ఈ రోజు మీతో నా స్వ విషయం మనసు విప్పి మాటాడాలని వుంది.
నేను సాధారణంగా సాహితీ సభలకు ఎక్కడ జరిగినా ఆహ్వానిస్తే కాదనకుండా హాజరవుతాను. ఐతే ఈ విషయం ఇంటిలో తెలియ జేసి నా కార్యక్రమాన్ని వివరించి మరీ వెళ్తాను.
ఒక నాడు మాత్రం అనుకోకుండా ఒక కార్య క్రమంలో హాజరవ వలసి వచ్చింది. ఇంటిలో చెప్పేటంతటి అవకాశం దొరకక పోవడంతో చెప్పలేకపోయాను. ఇంటికి వచ్చేసరికి రోజూ కన్నా బాగా ఆలస్యమయింది. ఈ లోగా నేను సాహితీ కార్యక్రమంలో పాల్గొంటున్న విషయం ఒక విద్యార్థి ద్వారా మా యింటిలో తెలిసింది.
తలుపు తట్టాను. బైట లైటు వెలిగించారు. తలుపు తీస్తారని నేననుకొన్నాను. తీయలేదు. సరికదా అనుకోని సంఘటన నాకెదురయింది. అదేమిటంటారా? వినండి చెపుతున్నాను.
నేను నాలుగు పదాలిస్తాను. రామాయణ పరంగా పద్యమొకటి ఆశువుగా చెప్పితేనే ఈ గృహం మీకు స్వాగతం పలుకుతుంది. అని నా గృహిణి అనే మాటలు వినే సరికి నాకు చాలా ఆశ్చర్యం, ఆనందం కలిగాయి.
నేనెప్పుడూ వూహించనైనా లేదు. నన్నీవిధంగా ఆమె ప్రశ్నిస్తుందని.
సరే ఏమిటా పదాలు నాలుగూ సెలవివ్వండి అన్నాను.
చెప్పలేపోతే అలాగొప్పుకోండి అంది ఆమె.
మీతో చెప్పకపోవడమేం. ఆమె అలా అనే సరికి నాకు చిన్నపాటి పౌరుషంకూడా వచ్చిందండోయ్.
ఆ పదాలేవో ముందు దేవిగారు సెలవిస్తే అప్పుడు చూసుకో వచ్చు. అన్నాను. అంతే ఆమె నాలుగు పదాలూ చెప్పడం జరిగింది.. నా దగ్గరేవున్న సంచీలోంచి పుస్తకం తీసి పెన్ను పట్టుకొని నాలుగు పదాలూ ఆమె లోపలి నుండి చెప్పుతుండగా బైటే అక్కడున్న కుర్చీలో కూర్చొని వ్రాశాను.
ఆ పదాలేమిటొ పద్య మెలా పూరించానో తెలుసుకోవాలని ఆత్రుతగా వుందికదూ? చూడండి క్రింద వ్రాస్తున్నాను.
దత్త పది:-
1) అన్న.
2) అక్క.
3) చెల్లె.
4) బావ.
ఇవండీ ఆ నాలుగు పదాలూను.
రామాయణ పరంగా పద్యం వ్రాయాలి.అదృస్టం కొద్దీ స్వేచ్ఛా వృత్తంలోనే వ్రాయ వచ్చునని సెలవిచ్చారు.
ఇక్కడ నాకో ఆలోచన వచ్చింది. ఇదే పరిస్థితి మీకెదురైతే మీరేమిటి వ్రాస్తారా అని.
అందుకనే నేను వ్రాసిన పద్యం క్రింద తెల్ల రంగులో నిక్షిప్తం చేస్తున్నాను.
మౌస్ ను కుడిచేతి చూపుడు వ్రేలుతో నొక్కి పట్టి దానిపైనుండి పద్యమంతా కనిపించేంత వరకు లాగితే బ్లూబేగ్రౌండొచ్చి మధ్యలో పద్యం కనిపిస్తుంది.
