానుల సమూహము మన్నన చేయుచు వారి మనసులలో నిన్నే ఎన్నును. అహా! ఏమా గొప్పఁదనము! మాలోని రాగద్వేషాదులను మటుమాయము చేయుట కొఱకు నీ గాధలు తమ ఉపన్యాసములద్వారా ఆవిష్కరించుచు మా కన్నులముందు నిన్ను నిలుపుదురుకదా. నీవు ఎల్లప్పుడు పండితుల మనసులలో ప్రకాశించుచుందువా?

29. శా. కన్నుల్ నిండుగ కాంతిరేఖలవిగో కారుణ్యమున్ వెల్గుచున్,
మిన్నున్ మించెడి నీలివర్ణమదిగో మేలైన దేహమున్,
కన్నుల్ పండువ కాదె కాంచ నిను శ్రీకాంతా శుభోపేత! శ్రీ
మన్నారాయణ! భక్త పాలన గుణా! మాకళ్ళలో నుండుమా!
భావము.  భక్తపాలనగుణసంపన్నుడవైన శ్రీమన్నారాయణా! ఆహా! మా కన్నులు నిండుగా కారుణ్యముతో ప్రకాశించుచు కనిపించు నీ కాంతిరేఖలు అవిగో, కనిపించుచున్నవి. ఆకాశమును మించిపోయెడి నీలివర్ణము అదిగో నీ శరీరమున కానవచ్చుచున్నది. శ్రీకాంతుడా! శుభోపేతుఁడా! నిన్ను చూచినచో కన్నులపండువేకదా. నీవు మా కళ్ళలోనే ఉండిపొమ్ము.

30. శా. ఎన్నో జన్మలు ఘోరమైన తపముల్ హృద్యంబుగా చేసినన్
న్నిన్నుం జూడఁగఁ జాలరైరి ఋషులో నిత్యుండ! నీవే మమున్
గన్నారన్ గనమంచు చూపుదువు నీ కల్యాణ రూపంబు. శ్రీ
మన్నారాయణ! సర్వమీవె కద! ప్రేమన్ జూతుమన్నింట నిన్.  

భావము. నిత్యుఁడవైన శ్రీమన్నారాయణా! ఘోరమైన తపస్సులు ఎన్నో జన్మలు హృద్యముగా చేసినప్పటికి ఋషులు నిన్ను చూడలేకపోయిరి. నీ మంగళప్రదమైన రూపమును మమ్ములను కనులారా చూడమని చూపుదువు నీవు. అంతా నీవే కదా. నిన్ను మేము అన్నింటియందును ప్రేమతో చూచెదము
జైహింద్. 
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
అలతి అలతి పదములతో అర్ధవంతమైన శ్రీమన్నారాయణ శతకమును చదవగల అదృష్టమును కలిగించిన మీ ప్రతిభ శ్లాఘనీయము.ఇలాగే మరిన్ని శతకములు వ్రాయవలెనని దీవించి అక్క .

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.