గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

31, మే 2012, గురువారం

వైద్యో నారాయణో(హరీ) హరిః .

జైశ్రీరామ్
ఆర్యులారా! మీరు మీ ఆరోగ్య విషయంలో తీసుకొంటున్న జాగ్రత్తలలో మెలకువగా ఉండాలనుకొంటున్నారా? ఐతే  నిర్లక్ష్యం చేయక ఈ క్రింది వీడియో చూస్తూ జాగ్రత్తగా వినండి. సత్యం తెలుసుకొని, మీ ఆలోచనకు మెఱుగు పెట్టండి. హాయిగా ఆరోగ్యంగా ఆనందంగా జీవించండి, జీవింప జేయండి. సత్యమేవ జయతే. ఇక చూడండి.

ఇక అనుభవజ్ఞులైన మన పెద్దలు ఎప్పుడో మనకు చెప్పిన మాటలు చూడండి.

కలి విడంబన శతకంలో ఒక శ్లోకమున్నది. అది చమత్కారమో లేక కొందరి విషయంలో నైనా యదార్థమో మీరే ఆలోచించెదరు గాక. ఇక శ్లోకమును, అనువాదమును, భావమును చూడండి.

శ్లో:-
వైద్య రాజ నమస్తుభ్యమ్. యమ రాజ సహోదరా!
యమస్తు హరతి ప్రాణాన్. వైద్యః ప్రాణాన్ ధనానిచ!!
ఆ:-
వైద్య రాజ! నీకు వందనంబులు సేతు.
యముని సోదరుండ! అందుకొనుమ!
యముడు ప్రాణముగొను. యమ సోదరుండ! మా
ధనము, ప్రాణములను గొనుదు వీవు.
భావము:-
యముని సోదరుడవైన ఓ వైద్య రాజా! నీకు నమస్కారము. ఎందుకన - యముడు ప్రాణాలనే తోడును. వైద్యుడవైన నీవు మా ప్రాణాలనీ, ధనాన్నీ కూడా హరిస్తావు కదా! కాన మా జోలికి నీవు రాకుండా ఉండడానికి నీకు నమస్కరిస్తున్నాను సుమా!
పూర్వం ప్రజానీకానికి "వైద్యో నారయణా" అని కీర్తింప బడే విధంగా వైద్యులు తమ వైద్యాన్నందించి ప్రాణాలు కాపాడేవారు. కాని నేటి పరిస్థితి అందుకు పూర్తి విరుద్ధంగా ఉందనిపిస్తోంది. వైద్యం కోసం రోగి వెళ్ళితే దీనినే అవకాశంగా తీసుకొని,   అత్యవసరం అని కొందరు డాక్టర్లు, అవసరమని  కొందరు డాక్టర్లు,  అనవసరంగా  కొందరు డాక్టర్లు అక్కర లేని వైద్య పరీక్షలు జరిపించుతూ  రోగి జేబు ఖాళీ చేయిస్తున్నవారు ఉండడం నేటి డాక్టర్లలో మనం చూస్తుంటాం.
మానవ జన్మ చాలా గొప్పది. అందులోనూ వైద్య శాస్త్రం అధ్యయనం చేసే భాగ్యం కలగడం చాలా అదృష్టం. అలా వైద్యులైన వారు చాలా మంది తమ స్వార్థానికి దూరంగా ఉంటూ అత్యవసర వైద్య సేవలో తమ జన్మ ధన్యం చేసుకొనే పుణ్య మూర్తులు సాక్షాత్తు మానవాకృతిలోనుండు మహనీయ పరమాత్మలు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. అట్టి మహనీయ మనీషులే మానవాళికి ప్రథమ పూజ్యులు.
ఉ:-
వైద్యము నభ్యసించి, తన వారికి కూడ సుదూరమౌచు, " నా
బాధ్యత" వైద్య సేవ యని, భక్తిగ రోగికి సేవ చేయుచున్,
సద్యశ మందుచున్న మిము సర్వ విధంబుల దైవ మెప్పుడున్
హృద్యముగా కనుంగొనుత! సృష్టిని ముఖ్యుఁడ! వైద్య పుంగవా!
అని మహాత్ములైన భిషగ్వరులకు పాదాభి వందనం చేస్తున్నాను.
వైద్యాన్ని ఆసరాగా చేసుకొని, ధన మాన ప్రాణాలతో చెలగాటమాడే వైద్యులు మాత్రం అంతకు అంతా పరిహారం చెల్లింపక తప్పదన్న విషయం మాత్రం యదార్థం. అది దైవ శాసనం.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నిజమే ఈ రోజుల్లో వైద్య వృత్తి ఒక వ్యాపారంగా నడుస్తోంది. ఉన్న ఆనారోగ్యం తగ్గక పోగా కొత్తవి రావడం కద్దు . బహుశా , కలి ప్రభావం కావచ్చును . ఈ వ్యవస్థ మారేదెన్న డో ?

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.