గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

23, జనవరి 2009, శుక్రవారం

గం మత్తు మందు పద్యం. .

మధు సేవ నాటకంలో ఆంగ్లాంధ్రసీసము సొగసును చూచిన మీరు ఇప్పుడు మందు బాబుల మనో గతాన్ని చూడబోతున్నారు. ఇక ఆలస్యమెందుకు? చూడండి.

సీసము:-
బ్రాంది సీసా కంట పడగానె వరహాల
పాతు కాన్ పించిన పగిది తోచు.
ఠప్పు మంచును కార్కు చప్పుడైనంతనె
జయభేరి విన్నంత సంభ్ర మొదవు.
దొడదొడ గ్లాసులో తొలికించు సమయాన
అమృతంబు పడుచున్న యట్టులుండు.
చురచుర గొంతులో చొచ్చెడి తరి పోయి
నట్టి ప్రాణము వచ్చినట్టులుండు.
తేటగీతి:-
అవల నానంద వార్ధి నోలాడునట్లు
స్వర్గ భూమి విహారము సలుపునట్లు
రంభ వడిలొన నిద్దుర క్రమ్మి నట్లు
తన్మయావస్తలోన చిత్తము సుఖించు.

ఎంత అద్భుతంగా మందు బాబుల మనో గతాన్ని వ్రాశాడో చూచారు కదా!
మరొక పర్యాయం మరో హృద్యమైన పద్యాన్ని మీముందుంచే ప్రయత్నం చేయ గలనని మనవిచేయు చున్నాను.
జైహింద్.

babaibabaibabaibabai Print this post

5 comments:

ఆత్రేయ కొండూరు చెప్పారు...

కం:
విడవడు ఎవ్వరు చెప్పిన
విననంటడు ఆలి గొడవ బెదిరించి ననున్‌
తన చావు తుదకు కనపడి
మరలిననూ బాగు పడును మనిషీ మహిలో

durgeswara చెప్పారు...

ఈయనెవరో అనుభవపూర్వకంగా చెప్పినట్లున్నాదండీ

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

కం:
విడవడు ఎవ్వరు చెప్పిన
విననంటడు ఆలి గొడవ బెదిరించి ననున్‌
తన చావు తుదకు కనపడి
మరలిననూ బాగు పడును మనిషీ మహిలో
ఆత్రేయా! పైన మీరు వ్రాసిన పద్యం బాగుంది.
ఛందస్సు సరిపోయింది.

ఐతే కంద లక్షణాలు కూడా సరిపోయినప్పటికీ ప్రాస విషయంలో మాత్రం అనుసరించే పద్ధతుంది . విన్నా వినక పోయినా చెప్పెస్తున్నను . తెలిసి కూడా చెప్పకపోతే తెగుళ్ళొస్తాయి కదా. అందుకని చెప్పెస్తున్నాను.

1) ప్రాస అంటే రెండవ అక్షరం.
2)రెండవ అక్షరం లో ఆచ్ సామ్యమక్కరలేదు.
హల్లు మాత్రం ఏదుంటే అదే నాలుగు పాదాల్లోనూ వుండాలి.
హ్రస్వ దీర్ఘలతో సంబంధం లేదు.
3) ప్రాస పూర్వాక్షరమ్మాత్రం దీర్ఘముంటే దీర్ఘమే హ్రస్వముంటే హ్రస్వమే వుండాలి.
4) ప్రాసకు ముందు సున్నా వుంటే నాలుగు పాదాల్లోనూ సున్నా వుండాలి.
ఉదాహరణ:-
కల
నెల
వల
తల
అలాగే
కంకి
జంకు
సంకు
బొంకు
అలాగే
కాంక్షలు
ఆంక్షలు
సంక్షేమ
సంక్షోభము.
ఈవిధంగా నాలుగు పాదాలలోనూ ప్రాస నియమాన్ని పాటించాలి.
ప్రాస గురు లఘు వుల విషయంలో పద్య నియమాన్ని బట్టి వుంటుంది.
కందంలో మాత్రం హ్రస్వ దీర్ఘ నియమం అవసర పడదు.
మొదటిపాదంలో మొదటి గణం గగ వస్తే రెండవ పాదంలో భ గణం రావచ్చును. అలాంటి చోట ప్రాస ఒకచోట గురువుంటే మరొక చోట లఘువుంటుంది కదా.
ఈ నియమాల్ని కూడా మీరు పట్టేశారంటే పద్య రచనలో మీ కందమే మా కందమౌతుంది . సరేనా?

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

ఔనండి దుర్గేశ్వరరావుగారూ. లోకానుభవ పూర్వకంగా చెప్పుంటారు.

ఆత్రేయ కొండూరు చెప్పారు...

అయ్యో ఎంత మాట అన్నారు గురువు గారు. మీరు చెప్పక పోవటము నేను వినక పోవటమా. అడగకుండా వరమిచ్చారు అదే నా భాగ్యం. ఈ నియమాలను కూడా ఆకళింపుచేసుకుని ప్రయత్నిస్తాను. ధన్యవాదాలు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.