జైశ్రీరామ్
వరూధినీ ప్రవరులు.
అటులననివారిత మోహావేశముఁజూపి, తాను ౩౧.
అటుల అనివారిత మోహావేశముఁజూపి, తాను ఆ వరూధిని,
కః-
ఎంత తపోధనులగుచున్ - సంతతముఁ జరించినను యశం బలవడునే
కాంత ననురూప లసితం - గాంతగఁ గైకొనక దూరఁగా నెవ్వరికిన్. ౩౨.
ఎంతటి తపోధనులగుచు, సంతతము చరించినను, ఎవ్వరికినీ, కాంతనైన నను రూప లసితను(సౌందర్యముచే ప్రకాశించుదానిని, కాంతగా కై కొనక, దూరఁగా(నిందించినచో) యశంబు అలవడదు కదా!
వః-
అనిన విని, ౩౩.
ఆ విధముగ ప్రవరుఁడు పలుకగా వరూధిని విని,
గీః-
నేన యతి మార్గమును బూని నియత వృత్తి - నాకె యుండిన గృహమున కేకతంబు
గాఁగఁ జనియెద సంతోష గరిమ మెఱయ - ననుచు శుచి వేడి చనిన నయ్యతివ యంత. ౩౪.
నేనే కనుక యతి మార్గమున్ పూని, నియత వృత్తి నాకే ఉండినచో, నా గృహంబునకు ఏ కతంబు గాఁగ సంతోష గరిమ మెఱయ, చనియెదను అనుచు, శుచి(అగ్ని)ని వేడి, ప్రవరుఁడు వెళ్ళిపోఁగా అంతన్ ఆ అతివ,
గీః-
ప్రియ సఖులతోడ మిక్కిలి ప్రేమ మీఱ - నతనిఁ గనుఁగొనఁ జని కనకాసన మర
గతిని గొనివెట్ట, వసియింపఁ గని ప్రియాళి - తోడ సేవింపఁ, గొనినట్టు గూడఁ జేసి. ౩౫.
ప్రియ సఖులతో, మిక్కిలి ప్రేమ మీఱ, అతని కనుగొన జని, కన జాలక, ఆశతో ఒప్పి యుండగా, గతిని(ఆమె ప్రవర్తనను)గొని(గ్రహించి) వెట్టన్(మోహ తాపమున)వసియింప(ఉండగా) కనిపెట్టి, ప్రియాళి తోడ(వెంటనే)సేవింపం(సైత్యోపచారాది) సేవలు చేయు నిమిత్తము, కొని(తీసుకొనివెళ్ళి) నట్టు(నివాసమును) కూడఁజేసి(ప్రవేశపెట్టి,.......
(సశేషం)
జైహింద్.
1 comments:
ఎన్ని సార్లు చదివినా మళ్ళీ మళ్ళీ చదవాలని పించే మంచి రసరమ్య మైన కావ్యమును అందిస్తున్న, చింతా వారికి ధన్య వాదములు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.