గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

29, ఏప్రిల్ 2018, ఆదివారం

శ్రీమన్నారాయణ శతకము. 10/20వ భాగము. 46 నుండి 50 రచన చింతా రామకృష్ణారావు

జైశ్రీరామ్
శ్రీమన్నారాయణ శతకము.
రచన. చింతా రామకృష్ణారావు
46. శా. నన్నున్ గావగ రమ్ము నీవనినచో నా స్వార్థమే యౌను. నీ
వున్నావందరికోసమంచు కని , దీనోద్ధారకా ! స్వార్థమున్
మున్నే వీడి , నమస్కరించుట తగున్ , పూజ్యుండ ! నీపైన శ్రీ
మన్నారాయణ !  భారముంచ , కృపతో మన్నించి రక్షింపవో
భావము.  దీనోద్ధారకుడవైన ఓ శ్రీమన్నారాయణా ! నన్ను కాపాడుట కొఱకు నిన్ను రమ్మనినచో అది నా స్వార్థమే అగును కదా. ఆ విధముగా కాక , నీవున్నది ఆందరికోసమూనని భావించి , స్వార్థమును వీడి , నీకు నమస్కరించి , నీపై భారము వేసినచో కృపతో నీవే మమ్ము రక్షింపకుండా ఉండ గలవా?

47. శా. పిన్నల్ పెద్దలు మంచి చెడ్డలనుచున్ పేర్కొంచు సిద్ధాంతముల్
నిన్నున్ నమ్మిన వారినెన్ని పలుకన్  నీవారు సందేహులై
యూన్నావంచును లేవటంచు మదినెన్నో భావముల్పొంద, శ్రీ
మన్నారాయణ ! సత్యమున్ దెలుపుచున్ మాన్పింతువే శంకలన్. 
భావము.  ఓ శ్రీమన్నారాయణా ! చిన్నవారూ , పెద్దవారూ కూడా నిన్ను నమ్మియున్న భక్తుల వద్ద ఇది మంచి , ఇది చెడ్డ అనుచూ ఏవేవో సిద్ధాంతీకరించి చెప్పుచుండుట చేత నీ భక్తులు సందేహములో పడినవారై నీవు ఉన్నావని , లేవని , మనసులో అనేక భావములను పొందుచుండ, నీవు సత్యమును తెలియ జేయుచు సందేహములను పారద్రోలుదువు కదా.

48. శా. భిన్నత్వంబుననేకతన్ గలిగి నీవే మాకునన్నింటిలో
నున్నావంచు నెఱుంగఁ జేయు మతితో నొప్పారితో ? కానిచో
కన్నుల్ ముందట నుండి యుందువు కదా కన్పించుచున్ మాకు. శ్రీ
మన్నారాయణ ! మా ముదంబు కొఱకై మా ముందె నీవుండుమా !     
భావము. ఓ శ్రీ మన్నారాయణా!  అన్నింటిలోను మాకు నీవు ఉన్నావనుచు తెలుపుట కొఱకు మా ముందే భిన్నత్వములో ఏకతను కలిగి  యుంటివా? అటుల కానిచో మా కన్నుల ముందరే మాకు కన్పించుచు ఎదురుగా ఉండెడివాడవు కదా.  మా సంతోషము కొఱకై మాకు ఎదురుగా ఉండుము.

49. శా. కన్నుల్ మూసిన నీ పదాబ్జములనే కాంచన్ మదిన్ గోరుదున్.
కన్నుల్ చూచిన నీ స్వరూపమొకటే కాంక్షింతు చూడంగ. నీ
సాన్నిధ్యంబునె కోరుదున్నిరతమున్ సాయుజ్యముం గోరి. శ్రీ
మన్నారాయణ ! మార్గమీవె కద సన్మార్గంబు నే చేరగన్.
భావము.  ఓ శ్రీమన్నారాయణా ! నా కన్నులు మూసియున్నప్పుడు నీ పాదపద్మములనే చూడ గోరుదును.  నా కన్నులు చూచుచుండు సమయమున నీస్వరూపమును మాత్రమే చూడ గోరుదును. నీ సాయుజ్యము చేరుటకు ఎల్లప్పుడు నీ సాన్నీధ్యమునే కోరుదును. నేను సన్మార్గమును జేరుటకు మార్గము నీవే కదా!

50. 
శా. నిన్నే సూర్యునిగా తలంచితినిపో నీవుండవే రాత్రులన్.
నిన్నే చంద్రుడవంచు నెంచ గనినన్ నీవుండలేవే పవల్.
నిన్నున్ వాయువనంగ న్యాయమగునీ నిశ్వాస, యుచ్ఛ్వాస, శ్రీ
మన్నారాయణ ! నీవె రాత్రి, పవలున్మా ప్రాణశక్తి ప్రదా !    

భావము. మాప్రాణశక్తినొసగువాడా ! శ్రీమన్నారాయణా ! నిన్నే నేను సూర్యునిగా భావించినచో నీవు రాత్రులందు కానరావు కదా. పోనీ చంద్రునిగా తలంచుదమన్న నీవు పగలు కానరావు. నిన్ను వాయువుగా భావించుటయే న్యాయము.  ప్రాణికోటికి ఎల్ల వేళల ఈ ఉచ్ఛ్వాస , నిశ్వాస నీవేకదా.  
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారమలు
అన్ని పద్యములు అలరించు చున్నవి " కన్నుల్ మూసిన నీపదాబ్జ మూలానే " అద్భుతంగా ఉంది. సంతోషం. . ఆశీర్వదించి అక్క

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.