గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

27, నవంబర్ 2008, గురువారం

న మాతరి న దారేషు . . . మేలిమి బంగారం మన సంస్కృతి 16

మిత్రుడే నిజంగా గొప్పవాడు:-
ఈ ప్రపంచంలో ప్రతీ వ్యక్తికీ తన బంధు వులపైఎంత ప్రేమవున్నా నమ్మకం మాత్రం మిత్రుల పైనే ఎక్కువగా వుంటుంది. ఇది మనకు అనుభవపూర్వకంగా తెలుస్తుంది. ఈ క్రింది శ్లోకాన్ని చూద్దామా!
శ్లో. న మాతరి న దారేషు న సోదర్యో నచాత్మజే
విశ్వాసః తాదృశః పుంసాం యావన్ మిత్రే స్వభావజే.

ఆ. తల్లి, దండ్రి కంటె తనయుని కంటెను
భార్య కంటె తనదు భగిని కంటె
తృప్తి నొసగు వాడు మిత్రుడే యని నమ్ము
పురుషులెపుడు కూడ పుడమి పైన.

భావము:- పురుషులెప్పుడూ కూడా తన తల్లిదండ్రుల కంటే, తన సంతానమును కంటే, తన భార్య కంటే, తన సోదరి కంటే కూడా తనకు మిత్రుడే తృప్తిని కలిగిస్తాడని నమ్ముతుంటాడు.
చూచాం కదా మిత్రుని గూర్చి ఎలా చెప్పాడో. అందువలననే మరో చోట కవి ఏమన్నాడో చూద్దామా.
శ్లో. శోకారాతి భయ త్రాణం ప్రీతివస్రంభభాజనం
కేన రత్నమిదం సృష్టం మిత్రమిత్యక్షర ద్వయం.

ఆ. దుఃఖ భయములున్న దూరము చేయును
శత్రు భయము బాపు నాత్రముగను.
మిత్రుడన్న వాడు మేలునే కోరును.

ఇట్టిమిత్ర రత్న మెవరి సృష్టి?
భావము:- మిత్రుడనే వాడు దుఃఖాన్ని, భయాన్ని, శతృ భయాన్ని, పారద్రోలి రక్షిస్తూ వుంటాడు. అతడు నిజంగా రత్నమే. అట్టి రత్నాన్ని ఎవడు సృష్టించాడో కదా!
ఎంత బాగా మిత్ర అనే రెండక్షరాల్ని నిర్వచించాడో చూచారా! మనమూ మిత్ర ధర్మాన్ని పాటించి సన్మిత్రులుగా వెలుగొందుదామా!
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.