గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

29, నవంబర్ 2008, శనివారం

విద్యా వివాదాయ ధనం మదాయ . . . మేలిమి బంగారం మన సంస్కృతి 21

విద్యా ధన బలముల ప్రభావము.
మనలో చాలామందికి విద్వత్తు, ధనము, బలము ఉండడం మనకు తెలిసిన విషయమే. ఐతే వీటి వినియోగం విషయంలో మాత్రం ఎవరెవరు ఎలా యెలా చేస్తారో వివరిస్తూ ఒక చక్కని శ్లోకం ఉంది. చూద్దామా!
శ్లో. విద్యా వివాదాయ ధనం మదాయ
శక్తిః పరేషాం ఖలు పీడనాయ.
ఖలస్య సాధోః విపరీతమేతత్
జ్ఞానాయ దానాయచ రక్షణాయ.

చ. వరలెడి విద్య మూర్ఖపు వివాదపు ప్రౌఢిమ, విత్తమున్ మదం
బరయగ శక్తి నన్యులను బాధలు పెట్టుగ మూర్ఖు లందునన్,
పరులకు జ్ఞానమున్ గొలుప, భక్తిని పంచగ పేదవారికిన్
సరగున రక్ష సేయగను సజ్జనులందున నొప్పు నెల్లెడన్.

భావము:- విద్య, ధనము, బలము అను యీ మూడూ మూర్ఖులందు వివాదము కొరకును, గర్వ పడుటకును, పరులను హింసించుటకునూ ఉపయోగ పడుచుండగా, సజ్జనులయందు ఇతరులకు జ్ఞాన బోధ కలిగించుటకు, పేదలకు కష్టములలో సహాయము చేయుట కొరకూ, బాధలలో నున్న వారిని రక్షించుట కొరకునూ
ఉపయోగ పడుచున్నది కదా!
విద్యా ధన బలములను మంచి కొరకు ఉపయోగించుకొనువాడు సజ్జనుడు. వీటిని అకారణ వివాదములకు, గర్వ పడుటకు , ఇతరులను బాధ పెట్టుతకూ ఉపయోగించుకొనువాడు దుర్జనుడు. మనం అపు రూపమయిన పై మూడూ పొంద గలిగితే తప్పక మంచి కొరకే, పరుల కుపకారము చేయుట కొరకే ఉపయోగించి సజ్జనుల జాబితాలో చేరుదామా మరి!
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.