ఆ ముగ్గురికీ శాశ్విత నరకం ఖాయం:-
మిత్ర అనేది రెండక్షరాల రత్నమని క్రిందటి సారి చాలా గొప్పగా చెప్పుకొన్నాం. అటువంటి మిత్రునికి వీలయితే మేలు చేయాలి. మిత్ర ద్రోహానికి పాల్పడరాదు. అలా మిత్ర ద్రోహానికి పాల్ పడితే దాని ఫలితాన్ని గూర్చి చెప్పబడిందొక శ్లోకంలో. చూద్దామా?శ్లో. మిత్ర ద్రోహీ కృతఘ్నశ్చ యశ్చ విశ్వాస ఘాతుకః
తే త్రయో నరకం యాంతి యావచ్చంద్ర దివాకరౌ.
గీ. మిత్రులకు ద్రోహ మొనరించు కౄరులకును,
మేలు పొందియు మరచెడి కూళ లకును
నమ్మకము వమ్ము చేసెడి నటకు లకును,
నరక మబ్బును సూర్యు లున్నంత వరకు.
భావము:- మిత్రులకు ద్రోహము చేసెడి మిత్ర ద్రోహులకూ, ఉపకారం పొంది కూడా మరచిపోయే దుష్టులకూ, విశ్వాస ఘాతకులకూ సూర్య చంద్రాదు లున్నంత కాలం నరకంలో ఉండి నరక యాతన పొందక తప్పదు.
చూచారా, ఎంత ఘోర పాపమో. తెలిసి తెలిసీ అలాంటి నరక యాతన కొని తెచ్చుకొంటామా! మిత్ర ద్రోహానికీ, కృతఘ్నతకీ, విశ్వాస ఘాతుకానికీ మనం పాల్పడకుండా ఉంటే సరి. ఆ నరక యాతన మనం పొందవలసిన అవసరముండదు కదా! ప్రయత్న పూర్వకంగా జాగ్రత్త పడదామా మరి?
జైహింద్.
3 comments:
బాగుంది.కాని చంద్రుడు అనువాదం లోకి రాలేదు.గమనించగలరు.
శ్రీ నారసిమ్హా! నమో నమః . మీ సు నీత పరిసీలనా దృష్టికి నా అభినందనలు.
మనకు కనిపించే ఈ సూర్యుడున్నంతకాలం అతని కాంతి వలన ప్రకాశించే చంద్రుడూ ఉంటాడు. కాలాన్ని నిర్దేశించేటందుకు ప్రయోగించినందున చంద్ర పద ప్రయోగం లేకపోయినా ప్రయోజన మాంద్యం కలుగదనుకొంటాను. ఐనా ఒకసూర్యుడు మాత్రమే అయితే అది పరిమిత కాలమే అవుతుందికాన సూర్యులు అని ప్రయోగించడం ద్వారా ద్వాదశాదిత్యులను సూచించి అపరిమిత కాలాన్ని పద్యంలో సూచించడం ద్వారా నరకయాతన ననంత కాలం అనుభవించాలనే తాత్పర్యం రాగలదని నా భావన. నా ప్రయత్నానికి ప్రాణం పోస్తూ బ్లాగుకు వన్నె తెస్తున్న మీకు నా ధన్య వాదములు.
భవదీయుడు
చింతా రామ కృష్ణా రావు.
శ్రీ నారసిమ్హా! నమో నమః . మీ సు నిశిత పరిసీలనా దృష్టికి నా అభినందనలు.
మనకు కనిపించే ఈ సూర్యుడున్నంతకాలం అతని కాంతి వలన ప్రకాశించే చంద్రుడూ ఉంటాడు. కాలాన్ని నిర్దేశించేటందుకు ప్రయోగించినందున చంద్ర పద ప్రయోగం లేకపోయినా ప్రయోజన మాంద్యం కలుగదనుకొంటాను. ఐనా ఒకసూర్యుడు మాత్రమే అయితే అది పరిమిత కాలమే అవుతుందికాన సూర్యులు అని ప్రయోగించడం ద్వారా ద్వాదశాదిత్యులను సూచించి అపరిమిత కాలాన్ని పద్యంలో సూచించడం ద్వారా నరకయాతన ననంత కాలం అనుభవించాలనే తాత్పర్యం రాగలదని నా భావన. నా ప్రయత్నానికి ప్రాణం పోస్తూ బ్లాగుకు వన్నె తెస్తున్న మీకు నా ధన్య వాదములు.
భవదీయుడు
చింతా రామ కృష్ణా రావు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.