1) సమాధానం కనుక్కోండి చూద్దాం.
Wednesday, January 14, 2009
కందము:-
అంచిత చతుర్థ జాతుడు
పంచమ మార్గమున నేగి ప్రథమ తనూజన్
గాంచి, తృతీయంబప్పురి
నించి, ద్వితీయంబు దాటి, నృపు కడ కరిగెన్.
దీనికి సమాధానం:- హనుమంతుడు.
2) సమాధానం కనుక్కోండి చూద్దాం - 2.
Sunday, January 18, 2009
కందము:-
పండినదెండినదొక్కటి.
ఖండించిన పచ్చిదొకటి. కాలినదొకటై
తిండికి రుచియైయుండును.
ఖండితముగ దీని దెల్పు కవియున్ గలడే
దీనికి సమాధానం:- తాంబూలం.
3) సమాధానం కనుక్కోండి చూద్దాం. 3.
Tuesday, January 20, 2009
ఆటవెలది:-
దేహమెల్ల కనులు దేవేంద్రుడా కాదు.
భుజము పైన నుండు బుడుత కాడు.
తాను ప్రాణి కాదు తగిలి జీవుల జంపు.
దీని భావమేమి తిరుమలేశ?
దీనికి సమాధానం:- వల.
4) సమాధానం కనుక్కోండి చూద్దాం 4
Monday, January 26, 2009
ఆటవెలది:-
చలన శక్తి కలదు. జంతువు కాదది.
చేతులెపుడు త్రిప్పు శివుడు కాదు.
కాళ్ళు లేవు సర్వ కాలంబు నడచును
దీని భావమేమి తిరుమలేశ?
దీనికి సమాధానం:- గడియారము.
5) సమాధానం కనుక్కోండి చూద్దాం 5.
Tuesday, January 27, 2009
ఆటవెలది:-
(1) భారతంబులోని భవ్యత్వమే కాదు
(2) ఇక్షు ఖండ మహిమ, (3) తృప్తిగొలుపు
అబ్ధి మహిమ తెలుపు మది ఒక్క పాదాన?
__________________________. ( ఈ 4 వ పాదం మీరు పూరిచడం కోసం ఖాళీగా వుంచ బడింది. )
దీనికి సమాధానం:-
పర్వ పర్వమందు ప్రబలు రసము.
6) సమాధానం కనుక్కోండి చూద్దాం 6.
Thursday, January 29, 2009
ఆటవెలది:-
చెప్పు లోని రాయి చెవులోను జోరీగ
కాలి లోనిముల్లు. కంటి నలుసు.
ఇంటి లోని పోరు యింతంత కాదయా
విశ్వదాభిరామ వినుర వేమ.
ఈ పద్యంలో వేదాంతార్థం వున్నట్టుగా నాకు అనిపిస్తోంది.
దీనికి సమాధానం:-
వివరణ:-
నా మదిలో మెదులుతున్న భావన వివరిస్తున్నాను. ఇదే ప్రమాణంగా తీసుకో వలసిన అవసరం లేదు. చూడండి.
ఒక గురువుకు శిష్యునకు మధ్య జరుగు చున్న సంభాషణ యిది.
శిష్యుడు:-
లోని = మనలో వుండే,
రాయి = బరువైన పదార్థమును గూర్చి,
చెవులోను = నా చెవులలో
జోరీగన్ = గింగిరు పెట్టేలాగున
చెప్పు = తెలియజేయండి.
గురువు బోధించారు. శిష్యుడు శ్రద్ధగా ఆలకించాడు.మళ్ళీ యిలాగంటున్నాడు.
లోని = నా మనసులో వుండేటు వంటి,
ముల్లు = సందేహమనే ముల్లు,
కాలి = కాలిపోగా
నలుసు = సూక్ష్మమైన ఆ పరమాత్మ స్వరూపమును,
కంటి = చూచితిని.
