గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

13, నవంబర్ 2008, గురువారం

ఉత్తమే క్షణ కోపస్యాత్. మేలిమి బంగారం మన సంస్కృతి 2

కోప లక్షణము:-

మానవుడు సహజంగా ఎంతో మంచిగా బ్రతకాలనుకొంటాడు. కాని పరిస్థితుల ప్రభావం, పరిసరాల ప్రభావం, మానవుని నడకను శాశించడం వల్ల కృతకృత్యుడు కాలేకపోతున్నాడు. కారణం ఇంగితాన్ని కోల్పోవడమే. ఇంగితాన్ని కోల్పోయిన మానవుడికి కృత్యా కృత్యాలు తెలియవు. కోపం మాత్రమే ఆవరిస్తుంది.
ఈ కోపం విషయంలో ఒక చక్కని శ్లోకం ఉంది. గమనించండి.

శ్లో:-
ఉత్తమే క్షణ కోపస్యాత్.
మధ్యమే ఘటికా ద్వయం.
అధమే స్యాత్ అహో రాత్రం.
పాపిష్ఠే మరణాంతకం.


తే:-
ఉత్తముడు క్షణ కోపియై యుండు నిజము.
మధ్యముని లోన ఘడియుండి మాసి పోవు.
అధమునందున రోజుండి ఆరిపోవు.
పాపి మరణించు వరకును పాయదతని.

భావము:-
ఎట్టి వానికైనా ఎప్పుడో ఒకప్పుడు కోపం రాక మానదు. ఐతే ఉత్తములైనవానికి ఆ కోపం ఒక్క క్షణం మాత్రమే ఉంటుంది. మధ్యములలోఈ కోపం రెండు ఘడియలుంటుంది. అధములైన వారిలో ఒక రాత్రి ఒక పగలు ఈ కోపం ఉంటుంది.ఇక పాపిష్ఠులకయితే బ్రతికున్నంతకాలం ఉంటుందట.
మన మనో నిగ్రహాన్ని కలిగుంటే ఉత్తమోత్తములుగా కోప రహితంగా బ్రతుకవచ్చు. ఇది సమాజానికి, మనకు కూడా ప్రయోజనకరం. ఔనో కాదో మీరూ ఆలోచించండి.

జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.