గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

15, జనవరి 2009, గురువారం

చెప్పుకోండి చూద్దాం 5. ఈ పద్యం సంస్కృతమా? తెలుగా?

పాఠక ప్రకాండులారా!
మీ వంటి సాహితీ ప్రియుల ముందు నేను నామానసోల్లాసానికి కారణమైన సాహితీ విషయాల్ని వుంచే అవకాశం ఈ బ్లాగు ద్వారా కలిగి నందుకు చాలా ఆనందంగా వుంది. ఆ భగవంతుడికీ, ఆంధ్రామృతాన్ని నిరంతరం గ్రోలుతున్న పాఠకులైన మీకూ ముందుగా ధన్య వాదాలు తెలుపుకొంటున్నాను.

ఈ రోజు మీ ముందుకో విషయ్యాన్ని తెచ్చే సాహసం చేస్తున్నాను.
ఈ క్రిందనీయబడినది తెలు పద్యమా? లేక తెలుగు ఛందములో కనిపించే సంస్కృత పద్యమా? తెలియ జెప్ప గలందులకు మనవి.
తిలకించండా పద్యాన్ని.

కందము:-
మాయమ్మానసునీవే
రాయలవైకావదేవరాజేజేజే
మాయాతుమలానినయది
పాయకసంతోసమున్నపలమిలసామీ.

చూచారు కదా!
మీరు నాపై కోపగించుకోకుండా ముందు మీ సాహితీ సామర్ధ్యాన్ని జొడించి మీ ఆలోచనకు పదును పెట్టి, ఒక కాగితం మీద మీకర్థమైనంత వ్రాయండి. దానిని కామెంటుగా నాకు పంపండి.
ఆతరువాత సమాధానం వెన్వెంటనే తెలుసుకొవాలనే ఆత్రుత ఆపుకోలేకపోతే ఈ క్రిందనే BLOCK చేయఁబడిన సమాధానం చూడవలసినదిగా సవినయంగా మనవి చేసుకొనుచున్నాను.

వివరణ:-
ఈ కంద పద్యము పింగళి సూరన రచించిన కళా పూర్ణోదయము అనే మహా కావ్యములోనిది.
ఈ పద్యం తెలుగు పరంగాను, సంస్కృత పరం గాను రెండర్థాలు దేని కదే కలిగుంది.

ముందుగా తెలుగు పరంగా చూద్దాం.
పదచ్ఛేదము:-
మాయమ్మ - ఆన - చు - నీవు - ఏ- రాయలవు - ఐ - కావన్ - దేవరా - జేజేజే - మాయాతుములు - ఆనినయది - పాయక - సంతోసము - ఉన్నపలము - ఇలసామీ.
అన్వయ క్రమము:-
దేవరా - జేజేజే - సామీ - రాయలవై - కావనే - సంతోసము - పాయక - మాయాతుములు - ఆనినయది - ఉన్నపలము - మాయమ్మానసు.

ప్రతిపదార్థము:-
దేవరా = ఓ ప్రభువా!
జేజేజే = మీకు ముమ్మాటికీ జయము.
సామీ = ఓ భూ నాయకా! నీవు
రాయలవై = రాజువై
కావనే = రక్షించుట చేతనే
సంతోసము = ఆనందము
పాయక = విడివకుండగా
మాయాతుములు = మా ఆత్మలను, మనస్సులను
ఆనినయది = అంటి యున్నది.
ఉన్నపలము = ఇది మాకు సిద్ధించి యున్న ఫలము.
మాయమ్మానసు = మా తల్లి తోడు సుమా! ( మేము చెప్పినది యదార్థము )

తాత్పర్యము:-
ఓ ప్రభువా! ముమ్మాటికీ నీకు జయము.ఓ భూ నాయకా! నీవు రాజవై రక్షించుట చేతనే ఆనందము విడువ కుండగా మా ఆత్మలనూ, మనస్సులనూ అంటి యున్నది. ఇది మాకు సిద్ధించి యున్న ఫలము.మా తల్లి తోడు సుమా!

ఇప్పుడు సంస్కృతపరంగా చూద్దాము.
కందము:-
మాయమ్మానసునీవే
రాయలవైకావదేవరాజేజేజే
మాయాతుమలానినయది
పాయకసంతోసమున్నపలమిలసామీ.

పదచ్ఛేదము:-
మా - ఆయం - మాన - సునీవే - రాః - అలవా - ఏకా - అవత్ - ఏవ - రాజే - ఆజేజే - మా - ఆయాతు - మలాని - న - యది - పాయక - సంతః - అసముత్ - న - పల - మిల - సా - అమీ.

అన్వయ క్రమము:-
హే సునీవే - ఆయం - మామాన - అలవా - రాః - ఏకైవ - అవత్ - అజేజే - రాజే - మా - ఆయాతు - మలాని - న - హేపాయక - సంతః - యది - అసముత్ - నపల - మిల - అమీ - సా.

