గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

28, ఏప్రిల్ 2020, మంగళవారం

ఇప్పుడే అనగా౨౭ - ౪ - ౨౦౨౦ మధ్యాహ్నం మూడు నుండి జరిగిన అవధానం.

జైశ్రీరామ్.
ఆర్యులారా. నమస్సులు. ఇప్పుడే శ్రీ కవిరాజు గంగుల ధర్మరాజు అవధాని అంతర్జాలంలో అవధాన సుధాసింధువు వాట్సప్ గ్రూపులో జరుగుచున్న అవధానమును నేనును ప్రయత్నించి తోడనే చేసిన పూరణలు.
ఓం
౧. నిషిద్ధాక్షరి.
లలితాంబ వర్ణన.

శ్రీనేవేడన్గానే
తానేనీవై శుభాళిదయ చేతువుగా.
నేనిను సతతము లలితా
జ్ఞానంబిడ కొలుతునమ్మ. గౌరవమొప్పన్.

౨. సమస్యా పూరణ.
శంభుఁడు సాంబుఁడై సతము సజ్జన పాళిని గాచుచుండు నా
రంభము నుండి భక్తులను రాజిల వర్ధన జేయ జూచుచున్
శంభుని సేవజేయుచుభృశంబు శ్రమించుచునుండెనట్టి సం
రంభను గాంచి యంబయని రాగమునొందెగదా మహేశుఁడే.

౩. దత్తపది.
కంపము బుట్టు దుష్టులకు కంసుని జంపిన కృష్ణుఁడన్నచో
గంపను పెట్టియాతనిని కావగనందునిఁ జేర్చి తండ్రియే.
కొంపలు ముల్గె దుష్టులకు కూల్చెను వారిని పట్టి కృష్ణుఁడున్.
చెంపకుచారెడైన కను చిన్నెలు గోపిక లెన్ని పొంగిరే.

౪. వర్ణన.
ఆటవెలదిలో కరోనా హెచ్చరిక యువతకు.
దూరదృష్టి లేక దూసుకుపోవుచు
తిరుగరాదు మీకు తెలియవలయు.
కనగనీ కరోన కాలాంతకునివలె
చంపునయ్య పిదప కొంప మునుగు.

౫. న్యస్తాక్షరి.
కలియుగ వేంకటేశ్వరుఁడు కాచు ప్రజాళి నటంచు నిత్యమున్ (౧/౫వేం)
కలఁగను వేళనుండియును మ్మగనిద్దురపోవనీయకన్ (౨/౧౧క)
సులలిత వాక్సుధాలహరిశోక నటేశుని బోలియాడుచున్ (౩/౧౪టే.)
కలకలనుందురిప్పుడటు కాదు. కరోనయె యీ! చేసెనే. (౪/౧౮శ)

౬. ఆశువు.
శంకరాచార్య అద్వైతం.
శంకరునద్వైతంబది
శంకలనేబాపె పృథ్వి సర్వజనులకు
సంకటభావము బాపెను.
శంకరుడే శంకరుడయె సరసగుణాఢ్యా!

౭. చిత్రానికి పద్యం. ౧.

కోపము వలదు యశోదా!
యీపాడు చిన్నివాడు యిటులే చేయున్
పాపంబల్లరి. కావున
శ్రీపతిసముడీతడు. కను చిన్ని కుమారున్.

౬. ఆశువు. ౨.
కరోనాలో సేవలందిస్తున్నవారిని ప్రశంసించండి.
నిరతము బాధ్యతన్ గలిగి నిర్మల సద్హృదయుల్ మహాత్ములున్
పరమ దయార్ద్ర చిత్తులయి భాసిలు సేవలఁ జేయుచున్.ప్రజన్
చొరబడనీక కాచుదురు చూచి కరోనకు దూరముంచుచున్
వరగుణ సేవనన్ ఘనులు వర్ధిలుచుండిరి వారికిన్నతుల్.

౭. చిత్రానికి పద్యం.౨.

ఫాలాక్షుఁడు గొనుచుండెన్
హాలాహలమరెరె బాధనరయమినయయో!
మేలగు రమ నాశ్రీహరి
యేలఁగ గొని విషమితనికి నిచ్చుట తగునా?
స్వస్తి.
చింతా రామకృష్ణారావు.

తే.౨౭ - ౪ - ౨౦౨౦.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.