ఇదంతా చదివిన మీరు కూడా ఉత్సాహంతో పద్యం వ్రాయ గలగాలనే దురాశతో ఈ పని చేస్తున్న నేను మీకు కష్టం కలిగిచి వుంటే క్షంతవ్యుడను.
ఇక నేను శారదామాత దయచే వ్రాసిన పద్యం చూడండి.
పద్యము:-
ఉత్పలమాల:-
జానకి యేడనున్నదియొ? జాడ కనుంగొను మన్న రాముడా
యానతి విన్న మారుతియె అక్కడ యిక్కడ లేక లంకలో
జానకి గాంచు చెల్లెడల చాటుగ బావని గాంచె. నద్దిరా!
జ్ఞాని కసాధ్యమెద్దియొకొ? చక్కని భక్తి ప్రపత్తి గల్గినన్.
ఈ విధంగా పూరించి చదివి వినిపించానండి. నేను స్వాగతింపబడ్డాను. చెప్పకపోవడమేం. నాకైతే ఎప్పుడూ కలుగనంతానందం కలిగిందండా సమయంలో.
అందుకే అన్నారు పెద్దలు. భార్యంటే భగవద్దత్త ప్రసాదమని. నిజమేకదండీ?
అన్నట్టు చెప్పడం మరిచాను. మాయింటికి నిజం గానే మా అన్నయ్య, మా అక్క, చెల్లెలు, మా బావగారూ వచ్చి ఈ నాటకమంతా ఆడించారండి. ఆశారదాంబ పద్యం పలికించింది కాబట్టి సరిపోయింది కాని, లేకపోతే మావాళ్ళందరిలోనూ ఎంత చిన్నబోయుండేవాణ్ణో.
ఉత్సాహవంతులైన మీరూ దత్త పది పూరణ చేస్తే మీ కామెంట్ ద్వారా పంప గలందులకు మనవి.
జైహింద్.
Print this post
ప్రజాసంకల్పంలో నా పద్యం. లక్ష్మీ సహస్రనామావళిలో 505 వ నామం పద్యము.
-
జైశ్రీరామ్.
జైహింద్.
1 రోజు క్రితం
8 comments:
తే. అన్నగవుల మొగము వాడునాత్మ బలుడు
బావన చరితు రాముడు ప్రాణ సముడు
వనికి జనిన దశరథడు వగచె మిగుల
అక్కటా! చెల్లెను నృపతి యాయువు మరి!!
శారదా పుత్రులకు పాదాభివందనం.
రామక్రిష్ణ గారు నాకు ఈ పద్యాలు అవీ రావు కాని చదివి చాలా ఆనంద పదతాను.. మీవి ఇవే కావు ఒక సారి శ్రీదేవి,జయసుద,జయప్రద,సౌందర్య ల మీద
ఎవరో పద్యాలు అడిగితే రాసారు చూడండి ...అద్భుతం.. మీ వంటి వారిని పొగడాలన్నా ఒక అర్హత ఉండాలేమో నాలాంటి వాళ్ళకు :)
మీ బ్లాగనే ఆకురాయిపై ఆలోచనల్ని పదును చేసుకొంటున్నా.
ధన్యవాదములు
శ్రీ సత్య నారాయణా!
కందము:-
అన్నర పాలుని దుస్థితి,
పన్నుగ బావన చరిత్రు ప్రభు శ్రీ రామున్
మిన్నగ చెప్పితి వక్కట!
నిన్నెన్నగ నాకు చెల్లె. తృప్తిగ. సత్యా!
శ్రీ చిలమకూరు విజయమోహన్ గారూ!
ఉత్పలమాల:-
కూరిమి పల్కులన్ చిలమ కూరికి సాటి గనంగ నేర. నన్
శారద పుత్రుగా గనుచు చక్కని మాటల తేనెలొల్కు మీ
తీరు మహాద్భుతంబు. సువిధేయుడ, శారద పుత్ర రత్నమా!
