జైశ్రీరామ్
వరూధినీ ప్రవరులు.
మును వచ్చిన దారిని - నే - వినుత చరిత! చనఁగ వచ్చు, వేఱె యొరులు దా
రిని చూప వలెనె? పోవం - గను జూపెద, నంటి వచ్చి కనుఁగొనెదు గదా! ౨౬.
వినుత చరితా! మును వచ్చిన దారినినే, చనఁగ వచ్చు. పోవంగను వేఱే ఒరులు దారిని చూప వలెనే? నీ చూపు నీ ఎదను అంటి(అనుసరించి) వచ్చి నా వంక కనుగొనెదు కదా!
గీః-
అనుచుఁ దా వరూధిని నిల్వ నతని "ననఘ! - కొంత తడవోపి యుండినఁ గుతుక మొప్ప
నశ్రమంబున నేఁగంగ నగును గాదె?" - యంచుఁ గోరఁగ బోవఁగా నెంచి యతఁడు. ౨౭.
వరూధిని తాను ఆ విధముగ ననుచు, ప్రవరుఁడు నిల్వ అతనిని అనఘ! కొంత తడవు ఓపి యుండినచో కుతుకము ఒప్పగా, ఆశ్రమంబునకు నేగంగ నగును కాదె!. అనుచు కోరఁగా, అతఁడు పోవగా నెంచి,.....
గీః-
పోవలయు వేగ, నా యింటి పువ్వుబోడిఁ - జూడవలె, నిత్య కృత్యముల్ చొప్పు దప్పి,
యుండె, నా మది దానిపై నొనర - నెపుడు - గాంతునని హిత! కార్య సంహటన కొఱకు. ౨౮.
వేగముగా పో వలయును. నా యింటి పువ్వుఁ బోడిని చూడ వలెను. నిత్య కృత్యములు చొప్పు తప్పి, నా మది దానిపైని ఒనరి యుండగా, హిత కార్య (అగ్నికార్యాదుల) సంఘటన (నిర్వహణ) కొఱకు ఎపుడు కాంతు (సాధింతు) ను? అని యుండెను అని ప్రవరుఁడు పలికెను.
కః-
అన, నను గూడఁగ నీకున్ - గననగు సౌఖ్యంబటంచుఁ గైకొని యాలిం
గన మును జేయఁదగ, దనియుఁ - జను పొమ్మని గెంటని హిత సంభ్రమ మొలయన్. ౨౯.
అని ప్రవరుఁడు అనగా,ఓ ప్రవరుఁడా! నన్ను కూడఁగ (కూడినచో) నీకుసౌఖ్యంబు కన నగును. అటంచు(అని పలుకుచు) కైకొని అతనిని ఆలింగనము చేయఁగా తగదు అని పలికి, చనుము అని గెంటఁగా నిహిత (తన యందుననున్న)సంభ్రమము ఒలయ (ఒప్ప) గా.....
గీః-
పిలిచికొని పోయి చూపినఁ బ్రేమ మీఱ - నంగనను పెద్ద సేయఁగ నాత్మ - మాటు
సేసి కనుఁ బురుషవరుండు చిత్తమలరఁ - గా మముల నువిదల మించు కామ మున్నె! ౩౦.
తమంతట తాము స్త్రీలను పిలిచికొని పోయి, ప్రేమ మీఱ(హద్దులు మీరి) చూపినచో అట్టి అంగనను పెద్ద(గౌరవము) సేయుటకు ఆత్మ మాటు వేసి(మనస్సు దాచుకొని), పురుష వరుండు కనును. చిత్తము అల్రగా మములను ఉవిదలను అతిక్ర మించు కామము ఉన్నదా?
(సశేషం)
జైహింద్.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.