ప్రతి పదార్థము:-
హే సునీవే = శుభప్రదమైన మూల ధనము గల ఓ రాజా!
ఆయం = రాబడిని,
మామాన = లెక్క చేయకుము. { రాబడిని నమ్మ వద్దు. దానిని నమ్ముకొని మొత్తం ఖర్చు చేయవద్దు}
అలవా = ఛిన్నాభిన్నము కానట్టి
రాః = ధనము
ఏకైవ = ఒక్కటియే.
అవత్ = కష్ట సమయమందు రక్షీంచిన దగును.
అజేజే = బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల నారాధించునట్టి, {లెదా} ఛాగ పశువుతో యజ్ఞము చేయునట్టి
రాజే = రాజుకొఱకు
మా = లక్ష్మీ
ఆయాతు = వచ్చెడును.
మలాని = పాపములు
న = పొందవు.
హేపాయక = ఓ రక్షకా!
సంతః = సత్ పురుషులు
యది = దర్శింప వచ్చిరేని,
అసముత్ = సంతోష రహితుడవై
నపల = దర్శనమివ్వకుండ పోకుము.
మిల = వారితో కలియుము.
అమీ = కన వచ్చిన ఈ పండితులు
సా = ఆ లక్ష్మి. యని నమ్ముము.

భావము:-
శుభ ప్రదమైన మూల ధనము గల ఓ రాజా! రాబడిని లెక్క చేయకుము. రాబడిని నమ్ముకొని మొదలంటా ఖర్చు చేయకుము. ఛిన్నాభిన్నము కానట్టి ధనము ఒక్కటియే కష్ట సమయమందు రక్షించిన దగును. { కావున మూల ధనమును సమూలముగ వెచ్చింపకుము. } బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల నారాధించునట్టి, { లేదా } ఛాగ పశువుతో యజ్ఞము చేయునట్టి రాజు కొఱకు లక్ష్మీ వచ్చెడును. { అట్టి రాజును సిరి ఆశ్రయించు నని భావము.} పాపములు పొందవు.
ఓ రక్షకా! సత్ పురుషులు దర్శింప వచ్చిరేని సంతోష రహితుడవై దర్శనమివ్వ కుండ పోకుము. వారితో గలియుము. ఏలననగా కన వచ్చిన యీ పండితులు ఆ లక్ష్మి. { కోవిదులగు సత్ పూరుషులకు వేదమే లక్ష్మి యనియు, వారి నోట లక్ష్మి నివసించుననియు వేదములు చెప్పు చున్నవి. } కాబట్టి అట్టి వారికాశ్రయమిచ్చి యజ్ఞములాచరించి యింకనూలక్ష్మికాశ్రయభూతుడవు కమ్ము అని భావము.

చూచారు కదండీ పింగళిసూరన కవితా పాటవము. నాకర్థమైనంత వివరించాను. అర్థం కానిది చాలా వుండే వుంటుంది. పండితులనాశ్రయించి తెలుసుకోవలసిఉంటుంది.

జైహింద్.
Print this post

6 comments:

అజ్ఞాత చెప్పారు...

ఆంధ్రామృతం మహాద్భుతం!!

bharath చెప్పారు...

చాలా బాగుంది సార్
నాదొక్క మనవి

మీకు సమస్యా పూరణం లో ప్రవేశం ఉంటే

ఈ కింది వాటిని నాలుగు పాదాలలో [ఒక్కొక్కటి ఒక పాదం లో ] ఉపయోగించి ఒక పద్యం రాయగలరు
రాకెట్టు
జాకెట్టు
కనికట్టు
తీసికట్టు

భవదీయుడు
జయభారత్

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

జయభారత్! సంతోషం.
మీరిచ్చిన దత్త పదులను మీరు కోరినట్లే నాలుగు పాదాలలో చేర్చి కందం వ్రాస్తున్నాను చూడండి.

కందము:-
రాకెట్టులుండు కవిత? మ
జాకెట్టురచింపమన్న చక్కగ నటులే
మీకని కట్టుదు ఛందము.
నాకవితకు తీసికట్టు నసుగుడు కవితల్.

మీరూ ప్రయత్నిస్తే చక్కగా వ్రాయగలుగుతారు. ఎన్ని వేలకిలోమీటర్లదూరం వెళ్ళాలన్నా మొదటి అడుగుతోటే ప్రయాణం ప్రరంభమౌతుంది. అలాగే మీకవితా రచన ప్రయాణం కూడా. మరి ఆలస్యమెందుకు? మొదలుపెట్టండి పద్య రచన.

bharath చెప్పారు...

చాలాబాగుంది చాలా చాలా కృతజ్ఞతలు
got thrilled sir
jayabharath

my next request is

jayaprada
jayasudha
sridevi
soundarya

with raamayanam back drop
thank you sir

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

జైభారత్! దత్త పది - రామాయణాంశము. వ్రాశాను చూడండి.

తేటగీతి:-
పుత్ర కామేష్టి జయప్రదముగనుముగిసె.
విజయసుధలొల్కగను రాముడు జనియించె.
సుగుణ శ్రీదేవియే జానకిగ జనించె.
వారి సౌందర్యమునను గాంచి వసుధ మురిసె.

bharath చెప్పారు...

నా కోరికను మన్నించి పద్యాన్ని ఆశువుగా రాసినందుకు కృతజ్ఞతలు
థాంక్స్ సర్
జయభారత్

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.