గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

14, నవంబర్ 2008, శుక్రవారం

సంతోష స్త్రిషు కర్తవ్యో కళత్రే, భోజనే, ధనే. మేలిమి బంగారం మన సంస్కృతి ౩.

తనకు లభించిన వాటితోనే మానవుడానందించాలి:-

మానవునకు సంతోషం అనేది ఒక గొప్ప వరం. ఐతే అన్ని విషయాల్లోనూ సంతోష పడడం మంచిదికాదు. అలాగే అన్ని విషయాల్లోనూ సంతోష పడకపోవడం కూడా మంచిది కాదు. ఐతే ఏ విషయాలలో సంతోషించాలి, ఏ విషయాలలో సతోషించడం తగదు అనేవిషయం ఇప్పుడు పరిశీలిద్దాం.


శ్లో:-
సంతోష స్త్రిషు కర్తవ్యో
కళత్రే, భోజనే, ధనే
స్త్రిషు చైవ నకర్తవ్యో
దానే, తపసి, పాఠనే.

:-
తనివి నొంద వలయు ధరపైన తనదగు
భార్య, భుక్తి, ధనము, భవ్యమనుచు.
తనివినొంద తగదు తానుగా చేసెడి
భవ్య దాన, తపము, పాఠనముల.

భావము:-
మానవుడు తనకు లభించిన తన భార్య విషయములోను, తనకు లభించిన భోజనము విషయము లోను, తనకు లభించిన ధనము విషయములోను తనివి పొందవలెను. తాను చేసెడి దానము విషయమున కాని, తాను చేసెడి తపసు విషయమున కాని, తాను చదివెడి చదువు విషయమున కాని తనివి పొందరాదు. ఆ విధముగ కాని పక్షమున అది అనర్థములకు కారణ మగును. కావున మానవుడు జ్ఞానము కలిగి ప్రవర్తింప వలెను.

జైహింద్.
Print this post

1 comments:

కొత్త పాళీ చెప్పారు...

మాస్టారు, చాలా రోజులక్కనిపించారు. టపా బావుంది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.