గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

23, సెప్టెంబర్ 2017, శనివారం

చంద్రఘంట (అన్నపూర్ణ) .. .. .. అంతరాక్కర - తేటగీతి - ఆటవెలది ద్వయ గర్భ సీసము. .. .. .. చిత్ర బంధ గర్భ కవితాదులు.,

 జైశ్రీరామ్.
ఆర్యులారా! శరన్నవరాత్రులలో ఈ మూడవ రోజున జగదంబ మనలను చంద్రఘంట(అన్నపూర్ణ) గా కరుణిస్తుంది.
ఈ తల్లి తన శిరమున దాల్చిన అర్ధచంద్రుడు ఘంటాకృతిలో ఉండుటచే ఈమెకు 'చంద్రఘంట' యను పేరు స్థిరపడెను. ఈమె శరీరము బంగారు కాంతి మయము. ఈమె తన పది చేతులలో ఖడ్గము మొదలగు శస్త్రములను, బాణము మున్నగు అస్త్రములను ధరించియుండును. ఈమె సింహ వాహన. ఈమె సర్వదా సన్నాహయై యుద్ధముద్రలోనుండును. ఈమె గంటనుండి వెలువడు భయంకరధ్వనులను విన్నంతనే క్రూరులై దైత్య దానవ రాక్షసులు ఎల్లప్పుడు వడగడలాడుచుందురు. కాని భక్తులకును, ఉపాసకులకును ఈమె మిక్కిలి సౌమ్యముగను, ప్రశాంతముగను కన్పట్టుచుండును.

ఈ దేవి ఆరాధన సద్యఃఫలదాయకము. భక్తుల కష్టములను ఈమె అతి శీఘ్రముగా నివారించుచుండును. ఈ సింహవాహనను ఉపాసించువారు సింహ సదృశులై పరాక్రమశాలురుగా నిర్భయులుగా ఉందురు. ఏవిధమైన భయములును వారిని బాధింపజాలవు.
సర్వ మంగళ స్వరూపిణియైన ఈ తల్లి ఆశీస్సులు మీకు లభించాలని మనసారా కోరుకొంటున్నాను.
చంద్రఘంట(అన్నపూర్ణ)
శ్లో|| పిండజప్రవరూరుఢా చంద్రకోపాస్త్ర కైర్యుతా|
ప్రసాదం తనుతే మహ్యం చంద్రఘంటేతి విశ్రుతా ||
అంతరాక్కర - తేటగీతి - ఆటవెలది ద్వయ గర్భ సీసము
మాన్య రూప! నిరుపమము చంద్రఘంట నీ నిర్మలాత్మ సుగుణ ధర్మ బోధ.
కలిమిఁ గూర్చి కరుణఁ గను తల్లి వీవెగా కాపు మాకు కనఁగ కామిత ప్రద!
నయతనీయ, సరగునను వచ్చి కొల్పు సత్సంగ రక్తి.  వరశుభాంగ నీవు..
ఎన్ని చూడ తరుణ మిది కావ నన్ను తత్వార్థ భాస! కనుమ! వరల నిమ్మ!
తే.గీ. నీదు పాదాబ్జములపైన నాదు మనసు
నిలువఁ జేయుమ! మాయమ్మ! నిన్నె కొలుతు.
నీవె రక్షీంపకున్నచో త్రోవ లేదు.

పార్వతీ! పతి తోడుగ వరలు మదిని.

సీస గర్భస్థ  అంతరాక్కర. 
(అంతరాక్కర1సూ.గణము, 2ఇం.గణములు, 1చం.గణము .. 
యతి 3వ గణము చివరి అక్షరము)
నిరుపమము చంద్రఘంట నీ నిర్మలాత్మ 
కరుణఁ గను తల్లి వీవెగా కాపు మాకు
సరగునను వచ్చి కొల్పు సత్సంగ రక్తి
తరుణ మిది కావ నన్ను తత్వార్థ భాస! 

సీస గర్భస్థ  తేటగీతి..
నిరుపమము చంద్రఘంట నీ నిర్మలాత్మ 
కరుణఁ గను తల్లి వీవెగా కాపు మాకు
సరగునను వచ్చి కొల్పు సత్సంగ రక్తి. 
తరుణ మిది కావ నన్ను తత్వార్థ భాస! 

సీస గర్భస్థ ఆటవెలది ద్వయము.
౧. మాన్య రూప! నిరుపమము చంద్రఘంట నీ - నిర్మలాత్మ సుగుణ ధర్మ బోధ.
కలిమిఁ గూర్చి కరుణఁ గను తల్లి వీవెగా - కాపు మాకు కనఁగ కామిత ప్రద!
౨. నయతనీయ, సరగునను వచ్చి కొల్పు స - త్సంగ రక్తి.  వరశుభాంగ నీవు..
ఎన్ని చూడ తరుణ మిది కావ నన్ను త - త్వార్థ భాస! కనుమ! వరల నిమ్మ!
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
సర్వ మంగళ స్వరూపిణి అయిన అన్నపూర్ణా దేవికి శత వందనములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.