గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

20, మే 2012, ఆదివారం

వసు స్వారోచిషోపాఖ్యానము (ద్వ్యర్థి కావ్యము) మను చరిత్ర పరముగ అర్థ వివరణము. 04 / 14

జైశ్రీరామ్
వరూధినీ ప్రవరులు.
ఆః-
అతని రాకఁ జూచి, హర్షంబుతో నెదు - రేగి, గౌరవింప నెంచి తోడి
తెచ్చి యిష్ట వస్తు దృప్తిని దేలించి - మెలఁగు నా సమీర మెలసి యంత.౧౬
అంత ఆ ప్రవరుఁడు అతని రాకఁ జూచి, హర్షంబుతో నెదురేగి, గౌరవింప నెంచి, తోడి తెచ్చి, ఇష్ట వస్తు(సమర్పణమున)తృప్తిని దేలించి, తన మదిలో మెలగు నాస అతిశయింపగా, మెలసి (వర్తించి)
గీః-
చెలఁగ నీ రెందుఁ బోవుచు క్షితిని నిందు - రాక యయ్యెను సిద్ధ మహా కుతుకము,
తీర్థములఁ జూచు వేడుక దీర్ఘమయ్యె. - ననఁ బసరు పూసెనంతట ఘనము గాఁగ . ౧౭.
ఒ సిద్ధా! క్షితిని చెలగన్ ఈరు ఎందుఁ బోవుచు ఇందు(ఈ ప్రదేశమునకు)  రాక? మహా కుతుకము అయ్యెను.  తీర్థములను చూచు వేడుక నాకు దీర్ఘమయ్యెను.  అని అనన్ గా అంతట( ఆ ప్రవరునకు ఆ సిద్ధుఁడు) ఘనము గాఁగ పసరు పూసెను.
గీః-
వేఁడి వేలుపు మహిమంబు విపులమైన - హిమ నగము పాద లేపనముమిషగాఁగఁ
జేరె సంతోషమున మంచు, చేతఁ బాసి - యొండు చోటికిఁ బోలేక యుండు నచట. ౧౮.
ఆ ప్రవరుఁడు వేలుపును వేడి,విపులమైన మహిమంబులు గలపాద లేపనము మిష(కారణము)  కాఁగా, సంతోషమున హిమ నగము చేరెను. మంచు చేత ఆ పాదలేపనము పాసి, ఒండు చోటికి పోలేక, అవ్హట నుండెను.
మః-
పువులం బండ్లను, బల్లవంబులను నొప్పుల్ గుల్కి రంజిల్లఁగాఁ
దవు తీవల్ పొదలున్ దరుల్ బహుళమై దౌదౌల నేత్రోత్సవం
బవుచున్, దేటులుఁ జిల్కులున్ బికము లాహ్లాదంబుగా నంతటన్
రవళిన్ బల్కులఁ గూతలం జెవులకున్ రమ్యంబు గావింపఁగన్.౧౯.
అంతటను ఆహ్లాదంబుగా తవు (ఒప్పిదమైన) తీవలు, పొదలు, తరులు, పూవుల చేతను, పండ్ల చేతను, పల్లవంబుల చేతనుఒప్పులు గులుకుచు, బహుళమై దౌదౌల(సమీపప్రదేశములలో)నేత్రోత్సవము అవుచు,రంజిల్లగా, తేటులు, చిల్కలు, పికములు, రవళులు, పల్కులు, కూతలతో, చెవులకు రమ్యము గావింపగా.....
గీః-
అటవి రక్షక చిత్తుఁడై యతఁడు తేరు - కొని కడుం ద్రిమ్మరుచుఁ జెంత గొనబు మీఱు
పాట నొప్పెడు కోనను బాఱఁ జూచి - తన ప్రధాన వర హృదయ మనుగమింప.౨౦.
ఆ ప్రవరుఁడు అట విరక్షక (రక్షకులు లేని) చిత్తుఁడై, తేరుకొని, కడు త్రిమ్మరుచు, చెంతను గొనబు మీఱు పాటతో ఒప్పెడు కోనను బాఱఁ జూచి, తన ప్రథాన వర హృదయము ననుగమింపగా.....
(సశేషం)
జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.