ఆంధ్రత్వ మాంధ్ర భాషాచ పూర్వ జన్మ తపః ఫలం. అన్న మాట లెంత యదార్థము.
మన తెలుగు భాషామతల్లికి తమ అనిర్వచనీయమైన సేవలందించిన మహనీయులు సార్థక జన్ములెందరో వున్నారు.
అష్ట దిగ్గజ కవులలో సుప్రసిద్ధుడైన పింగళి సూరనార్యుడు రాఘవ పాండవీయము అనే ద్వ్యర్థి కావ్యమే కాక కళా పూర్ణోదయము అనే మహా కావ్యాన్ని కూడా వ్రాసి తన అప్రతిమాన ప్రతిభా పాటవాల్ని పాఠకలోకాని కందించి కావ్య జగత్తులో అజరామరుడయ్యాడు.
ఇంతకు ముందే " ఈ పద్యం సంస్కృతమా? తెలుగా? చెప్పుకోండి చూద్దాం. " అనే శీర్షికతో రెండు భాషలలోనూ అన్వయం గల పద్యం ఈ బ్లాగులో వుంచడం జారిగింది.
ఇప్పుడు మరొక తమాషా ప్రక్రియతో మన ఊహకే అందని అత్యంత ఆశ్చర్య జనకమైన పద్యాన్ని మీ ముందుంచుతున్నందుకు చాలా ఆనందంగా వుంది.
ఆ పద్యంలో ప్రారంభం నుండి చివరి దాకా చదివితే తెలుగు పద్యమై తెలుగు పదాల పొందిక గలిగి తెలుగు లో అర్థ స్ఫూర్తి కలిగిస్తుంది.
మరి అదే పద్యాన్ని చివరి పాదంలో చివరి అక్షరం నుండి మొదటి పాదంలో మొదటి అక్షరం దాకా { వెనుకనుండి ముందుకు } చదివితే అత్యంత ఆశ్చర్య జనకంగా సంస్కృతపద భూయిష్ఠమై చక్కని భావ స్ఫూర్తిని కలిగిస్తుంది. వింతగా వుంది కదూ? ఐతే ఆ పద్యమేమిటో చూద్దామా?
కందము:-
తా వినువారికి సరవిగ
భావనతో నానునతివిభావిసు తెజా
దేవర గౌరవ మహిమన
మావలసిన కవిత మరిగి మాకునధీశా.
ముందుగా తెలుగులో చూద్దాం.
ప్రతిపదార్థము:-
అతి విభావిసు తేజా = మిక్కిలి ప్రకాశించు పరాక్రమము కల
అధీశా = ఓ మహారాజా!
దేవర గౌరవ మహిమన = మీ ఘనత యొక్క మహిమ చేతనే
మా వలసిన కవిత = మా ప్రియమైన కవిత్వము
తాన్ = అది
వినువారికి సరవిగన్ = వినెడి వారికి యుక్తముగా
భావనతోన్ = భావించుటతో { ఆలకించు వారు సముచితముగా నున్నదని తలచినట్లు }
మాకు మరిగి = మాకు అలవడి { మరుగు రూపాంతరము మరిగి }
ఆనున్ = కనిపించును
భావము:-
మిక్కిలి ప్రకాశించు పరాక్రమము గల ఓ మహారాజా! మీ ఘనత యొక్క మహిమ చేతనే మా ప్రియమైన కవిత్వము ఆలకించువారు అది యుక్తముగా భావించుటతో మాకు అలవడి వ్యక్తమగుచున్నది.
{ఓరాజా! మేమాశ్రయించిన మీ మహత్వము వలననే శ్రోతల కానందకరమైన కవిత్వము మా కబ్బినది.అని భావము.}
అదే పద్యాన్ని తలక్రిందుగా వ్రాసి చూస్తే సంస్కృతం. చూద్దామా?
సంస్కృతం లో పద చ్ఛేదము:-
శాధి - ఇన - కుం - ఆగిరి - మత - వికనసి - లవమాన - మహిమవరగౌరవదే - జాతే - సువిభౌ - ఇతి - నను - నా - అతః - నవభాః - గవి - రసకిరి - వా - అనువితా.
అన్వయ క్రమము:-
ఇన - ఆగిరి - కుం - శాధి - మత - వికనసి - లవమాన - నను - మహిమవరగౌరవదే - సువిభౌ - ఇతి - జాతే - నా - అతః - నవభాః - రసకిరి - గవి - అనువితా వా.
ప్రతిపదార్థము:-
ఇన =ఓ రాజా!
ఆగిరి = పర్వతములున్నంత కాలము
కుం = భూమిని
శాధి = శాసింపుము
మత = సర్వ సమ్మతుడా!
వికనసి = మిక్కిలి ప్రసిద్ధిచే విరాజిల్లుచున్నావు.
లవమాన = లవుని యొక్క మానము వంటి మానము కలిగిన
నను = ఓ భూవరా!
