గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

7, మే 2012, సోమవారం

వసు స్వారోచిషోపాఖ్యానము (ద్వ్యర్థి కావ్యము) వసుచరిత్ర పరముగ అర్థ వివరణము. 8 / 14

 జైశ్రీరామ్.
 
కోలాహలుఁడు శుక్తిమతిని అడ్డగించుట.
గీః- 
నీకు వసు విభుండొక్కడు చేకురెడి న - టంచు నన, వారు హర్షంబు నందు మునుఁగ 
గొంత తడవుండి యందొక్క యింతి మంజు - వాణి యిట్లని పల్కె సర్వంబుఁ దెలియ. ౩౬.
ఓ తరుణీ! నీకు వసువిభుండొక్కఁడు(ఒక ధనవంతుడు)చేకురెడి నంచు నని దీవింపగా వారు హర్షంబునందు మునుగ కొంత తడవుండి ఒక్కింత సేపూరకుండి, అందొక్క యింతి మంజువాణి సర్వంబు తెలియ నిట్లు పలికెను.
గీః-
విమల మతి! యెందుఁ బోయెడు వేడ్క నిందు - వచ్చిరతులమతిని ప్రేమ వరలఁ జేయఁ
దగును; గాన మురువు మీఱఁ దలిరుఁబోడి - వెదక వచ్చినఁ దగు విధి కొమరుల. ౩౭.
విమల మతిగల ఓ మునివర్యా! ఎందు బోవలయునను వేడ్కతో ఇందు వచ్చితిరి? అతుల మతిని ప్రేమ వరలఁ జేయఁ దగును. గానము, ఉరువు మీర(వృద్ధి పొంది యుండగా మా తలిరు బోడిని వెదక వచ్చిన కనఁ దగునటువంటి విధి కొమరులా(నారద మునులా) యేమి?
క:- అన నను గౌతమ విఖ్యా  -  తిని బిలిచెద రేను గోపతిని గూర్చి తపిం
చిన దాననే యశము గల  -  ఘన పదముం బొందితి, నని కడు ప్రేమమునన్. ౩౮.
మంజు వాణి ఆ విధముగా అనగా,  నను గౌతమ అను విఖ్యాతమైన పేరుతోఁ బిలిచెదరు. అటు వంటి నేను సూర్యుని ౯వసురాజును౦ గురించి తపించగా, దాని కారణము గానే యశము గల ఘన మగు ఈ మునీశ్వర పదము పొందితిని. కడు ప్రేమముతో -  -  -  -!
గీ:- సుఖ గతిని నాయనను గాంచి సుదతి కేళి  -  వనమునకుఁ బద్మినీ జాతి వరలఁ దేఁగ
వచ్చి, ఛద్మ ప్రవరరాగ వార్ధిఁ గాంచి,  -  చెంతకుం జేరితని యని చెలువు మీర. ౩౯.
ఓ సుదతీ! సు ఖగతిని(యోగ్యుఁడయిన సూర్య భగవానుని) నాయనను౯నాకు తండ్రి వంటి వానిని)కాంచు నిమిత్తము, కేళీ వనమునకు పద్మినీ జాతిని(పద్మాది పుష్పములను) వరలు విధముగ తెచ్చుటకు వచ్చి, ఛద్మ(ఇచ్చటి నీ) ప్రవర రాగ వార్ధిని కాంచి, చెంతకు చేరితిని. అని చెలువము అతిశయించు నట్లుగా  -  -  -  -!
గీ:- అతివ పావనమౌ జన్మ మరయ, నాకు  -  నేఁడు సంతోషమయ్యెడు జాడఁ దెలియఁ
జెప్పి యొప్పింప వలెనని, చెలి మనమున  -  దలచి యడిగినఁ బలికెనంతట నెలంత. ౪౦.
మీ అతివ యైన గిరిక యొక్క పావనమౌ జన్మము అరయ దలచి యుండగా నాకు నేడు సంతోష మయ్యెడు జాడ తెలియఁ జెప్పి ఒప్పించ(విశ్వాసము కలిగించ)వలెనని ఆ చెలి(ముని వేష ధారి) మనమున తలచి,  అడిగిన, నెలంత అంతట ఇట్లు పలికెను.
(సశేషం)
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.