గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

1, మే 2014, గురువారం

పారిజాతాపహరణ కావ్యంలోని అనులోమ విలోమ కందము

జైశ్రీరామ్.
ఆర్య్తులారా! నంది తిమ్మన పారిజాతాపహరణ కావ్యంలో పంచమాశ్వాసంలో అనులోమ విలోమ కందం రచించి తనకు గల చిత్ర కవితా నైపుణ్యాన్ని కనబరిచాడు. చూడండి.
కం. నాయశరగసారవిరయ – తాయనజయసారసుభగధరధీనియమా                                                         మాయనిధీరథగభసుర – సాయజనయతాయరవిరసాగరశయనా                                                                     ఈ పద్యం మొదటినుండి చివరికి చదివినా చివరినుండి మొదటికి చదివినా ఒకేలా ఉండడం వలన దీనకి అనులోమవిలోమమని పేరు. అందులో ఉన్న అర్థాన్ని పరిశీలిద్దాం.                   సార అంటే బలమైన, శ్రేష్ఠమైన అని శబ్దరత్నాకరము. గ శబ్దం   గమనానికి సూచన. వి అంటే విశేషమైన. రయమంటే వేగం. నాయ శబ్దానికి పద్ధతి, దిశ, నీతి అని నిఘంటువు. తాయన అంటే బాగుగా సాగుచున్న అని నిఘంటువు. కాబట్టి నాయ–శరగ–సార–విరయ–తాయన–జయసార అనే మొదటి విశేషణాన్ని నాయ–వి–రయ–గ–సార–శర–తాయన–జయ–సార గా అన్వయించుకోవచ్చు. పద్ధతిగా విశేషమైన వేగంతో ప్రయాణించే శ్రేష్ఠమైన బాణాలవలన కలిగిన చక్కటి జయించే చేవ ఉన్నవాడు అని అర్థం.   సుభగుడు అంటే మనోహరమైనవాడు, భాగ్యవంతుడు.ధీ అంటే బుద్ధి. ధర అంటే భూమి అనీ కొండ అనీ అర్థాలు (ధర ధరించేది). నియమ శబ్దం మొక్కవోని వ్రతాన్ని సూచిస్తుంది. కాబట్టి ధీ నియమం అంటే బుద్ధికి సంబంధించిన వ్రతం. ఎలాంటి వ్రతం? భూమిలాంటి (లేదా కొండవంటి). ఏమిటి దీని అర్థం? నిశ్చలమైన అని తీసుకుంటే భూమికైనా కొండకైనా సరిపోతుంది. కాబట్టి నిశ్చలమైన (మార్చరాని) బుద్ధినియమం కలవాడు. మాయనిధీ వేరు మాయానిధీ వేరు. మాయానిధీ అంటే మాయకు నిలయమని. ఇక్కడ మాయనిధీ అంటున్నాడు కాబట్టి మా అయ నిధీ అని చెప్పుకోవాలి. అయమంటే మేలు కలుగజేసే వస్తువు/దైవము అని శబ్దరత్నాకరము. మా అంటే లక్ష్మి. కాబట్టి మాయనిధీ అంటే లక్ష్మికీ మేలుకీ నిలయమైనవాడు.  రథమంటే తేరు, శరీరము అని శబ్దరత్నాకరము. భ శబ్దం కాంతికి సూచిక. గ శబ్దం ధరించడాన్ని కూడా సూచిస్తుంది. కాబట్టి భ–సుర–రథ–గ అంటే కాంతివంతులైన దేవతలను శరీరమునందు ధరించినవాడు. అంటేసర్వదేవస్వరూపుడు. సాయమంటే బాణము. నయమంటే న్యాయము. కాబట్టి సాయ–జ–నయ అంటే బాణము(ల) ద్వారా పుట్టిన న్యాయం కలవాడు.    తాయ్ ధాతువు విస్తరించడం అనే అర్థంలో వాడుతారు అని నిఘంటువు. ర అంటే కాంతి, గమనం, అగ్ని, కామం, ధారణ… అని నిఘంటువు. కాబట్టి తాయరవిర అంటే రవి–ర–తాయ రవికోటితేజుడు అని. సాగర శయనా అంటే సముద్రమే పాన్పుగా కలవాడు. ఈ పద్యంలో గమ్మత్తు మొదటినుండి చివరికి చదివినా చివరినుండి మొదటికి చదివినా ఒకేలా ఉండడం. దీనకి అనులోమవిలోమమని పేరథ వివరణలో పెద్దల బుద్ధి కుశలత శ్లాఘనీయమైనది.
జైహింద్.
Print this post

2 comments:

కందుల వర ప్రసాద్ చెప్పారు...

శ్రీ చింతా రామ కృష్ణా రావు గురుదేవులకు పాదాభి వందనములతో ...

శ్రీ నంది తిమ్మన గారి అనులోమ విలోమ కంద పద్యము, అర్థము తెలియ జేసితిరి. లేకున్న ఆ పద్యము నేటి విధ్యార్థులకు అర్థము కాదు (నాకు కూడా ).
మంచి మంచి విషయములు తెలియ జేయు చున్న మీకు ధన్యవాదశతము .

శిష్య పరమాణువు
వరప్రసాదు .

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
పారిజాతాపహరణం లోని ఈ అనులోమ విలోమ పద్యములు , చురికా బంధము నాగబంధము ,ఇవన్నీ నాకు చాల ఇష్టము . ఇన్నిచందస్సులు ఉంటాయన్న సంగతి అప్పుడేతెలిసింది కాక పోతే అర్ధము తెలియదు శ్రీ చింతా వారి దయవలన తెలుసుకో గలిగాను ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.