యింటిలోని = నా యీ శరీరమనే యింటిలోని
పోరు = జీవాత్మ పరమాత్మలకు జరిగే సంఘర్షణా రూపమైన పోరు
ఇంతంత కాదయా = ఇంతటిది, అంతటిది అని చెప్పుటకు శక్యము కానిది సుమా!
భావము:-
గురువుగారూ! మనలో వుండేటువంటి ఆబరువైన పదార్థమగు పరమాత్మ స్వరూపమును గూర్చి దయతో చెప్పండి. అని శ్శిష్యుడడుగగా గురువు వివరించి చెప్పడంతో శిష్యుని సందేహంతీరి ఇలాగంటున్నాడు.
నా మనసులో వుండే సందేహమనే ముల్లు మీ మాటల వలన కలిగిన జ్ఞానమనే అగ్నిలో కాలిపోయింది. నాలో ఆసూక్ష్మరూపముననున్న పరమాత్మ స్వరూపాన్ని చూచాను. నా శరీరమనే యింటిలో జీవాత్మకు పరమాత్మకు జరిగే పోరు యింత అంత అని చెప్పనలవికానిది.
చూచారు కదా!.
ఎంత సామాన్యంగా ఎంత అద్భుతంగా ఆడుతూ పాడుకొనేలా ఆటవెలదిలో వ్రాశాడో వేమన. ఎంతటి రచనా కౌశలము?
సరదాగా చదువుకొనే సందర్భంలో ఈ తలపోటేంటి? అని మీ రనుకోకపోవచ్చుననుకోండి. ఐనా సమాధానం సరైనది నా అభిప్రాయాన్ని మీ ముందుంచడం నా కనీస కర్తవ్యంగా భావించి యీ రోజు ఆ ఆరింటికీ సమాధానాలు మీముందుంచాను.
మీ అభిప్రాయం తెలియజేసి ప్రోత్సహిస్తారని భావిస్తున్నాను.
జైహింద్.
Print this post
4 comments:
అన్యథా భావించక మీరు వాడిన మూసలో రంగులు మార్చగలరు. నా సులోచనాలకు కూడా కష్టంగా ఉన్నది చదవడం.
చెప్పులోని రాయికి మీరిచ్చిన వివరణ బాగు బాగు
శ్రీ మిరియాల శ్రీ సత్య భ్రమరార్జున ఫణి ప్రదీప్ !
మీ రసజ్ఞతకి ధన్య వాదాలు.
అర్జునుడి బాణాలు...చదివాను.
మీరచన చాలా బాగుంది.
టైటిల్ మాత్రం పొసగ లేదు.
మత్తేభము:-
కవితాప్రేయసి కానరాక తమరిన్ కష్టాల పాల్ జేసెనా?
సు విధేయండవు ఆమెకీవు. అయినన్ సుంతైన చింతింపలే
దవిధేయత్వము ప్రేమ భావమనగన్ ఆకన్య. చింతింపకోయ్.
సువిశాలంబగు నీదు గుండె గుడిలో శోభిల్ల దాగెన్. కనన్.
నా కామెంటును మీ బ్లాగు చేర్చుకోనంది. అందుకని నాబ్లాగుద్వారా మీకు వ్యక్తపరుస్తునాను.
నా రచన మీకు నచ్చినందుకు ధన్యుడిని. మీ మత్తేభాన్ని నా బ్లాగులో ఉటంకిస్తున్నాను. ఏవో సాంకేతిక సమస్యల వలన మీ వ్యాఖ్య ప్రచురించబడలేదు. అసౌకర్యానికి చింతిస్తున్నాను.
ఇకపై టైటిలు విషయంలో శ్రధ్ధ చూపుతాను. మీరు రాసిన మత్తేభం చాలా బాగుంది. (చందస్సు మరచి ఇలా ఏవేవో రాతలు రాస్తున్నాను)
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.