గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

25, నవంబర్ 2008, మంగళవారం

పోతన గారి మత్తేభం.

సహజ పాండిత్యుడు శ్రీ బమ్మెర పోతన మహాకవి తాను విరచించే భాగవతాఖ్య కల్ప తరువు ఏ విధంగా వెలయునో మత్తేభంలో ఈ క్రింది విధంగా వివరిస్తున్నాడు. చూద్దామ్మా!

శ్రీమదాంధ్ర మహా భాగవతము పీఠికలో 22 వ పద్యము.
మత్తేభము:-
లలిత స్కంధము, కృష్ణ మూలము, శుకాలాభిరామంబు, మం
జు లతాభి శోభితము, సువర్ణ సుమనస్సుజ్ఞేయమున్, సుందరో
జ్వల వృత్తంబు, మహా ఫలంబు, విమల వ్యాసాలవాలంబునై,
వెలయున్ భాగవతాఖ్య కల్పతరువుర్విన్ సద్విజ శ్రేయమై.

రూపకాలంకార శోభితమైన ఈ మత్తేభం వృక్షాల్ని పెకలించే తన నిజ స్వభావాన్ని వీడి, తానే దీనిని కల్ప వృక్షంగా ప్రతిపాదిస్తూ, హొయలొలికే చక్కని నడకతో భాగవతాన్ని గూర్చి వివరించింది. మావటీడు పోతనకదా! మత్తేభం మరి నడవకేమి చేస్తుంది?
ఇంత అద్భుతమైన పద్యాన్ని కంఠస్థం చేసి తీరవలసిందే. మరిమనమూ కంఠస్థం చేద్దామా!
జైహింద్. Print this post

2 comments:

రాఘవ చెప్పారు...

రామకృష్ణారావుగారూ,
ఎప్పుడెప్పుడు పోతన గురుతుకొచ్చినా స్మృతిలో మెదిలే పద్యాలలో ఇదొకటి. ఎంత బాగా వ్రాశాడూ అని ఎప్పుడూ ఆశ్చర్యపోవడమే నా వంతు :)

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

యదార్థం చెప్పారు రాఘవా. అది అమృతము ఆంధ్రామృతము. పోతన భాగవతం లోని ప్రతీ ఘట్టమూ, ప్రతీ పద్యమూ ఆలోచనామృతమేకదండీ. ధన్య వాదాలు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.