గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

12, నవంబర్ 2008, బుధవారం

కవి సమ్రాట్ విశ్వనాధ భావుకత 5.

కవి సామ్రాట్ విశ్వనాధ సత్యనారాయణ తన రామాయణ కల్ప వృక్షంలో భావుకతను ఎలా ప్రదర్శించాడో వివరించిన శ్రీ బులుసు వేంకటెశ్వర్లు గారి ప్రసంగ పాఠం లోని 5 వ పద్యమును మీముందుంచుతున్నాను.
క:
ఆ చెట్టున కాతీవకు - రాచి పెనంగొనిన ప్రణయ రాగము కలుగన్
వీచీ దక్షిణ వాయువు - త్రోచెన్ మృదు వల్లి దూర దూరంబులకున్.
ఇది విశ్వనాధ వారి రామాయణ కల్ప వృక్షంలో నూపుర ఖండంలో 5 వ పద్యం.
పంపానదీ తీరాన శ్రీరాముని దృష్టి ఒక లతపై పడింది. ఆ తీగ ఇంతకు ముందు పెనవేసుకొనిన వృక్షమునకు దూరముగా పడియున్నది. కారణం బలముగా వీచిన దక్షిణ వాయువే.
దక్షిణ వాయువనగా మలయ పవనం. మలయ పర్వతం దక్షిణ దిక్కున ఉన్నది. మలయ మారుతం చల్లదనానికి ప్రసిద్ధి. కాని ఇక్కడ ఆ గాలి చల్లగా దొంగ వలె వచ్చి, గట్టిగా వీచి, ఆ చెట్టును ఆ తీగను వేరు చెసినది.
ఇక్కడ చెట్టు శ్రీరామునిగా, తీవ సీతమ్మగా, స్ఫురించుటయే కాక, దక్షిణ వాయు ప్రసక్తి వల్ల రావణుని స్ఫురణ కూడా కలుగుతుంది. రావణుడు దక్షిణ దేశ స్తేసుకొనిన తీగను దక్షిణ వాయువు నిర్దాక్షిణ్యముగా దూర దూరాలకు త్రోసివేసినది. అనే సామాన్య భావమునుండి ఒక అసామాన్యమైన ధ్వని పూర్వకమైన సీతారామ వియోగమును సూచించుట ఒక గొప్ప రచన. వృక్షమును పురుషునితో తీగను స్త్రీతో పోల్చుటలో ప్రత్యేకత లేదు. ఐతే దక్షిణ వాయువును ప్రవేశపెట్టడంలోనే విశ్వనాధుని భావుకత మనకు గోచరిస్తుంది.ఈ విధంగాచెప్పడం వల్ల రస సాధన యందు కవి కృతకృత్యుడయ్యాడు. పద్యాన్ని ఒక గొప్ప స్ఫురణకు ఉదాహరణ ప్రాయంగా తీర్చి దిద్దాడు.
ఈ విషయాన్ని వాల్మీకి " పుష్ప సంఛన్న శిఖరా మారుతోత్ క్షేప చంచలాః - అని మాత్రమే చెప్పాడు. పుష్ప భారము చే గాలికి వృక్షములు ఊగుచున్నవని భావము.ఈ చిన్న భావాన్ని ఆధారం చేసుకొని విశ్వనాధ కథాంశాన్ని ధ్వని రూపంలో ఎంత అద్భుతంగా చేపాగలిగాడో గమనించారు కదా! మరొక పర్యాయం మరొక పద్యంలోని భావుకతను వివరించేందుకు ప్రయత్నించగలను.
కవి వతంస శ్రీ బులుసు వెంకటేశ్వర్లు {సెల్.9949175899} గారి వివరణ వలన కల్ప వృక్షమనే మేలిమి బంగారానికి మృదుత్వం కూడా తోడౌతుందనడంలో యేమాత్రం సందేహం లేదు. దీనిపై మీ అభిప్రాయాన్ని కూడా మాకు పంప గలరు.
జైహింద్. Print this post

2 comments:

సో మా ర్క చెప్పారు...

అల్లుకున్న లతని కంద పద్యంలో చెప్పడంలో ఆ దృశ్యం నాకు కన్పిస్తూ ఇందులో ఛందస్సులో కూడా ఔచిత్యం కనబడింది.ఇది ఎంతవరకు నిజమో?
రామకృష్ణ కవీ!మంచి పోష్ట్ షేర్ చేశారు.అభినందనలు సర్.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

సోమార్క గారూ! మీకు నచ్చినందుకు చాలా సంతోషమండి. ధన్యవాదాలు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.