శారద దివ్య తేజమును చక్కగ చూపెద మీ కృపోన్నతిన్.
ప్రియ నేస్తమా!
ఉత్పలమాల:-
మీమది పొంగె. చాలు. మహనీయుడ! సద్ గుణ! బ్లాగు నేస్తమా!
ప్రేమకు మించునట్టి బహు పేశల భాషణ భూషణావళుల్
భూమినెఱుంగనెచ్చటను. భూరిగుణావళి మీదు భాషయౌన్.
ప్రేమ మహత్వ మూర్తివయి పెద్దగ నిల్చితివయ్య! నా మదిన్.
ఆర్యా! బుల్లోజు బాబా గారూ!
కందము:-
బుల్లోజు వంశ చంద్రుడ!
చల్లని మీ మనసు గ్రోలు చక్కని వెపుడున్.
తెల్లము మీ మది శుభగతి.
యుల్లమునానందమొదవె నుఱు గుణ! బాబా!
ధన్యోస్మి.
అందరికీ కృతజ్ఞతలు.
ఇది నా పూరణము :)
అన్నదమ్ములు సీతయు నడవి కేగ
నామె నక్కట రక్కసుఁ డపహరించె!
రామునకుఁ జెల్లెఁ జెండాడ రావణుడిని
నిలువ నంబావరుని మనోనిలయమందు!
తప్పులున్నచోఁ దెలుపఁగలరు.
ఆ.వె:
"బావ" యనుచు వెంటపడిన రావణుని చెల్లె
లముకుచెవులు కోసె లక్ష్మణుండు
అక్కసుతొ వెడెలను రక్కసి "హా! అన్నా"
అనివగచుచు అన్నదరికి
@సత్యనారాయణగారు: అన్న గవుల అంటే ఏమిటండీ?
అలాగే: వనికి జనిన అన్నాకూడా?
రాఘవా! బాగుంది మీపూరణ.
అన్నదమ్ములొకచోటే ఉంటారు. మీపద్యంలోలాగ.
అక్కకి అక్క, చెల్లికి చెల్లి, ఎవరికి వారేకదా కాపురాలు, దానినే సూచుస్తూ విడివిడిగా 2, 3. పదాలలో వారినుంచారు.
ఇక అతడెంతి గొప్పవాడైనా బావ మన తరువాతేకదా! అనేవిధాంగా అతనిని 4 వ పాదంలో చేర్చి మీ సామర్ధ్యాన్ని నిరూపించుకొన్నారు.
అభినందనలు.
వ్యయేకృతే వర్ధతయేవ నిత్యం విద్యా ధనం.
గుడ్ లక్.
ధన్యవాదములు.
ధవళ సోమశేఖరా!
బావ/యనుచు/వెంట/-/పడినరా/వణు ( ని వ్రాస్తే తప్పు. ) చెల్లె
లముకు/చెవులు/కోసె/-/లక్ష్మణుండు.
అక్క/సుతొవె/డలెను/-/రక్కసి/హాయ ( న్నా అని దీర్ఘం వ్రాస్తే తప్పు ) న్న!
యని వ/గచుచు/నామె/-/యన్న/కడకు.
ఈ విధమైన సామాన్య విషయాల్ని కొంచెం తెలుసుకొని గాడిలో పడితే మీపద్య రచన హృద్యాద్భుతంగా వెలయుననడంలో సందేహం లేదు.
అన్నగవుల అంటే ఏమిటని వ్రాసారు.
ఆ + నగవుల=ఆ నగవుల [త్రిక సంధి] = ఆనవ్వుతున్న. [మొగము కు నవ్వుచున్న విశేషణం]
వనికి = అడవికి, చనిన=వెళ్ళిన. అని అర్థం.
నాపై మీకున్న నమ్మకానికి ధన్యవాదములు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.