జైశ్రీరామ్.
౨౩ - ౪ - ౨౦౨౦ వతేదీని అంతర్జాల అష్టావధానంలో అవధాని శ్రీ లోకా కగన్నాథశాస్త్రితో పాటు నేను ప్రయత్నించిన పూరణలు.
నిషిద్ధాక్షరి.వైద్యుడు దైవసమానుడు వర్ణించండి.
క. శ్రీమార్గమ్మై దైవ
మ్మై మేల్ కూర్మిన్ గొలిపెడి మాన్యుల్ గాచే
ధీమంతుల్ వైద్యులిలను
క్షేమంబున్గొల్పు సురలె కీర్తింపవలెన్.
సమస్య.
భవితను చూడలేక. గుణవర్ధనులన్ భువి నిందఁ జేయుచున్
ప్రవిమలఛందముల్ విడిచి పాడువిధానములాశ్రయించుచున్
కవితలు చెప్పు దుష్కవులు. జ్ఞానమొకింతయు లేనియట్టి యా
కవులను గౌరవింపకుడు కావ్యములన్ బడవేయుడగ్నిలో.
దత్తపది.
కార్యములాచరించుటను గౌరవమొప్పగ మెల్గుచుండి యా
హార్యమునందు భర్తమది కానుచునుండియు కర్య కల్పనా
ధుర్యవరేణ్యయై కులవధూమణియై మహనీయ సౌమ్యయౌ
భార్యను కల్గియుండుటది భాగ్యము పుణ్యఫలంబె చూడగన్.
న్యస్తాక్షరి.
“శాసనము “ అను అక్షరములు ఉత్పల మాలా వృత్తము లో
1. వ పాదములో 1 వ అక్షరము “శా”
2. వ పాదములో 5 వ అక్షరము “స”
3. వ పాదములో 9 వ అక్షరము “న”
4. వ పాదములో 12 వ అక్షరము “ము”
వచ్చేలా ఆధునిక రాజకీయము పై ఒక పద్యము చెప్పండి.
శాంతముతోడ నీప్రజను చక్కగ పాలన చేయువారలున్
క్షాంత విలాస5. ధామ, గుణగణ్యులునున్మహనీయ దాతలున్
భ్రాంతికి దూరులైన మన9పాలకవల్గమునాడు కల్గె. నే
డింతయు క్షేమమున్ గనని హేయము12నొప్పెడివారె పాలకుల్.
వర్ణన. భారతీయ సంస్కృతి.
సీ. శ్రీమన్మహాజ్ఞాన భూమీశులానాడు
గురుకుల విద్యను కూర్మి నెరప
పాఠములానాడు ప్రజలకు శ్రేయంబు
వరలింప గరపెడి బాటగొలిపి
ప్రకృతివైద్యవిధాన మకళంకముగ నేర్ప
యారోగ్యసత్పథమమరఁజేసి
హోమోదులంజేసి భూమిన్ జనులసౌఖ్య
కారణమగుచును ఘనత వరలి
గీ. భారతీయత దెలిపి సద్భావిగొలిపి
సౌఖ్యసంపత్తులను గొల్పు సచివులలర
భరతభూమియే యానాడు వరలె కనగ.
సంస్కృతీప్రభనలరెడిజన్మభూమి.
ఆశువు.1
ఒక్కరోజు ప్రథాని.నైతే....
ప్రాణము మోడీ. కాదని
నేనొల్ల ప్రథాని పదవి నేర్పరి నే కాన్
ప్రాణములనె గొనిపోయెడి
జాణనుయీ దుష్కరోనఁ జంపగనేరన్.
చిత్రానికి పద్యం.1
ఎంతటి దుస్థితి నలునకు.
సుంతైనా దయయెలేదు చూడగ విధికిన్.
క్రాంతి పథమ్ముననడచెడి
శాంతునిబాధించ శనికె సంభవమాయెన్.
ఆశువు 2.
హిమాలయాలకి విహారయాత్ర. అల్లసాని పూనితే.
చెప్పెద గొప్పగు ప్రకృతిని.
చెప్పెద గంగాఝరులను శేముషినొప్పన్.
జెప్పెద నక్కడి మనుజుల
జెప్పెదనా స్థలమహిమను శ్రీకర. వినగన్.
చిత్రానికి పద్యం 2.
అద్దములో తన యందపు
ముద్దుమొగమునను కనుచును మోమున చుక్కన్
తద్దయు పెట్టెడి కాంతను
ముద్దుగ కను భాగ్యులీరు పూజ్యా. కనుడీ.
స్వస్తి.
జైహింద్.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.