గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

29, ఏప్రిల్ 2020, బుధవారం

ఆర్యులారా! నిన్న మధ్యాహ్నం మూడు గంటలనుండి అవధాన సుధా సింధువు అంతర్జాల వాట్సప్ లో శ్రీ అప్తగోయిన వేంకటేశ్వర్లు అవధాని చేయుచున్న అవధానమును నేనును అనుసరిస్తూ చేసిన ప్రయత్నము. తే. ౨౮ - ౪ - ౨౦౨౦,

జయ్ శ్రీరామ్.
ఆర్యులారా! ఇప్పుడే మూడు గంటలనుండి అవధాన సుధా సింధువు అంతర్జాల వాట్సప్ లో శ్రీ అప్తగోయిన వేంకటేశ్వర్లు అవధాని చేయుచున్న అవధానమును నేనును అనుసరిస్తూ చేసిన ప్రయత్నము.
తే. ౨౮ - ౪ - ౨౦౨౦,
ఓం
౧. నిషిద్ధాక్షరి.
గ్రీష్మంలో మల్లెపూవు వర్ణన.
శ్రీమంతంబై వెన్నన్,
శ్రీమంతుండగు శశిని ప్రసిద్ధిగ పోలున్
ప్రేమను గొలిపెడి మల్లియ
కోమలి! గ్రీష్మమునమనలకోసమె వచ్చెన్.

౨. సమస్యా పూరణ.  
సులలిత రామ పదాబ్జము
లిల మానవ జాతికిహిత మే కద గొలుపున్
విలువను గనుచును పలుకుచు
తలపున నిలుపగ నిరతము తలమానికమౌన్.

౩. దత్తపది.
నమ్మితి రామపదాబ్జమె
నమ్మితి సీతమ్మ భక్తి నమ్మితి నీతిన్
నమ్మితి రుజు మార్గంబునె
నమ్మితి నని హనుమ పలికె నయముదలిర్పన్.

౪. న్యస్తాక్షరి.
ఉత్పలమాలలో
కారణ జన్ముడీతఁడిల. కాళియె సద్వరభాగ్యమీయగా     ((౧/కా)
వీరికి మౌళి భాగమున ప్రీతిగ శారదయే వశించునే       .( ౫/ళి)
స్మేర మనోజ్ఞుడై కవుల చిత్తములెక్క ముదాకరంబుగా   (౧౬/దా)
కోరిన దానినే పలుకు గొప్ప కవీశుఁడు కాళిదాసుగా..  ( /౧౯/సు)

౫. వర్ణన.
వసంత యామిని వర్ణన. మత్త్కోకిలలో.
శ్రీకరంబవసంతశోభలు చేర్చునందముభూమికిన్.
లోకమందు వసంత యామినిశ్లోకముల్ పలికించుగా
శ్రీకరంబగు భావ సంపదచేర్చుచున్ మది పొంగగా
హే కవీశ్వరులార గొల్పుడహీనసత్కవితాసుధన్..

౬. ఆశువు.  ౧
కరోనాలో రైతు హృదయను.
తొలకరిజల్లులింక మము తొందరపెట్టుచు వచ్చుచుండెనే
తొలగదదేలనో కనగ దుష్టకరోన ప్రపంచ భాగ్యమే
వెలవెలబోవుచుండె మరి పృథ్విని దున్నుటదెట్లు సాగు? నీ
వలననె సాధ్యమౌనుగద బాపుము దీనిని దీన బాంధవా!

౬. ఆశువు.  ౨.
ఓజోన్ ఆనందం.
నెలకొనె లాక్కుడౌను కరుణించెను దైవము నన్ను క్రోలుకోఁ
గలిగితి నేటికిన్ ప్రజలు గాలిని ధూమము తోడ పాడుగా
విలువల నెంచి చేయరిక విశ్వ విధానము బాగుగానగున్
శ్రీలనుగొల్పుదేవ యని కోరెను ఓజ శుభంబునెంచుచున్.


౭.అంత్యాక్షరి.  ౧. ఓజోన్ ఆనందం
వరదుఁడ! శ్రీహరీ పృథివి వర్ధిలఁ జూడుము ప్రేమతోడ ని
న్నరయుచు భక్తులెల్లరుఘనంబుగ పూజలు చేఅనెంచినన్
దురిత కరోనచే నెటుల దోపకయున్నది చేయు కార్యముల్
పరమహితంబు నీవెకద భాగ్యదగొల్పుదువయ్య మాకిలన్..

౭.అంత్యాక్షరి.  ౨.
భోగములేలఁ గొల్పితివి భోగశయాన మహాత్మ మాకిలన్.
రాగము నీపయిన్ గొలిపి రంజిల చేసిన మేము మెచ్చమే
మాగతి నీవె. చూడు వరమైన నిను విడఁ జాలమయ్య. సద్
యోగము నీ కృపన్ గలుగు హాయిగ మమ్ములనుండజేయుమా.

స్వస్తి.
చింతా రామకృష్ణారావు.
జయ్ హింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.