జైశ్రీరామ్.
వరూధినీ ప్రవరులు.
అనఘ వర్తనఁ బరమ వంశావతంస - మగుచు నిచ్చలుఁ దగు ప్రవరాఖ్యుఁడైన
వసు విభుం డార్య నుత శతాధ్వర గృహీత - భవ్య లక్షణుఁడగుచు శోభను వహించు. ౬.
ప్రవరాఖుఁడైన ఆ వసువుచే కలిగిన వైభవము కలవాఁడు (భాగ్యవంతుఁడు) అనఘ (ప్ర)వర్తనచే పర(బ్రహ్)మ వంశావతంసముగా అగుచు, నిచ్చలును తగునట్లు ఉండెను. ఆర్యనుతము ఐన శత(అనేక) అధ్వర (యజ్ఞములయందు) గృహీత(గ్రహింపఁబడిన) భవ్య లక్షణుఁడు అగుచు శోభ (ప్రకాశము) ను వహించును.
గీః-
అందమల పద్మ సంతతి నలవరించి - దివ్య గుణమణులందు శుక్తిమతి నాఁగఁ!
గర్మ పావన మూర్తియై ఘనత నొప్పు - నది విబుధ హర్షమై మహోన్నతిని గాంచు. ౭.
ఆ ప్రవరాఖ్యుని అందము అల పద్మ (లక్ష్మి) సంతతి (యగు మన్మధు) అలవరించి (పోలి) దివ్య గుణము లనెది మణుల యందు మతి (మనస్సు) శుక్తి (ముత్యపు చిప్ప) నాఁగన్ (యనునట్లుగా) కర్మ(లచే) పావన మూర్తియై, ఘనతను ఒప్పున (ఔచిత్యము చేత) ను, దివి యందు బుధ జనులచే హర్షింప బడినవాఁడై మహోన్నతిని కాంచు చున్నాఁడు.
గీః-
ఆత్మ భార్యానురాగుఁడై యవ్వ, సుప్ర - భుండు నాయన మిత మతిఁ బొరసి యుండ,
ఘన సమితిఁ బొంగు గాంచుచు ఘనత నెసఁగఁ - బారువాఁడెంత వాఁడైన వరలఁ గలఁడు? ౮.
ఆ పాఱు వాఁ (బ్రాహ్మణుఁ) డుఆత్మ భార్య యందు అనురాగము కలవాఁడై, అవ్వ (తల్లి ) యు, సు ప్రభుండగు నాయనయు, మిత (తగిన) మతి చేత పొరసి (కూడి) యుండగా,ఘన సమితి (సభల) యందు పొంగుఁ(జయమును లేదా సంతోషమును) గాంచుచు (పొందుచు).ఘనతతో ఎసగు చుందగా, ఎంత వాఁడైనను అతని ముందు వఱలఁ గలఁడా?
వః-
ఆ ప్రవరాఖ్యుండగు వసురాజు. ౯.
ప్రవరుఁడు అను పేరు గల ఆ ధనవంతుఁడు,
గీః-
పాడి పంటలఁ దనరు జీవనము గల్గి - యింబడర, ఘన కోలాహలంబు పెఱిగి,
పైనఁ బడి శుక్తిమతి నాగ, దాని పని మ - దిని దలఁచి సచ్చరణ భవ ఘనత నెట్టె. ౧౦.
పాడి పంటలతో తనరుచున్న జీవనము గల్గి, తనను గూర్చి పొగడ్తలతో కూడిన ఘన కోలాహలము తన పైనఁ బడి, పెఱిగి, ఇంబు (ఇంపుతో) అడర (ఉండ) గా , దాని (దానము చేయువాని) యొక్క పనిని శుక్తి మతి నాగ (నత్తగుల్లలు కలిగిన దాని విధముగా) మది యందు తలచి, సచ్చరణ ( మంచి కులమునందు ) భవ (పుట్టుట వలన) ఘనత చేత నెట్టి వేసెను.(దానము స్వీకరింపుఁడని అర్ధించినను తిరస్కరించెడి వాఁడు).
(సశేషం)
జైహింద్.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.