గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

12, జనవరి 2009, సోమవారం

మేలిమి బంగారం మన సంస్కృతి 48.

అన్నీ వున్నా అణిగి, మణిగి వుండాలి.

పాంచ భౌతికమైన మన శరీరంలో ప్రకృతి ధర్మాలు కలిగి వుండడం సర్వ సాధారణం. ఐతే మేధస్సు అనే పరమోత్కృష్టమైన దానిని సృష్టి మనకు ప్రత్యేకంగా ప్రసాదించడమే కాక మాటాడ గలిగే మహాద్భుత గుణాన్ని కూడా ప్రసాదించింది.

ప్రకృతి ధర్మాలకి లోనయే మనం మేధా శక్తితో ఉచ్ఛ నీచ పరిగణన శక్తిని కూడా కలిగి వున్నాం. తద్వారా ఉచితానుచితజ్ఞతతో ప్రవర్తిస్తాం. మనకు అనేక అనర్థాలకు మూలం, జాగ్రత్త పడవలసిన ఆవశ్యకత వివరించే ఒక శ్లోకాన్ని మీ ముందుంచుతున్నాను.

శ్లో:-
యౌవనం, ధన సంపత్తిః
ప్రభుత్వ మవివేకితా,
ఏకైకమప్యనర్థాయ
కిము యత్ర చతుష్టయం.

ఆ:-
యౌవనంబు, ధనము, నద్భుత ప్రభుతయు,
దురవివేకితయును, దురిత గతిని
దేనికదియె గొలుపు. తీరుగా నాల్గునూ
కలిగి యుంటి మేని తెలుప తరమె?

భావము:-
యౌవన ప్రాయము, ధన సంపత్తి, అధికార ప్రాప్తి, వివేక శూన్యత, వీటిలో ఒక్కొక్కటుంటేనే ఎన్నో అనార్థాలు కలుగుతాయి. మరి ఈ నాలుగూ ఒకే చోట వున్నచో యిక యేమి జరుగునో వేరే చెప్ప వలసినదేముంది?

యువకులకు, జ్ఞానముచే నిత్య యూవకులైన ప్రతీ వారికీ ఆదర్శమూర్తి అయిన స్వామీ వివేకానంద జితేంద్రియుడు. భారతీయ యువకుల ప్రతిభను ప్రపంచంలో పతాక స్థాయికి గొనిపోయి భరత మాతకే అగ్ర స్థానాన్ని కల్పించిన మహనీయుడు. అట్టి మహాత్ములు ఏవిధంగా అన్ని అవకాశాలూ కలిగుండి కూడా జితేంద్రియులై సత్య సంధులై ఉత్తమ జీవనాన్ని సాగిస్తారో అదే విధంగా మనం కూడా యౌవనాదులు మనకమరియున్నా వివేకంతో నుండి రాణిద్దాం.

జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.