జైశ్రీరామ్
వరూధినీ ప్రవరులు.
అంతఁ జని దానిం గనుంగొనుమన మున. ౨౧.
అపుడు ప్రవరుఁడు ఆ వనమును కనుగొన వలెనను మనమున చని.....
చః-
కనె నవరత్న భాసితముఁ, గాంచన శోభిత, మార ఘట్ల మం
డన కదళీ వనాంతము, ఘన స్వన బంభరవా సిత ప్రఫు
ల్ల నవ సుమాతిగంధి మృదులచ్ఛదరాజి లతా ప్రతాన నీ
కనదురు కాయమాన పరి కల్పిత శీత మనోజ్ఞ హర్మ్యముల్. ౨౨.
నవరత్న భాసితము, కాంచన శోభితము, ఆరఘట్ట(ఏతము)మండన(అలంకారముగాఁ గల) కదళీ వనాంతమున నున్నదియు, ఘనముగా స్వనము చేయు చున్న బంభర ములకు నివాసిత మై యున్న, ప్రఫుల్ల నవ సుమముల అతిశయించిన సుగంధ పరీమళముల చేత, మృదులమైన ఛద (లేత యాకుల) రాజి (జొంపములచేతను) లతా ప్రతాననీ (అల్లుకొనిన తీగల గుబుల చేతను) కనత్(విలసిల్లుచూ) ఉరు(విశాలమైన) కాయమాన(పందిళ్ళచే) పరి కల్పిత(ఏర్పాటు కాబడున) శీత మనోజ్ఞ హర్మ్యమును ప్రవరుఁడు కనెను.
కః-
కనుఁగొని హర్మ్యోపాంతం - బునకుం జని లోనికేఁగఁ బొలఁతి యొకతె వీ
ణను బూని కంఠ నాదం - బును మేళము సేసి గానము సలుపఁ జూచెన్. ౨౩.
ఈ విధముగ ప్రవరుఁడు కనుఁగొని, హర్మ్యోపాంతమునకు చని, లోనికి ఏగఁగా, పొలతి యొకతె వీణను పూని, కంఠ నాదంబును వీణా నాదముతో మేళన చేసి, గానము సలుపు చుండగా చూచెను.
ఆః-
అంత నాకె యంద మారసి వేవేగ - వచ్చి విభుని చాయ భావమంచు,
మెచ్చి మనుజ వర్య! మీర లేలిన నన్ను - మిన్న యంచు జనము నెన్నకుంద్రె? ౨౪.
అంతట ఆకె(వరూధిని) ఆ ప్రవరును అందము ఆరసి, వేవేగ వచ్చి, విభుని చాయను(భర్త యనునట్లు) భావమందు మెచ్చి, మనుజ వర్య! మీరలు నన్ను ఏలినచో జనులు నన్ను అన్నుల మిన్నగా ఎన్నకుందురా? అనెను.
కః-
అనిన నేకతంబుగను వనంబున నీవు - వచ్చి యుంటివ! బల!! యిచ్చటికిని
దారిఁదప్పిపోక నేరక యుంటి, మా - ర్గమ్ముఁ జూపుమన్న నెమ్మి ద్విజుఁడు. ౨౫.
వరూధిని ఆ విధముగ అనిన, ద్విజుఁడైన ఆ ప్రవరుఁడు ఓ అబల!వనంబున ఇచ్చటికిని, ఏ కతంబు (కారణంబు) గను, నీవు వచ్చి యుంటివి? దారి తప్పి, పోక నేరక, ఉంటిని.నెమ్మి(తగు విధముగ)మార్గమ్మును చూపుము. అనగా.....
(సశేషం)
జైహింద్.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.