మహిమవరగౌరవదే = గొప్పతనముచే శ్రేష్ఠమైన గౌరవమునిచ్చునట్టి
సువిభౌ = నీ వంటి మంచి రాజు
ఇతి = ఈ విధముగా
జాతే = కలిగి యుండగా
నా = పండితుడైన, మనుష్యుడు
అతః = ఇట్టి గౌరవము వల్ల
నవభాః = క్రొత్త వికాసముగలవాడై
రసకిరి = రసము చిమ్మునట్టి
గవి = భాషయందు
అనువితా వా = స్తుతింపనివాడగునా! { తప్పక నుతించువాడగునని యర్థము. }
భావము:-
-ఓ రాజా పర్వతములున్నంత కాలము భూమిని శాసింపుము. సర్వ సమ్మతుడా! మిక్కిలి ప్రసిద్ధిచే విరాజిల్లు చున్నావు. లవుని యొక్క మానము వంటి మానము కలిగిన ఓ భూ వరా! గొప్పతనముచే శ్రేష్ఠమైనట్టి నీ వంటి మంచి రాజు యీ విధముగా కలిగి యుండగా పండితుడైన మనుష్యుడు ఇట్టి గౌరవము వల్ల క్రొత్త వికాసము కలవాడై రసము చిమ్మునట్టి భాష యందు స్తుతింపనివాడగునా. స్తుతింపబడును.
చూచారు కదా! ఎంత అద్భుతంగా వుందో.
మన సాహిత్యంలో వున్న చిత్ర విచిత్ర కవిత్వాలను గూర్చి తెలుసుకోవాలంటే బహుశా మన జీవితం చాలదేమో.
మీరు కూడా మీ దృష్టిలో యిటువంటి కవితలుంటే కామెంటు ద్వారా పంపినట్లయితే తప్పక పదిమందికీ పంచినవారవతారు.
జైహింద్.
Print this post
శ్రీ లలితోపాఖ్యానము.
-
జై శ్రీరామ్
శ్రీ మాత్రే నమః
"హయగ్రీవా! కలియుగంలో భక్తులకు సర్వసుఖాలూ, మోక్షం ఇవ్వటానికి భండాసురుని
వధించటానికి పరాశక్తి లలితాదేవి రూపంలో అవతరిస్తుంది అ...
2 రోజుల క్రితం
7 comments:
భలే ప్రయోగం. అయ్యా, ఇలాంటి విషయాలు మాకు తెలియజేస్తున్నందుకు శతకోటి వందనాలు.
భళి భళీ!!
కవిత్వాన్ని ఆస్వాదించేవారున్న ఆకాలంలో రాసేవారుండటం .....కన్నా,
భాషనే మర్చిపోయెవారున్న ఈ కరువుకాలంలో సాహితీ క్షుధార్తులైన మావంటి వారికి అమృత విందులతో ఆహ్వానం పలుకుతున్న మీ బ్లాగు భళి భళీ!!
చంపక మాల:-
సలలిత మాలతీ కలిత సన్నుత మాధవ నామధేయ! మీ
చలువను సాహితీ జగతి సజ్జన రంజక సాహితీ క్షుధా
ర్తులయిన వారి మెప్పుగను తోచిన సత్కవితా సుధాంశముల్
కలిగిన యాంధ్ర సత్ కృతుల గాంచి, కనుంగొన జూపు నింతియే.
{ ఆంధ్రామృతము }
చంపకమాల:-
ధవళ కులాబ్ధి జాత ! మహదాశయ శోభిత! సోమ శేఖరా!
సువిదిత మయ్యె మీ మనసు. సున్నిత భావ శుభాన్వితంపు సత్
కవితలనంతమయ్య మన కావ్య జగత్తున. నేర్చు వారికిన్
సువిశదమౌ విధంబుగను చూపగ యత్నము జేతు భక్తితోన్.
మీ బ్లాగు చాలా చాలా బాగుంది. మీరూ విశాఖపట్నం వారే అని తెలిసి చాలా సంతోషించాను. చాలా మంచి అని చేసి తెలుగు భాషకి, తెలుగు వారికి ఎంతో సేవ చేస్తున్నారు.
చంపకమాల:-
తెలుగని కాదు కాని కడు తెల్లము కావలె ముఖ్య కావ్యముల్.
వెలుగును చూడగా వలెను వేలకు వేలుగ నున్న చిత్ర సం
కలిత కవిత్వ పాఠములు. కాంచి పఠించెడి పాఠకోత్తముల్
కలరని వ్రాయు చుంటి మతి గాంచగ నేర్చిన దాని నోయుమా!
రామకృష్ణారావు మేస్టారూ,
చదివీ చదవడంతోనే చమత్కారాలూ ప్రయోగాలూ అర్థం చేసుకోవడం కష్టమని కనబడుతోంది కాబట్టి కళాపూర్ణోదయానికి ఎవరి వ్యాఖ్యానం చదవమంటారో చెప్తే... :)
నెనరులు.
రాఘవా!
పింగళి సూరన కళాపూర్ణోదయానికి మేము గురువుగారి బోధననే ఆధారంగా చేసుకొన్నాము.
ఇక వ్యాఖ్యానమంటారా - అబినవ వాగమశాసన బిరుదాంకితులయిన మల్లాదిసూర్యనారాయణ శాస్త్రి గారు వ్రాసిన " భావ ప్రకాశికా {లఘు } టీకతో అద్దేపల్లి అండ్కో రాజమహేంద్రవరం వారు ముద్రించిన గ్రంథం బాగుంటుందని నా నమ్మకం.
నాపై మీరుంచిన నమ్మకానికి ధన్యవాదములు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.