శ్రీ విశ్వ నాథ వారి రామాయణ కల్ప వృక్షం నందలి భావుకతను గూర్చి కవి వతంస శ్రీ బులుసు వెంకటేశ్వర్లు గారి ఉపన్యాస పాఠములో 6 వ భాగాన్ని ఇప్పుడు మీ ముందుచుతున్నందుకు ఆనందంగా ఉంది
కిష్కింధా కాండలో 1 లో 6 వ పద్యము.
చంపకమాల:-
తిరిగిన పంప నీరములు తీర్చిన సారణులై లతల్ పొదల్
తరువుల చిక్క పచ్చనల తన్ కున యాకులు నేత్ర తర్పణ
స్ఫురణము సేయ నియ్యటవి ముగ్ధ మనోహర కేళికాననా
దరము గడించెడున్ నవ లతాంత మహాయుధు బాకుటిల్లు నాన్.
శ్రీరాముడు ప్రస్తుతం వియోగ శృంగార నాయకుడు. విరహ దందహ్యమాన హృదయుడై యున్నాడు.
నిన్ను సేవిస్తూ, నీతో విహరిస్తూ,వసంత శోభతో అందగించిన వనాల్లో నివసిస్తాను.అని ముచ్చట పడిన సీత ప్రస్తుతమాముని ప్రక్కన లేదు. ఈ వసంత సౌందర్యాన్ని సీతతో కలసి ఆస్వాదిద్దామనుకొనే అతని కోరిక సీతా వియోగం కారణంచేత దుఃఖ కారక మవుతోంది.అందు చేత పరమ మనోహర మధు మాస సౌందర్యము పంపా పరిసర అరణ్య సౌభాగ్యము శ్రీ రామునకు బాధాహేతువుగా కవి వర్ణించాడు.
ప్రకృతి సహజంగా ఏర్పడ్డ కాలువల ద్వారా ప్రవహించి సారవంతము గావించిన పంపా సరస్సు సమీప భూములలో లతలు, పొదలు, తరువులు, ఎంత ఆరోగ్యంగా పెరిగాయంటే ..... వాటి పచ్చని ఆకులు నేత్ర తర్పణ చేస్తున్నాయి. నేత్రేంద్రియానికి తృప్తిని కలిగిస్తున్నాయి.ఈ అడవి మనోహరమైన కేళీ వనంవలె కనిపిస్తున్నది. క్రీడోద్యానము వలె కనిపిస్తూ మన్మధుని బాకుటిల్లులాగుంది.
ఆ వనము శ్రీరామునికి గతములో తాను సీతతోవిహరించిన అయోధ్యలోనిక్రీడోద్యానమును గుర్తుకు తెచ్చినది. ఆ మధుర స్మృతి నుండి హఠాత్తుగా సీతా వియోగం అనే దురవస్థ కూడా తలపుకు వచ్చింది. సీతా విరహుడైన రామునకు ఆ వనము " నవ లతాంతాయుధు బాకుటిల్లులా కనిపించింది. " నవ లతాంతాయుధు " ప్రయోగం వల్ల పుష్ప విరాజితమై, మన్మధ బాకుటిల్లులాగుందని వర్ణిచడం వలన రామునికి గల విరహాధిక్యతను తెలియ జేయడం జరిగింది.
ఇటు ప్రకృతి సౌందర్యాన్ని వర్ణిస్తూనే అటు శ్రీరాముని విరహ స్పందనను తేలియ జేయడంలో విశ్వనాధుని కవన నైపుణ్యం ద్యోతకమవుతుంది.
ప్రకృతి యందలి ప్రతి వస్తువు రామునకు సీతను జ్ఞప్తికి తెస్తున్నాయి. ఇదే మనమిక్కడ గ్రహించ వలసిన విషయము. అదేమిటంటే ...సీతమ్మ ప్రకృతి స్వరూపిణి అని.
చూచారుకదా బులుసువారి వివరణని....మరొకమారు మరొక పద్యాన్ని గూర్చి వారి వివరణను మీ ముందుంచేందుకు ప్రయత్నిస్తాను. జైహింద్.
Print this post
ప్రజాసంకల్పంలో నా పద్యం. లక్ష్మీ సహస్రనామావళిలో 505 వ నామం పద్యము.
-
జైశ్రీరామ్.
జైహింద్.
1 రోజు క్రితం
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.