గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

27, సెప్టెంబర్ 2017, బుధవారం

కాళరాత్రి ( సరస్వతి ) .. .. .. చిత్ర బంధ గర్భ కవితాదులు.,

జైశ్రీరామ్.
ఆర్యులారా! నేడు మన తల్లి కాళరాత్రి రూపమున దర్శనమిచ్చి మనలను కాపాడనున్నది.
"కాళరాత్రి" శరీరవర్ణము గాఢాంధకారము వలె నల్లనిది. తలపై కేశములు చెల్లాచెదురై యుండును. మెడలోని హారము విద్యుత్కాంతులను విరజిమ్ముచుండును. ఈమె త్రినేత్రములు బ్రహ్మాండములవలె గుండ్రనివి. ఈమె నాశికా శ్వాస ప్రశ్వాసలు భయంకరములైన అగ్నిజ్వాలలను వెడలగ్రక్కుచుండును. ఈమె వాహనము గార్దభము. ఈమె తన ఒక కుడిచేతి వరముద్ర ద్వారా అందఱికిని వరములను ప్రసాదించుచుండును. మఱియొక కుడిచేయి అభయ ముద్రను కలిగియుండును. ఒక ఎడమచేతిలో ఇనపముండ్ల ఆయుధము, మఱొక ఎడమచేతిలో ఖడ్గము ధరించియుండును.

కాళరాత్రి స్వరూపము చూచుటకు మిక్కిలి భయానకము - కాని ఈమె ఎల్లప్పుడూ శుభములనే ప్రసాదించుచుండును. అందువలన ఈమెను "శుభంకరి" అనియు అందురు. కావున భక్తులు ఈమెను చూచి ఏ మాత్రము భయమును గాని, ఆందోళనను గాని పొందనవసరమే లేదు.

కాళరాత్రి మాతను స్మరించినంతమాత్రముననే దానవులు, దైత్యులు, రాక్షసులు, భూతప్రేతపిశాచములు భయముతో పారిపోవుట తథ్యము. ఈమె యనుగ్రహమున గ్రహబాధలును తొలగిపోవును. ఈమెను ఉపాసించువారికి అగ్ని, జలము, జంతువులు మొదలగువాటి భయముగాని, శత్రువుల భయముగాని, రాత్రి భయముగాని ఏ మాత్రము ఉండవు. ఈమె కృపచే భక్తులు సర్వధా భయవిముక్తులగుదురు.
ఈ తల్లి కరుణకు మీరు పాత్రులవాలని మనసారా కోరుకొంటున్నాను.
కాళరాత్రి ( సరస్వతి )
శ్లో|| ఏకవేణీ జపాకర్ణపూరా నగ్నాఖరాస్థితా|
లంబోష్ఠీ కర్ణికాకర్ణీ తైలాభ్యక్త శరీరిణీ |
వామపాదోల్లసల్లోహలతాకంటక భూషణా|
వర మూర్ధధ్వజా కృష్ణా కాళరాత్రిర్భయంకరీ || 
సరసాంక వృత్త గర్భ సీసము. (సరసాంక వృత్తము. - స జ స స య .. యతి 10)
కరుణింపవా! కలి కాల దుర్జన భయం - కర కాళరాత్రీ! సుఖంబునీవ?
హరియింపవా? కలుషాముల్ సుజనులన్ - కలఁగించుచుండన్గ కనవదేల?
లక్ష్యంబుతో ఖలున్, దహించగ నుపే - క్ష యదేలనమ్మా! సుజనులఁ గావ.
నాలసింపక మలినాత్ములన్ మడచి, మా - మది నుండిపొమ్మా! సమస్తమగుచు.
తే.గీ. ఖలుల పాలిట మాయమ్మ కాళరాత్రి.
సుజనులనుకాచుమాయమ్మ సుస్మితాంబ.
యనుచు జనులెల్ల నిన్గన కనుము మమ్ము.
వందనంబులు చేకొమ్ము భద్రకాళి.
సీస గర్భస్థ సరసాంక వృత్తము (స జ స స య .. యతి 10)
కలి కాల దుర్జన భయం కర కాళరాత్రీ!
కలుషాముల్ సుజనులన్ కలఁగించుచుండన్
ఖలున్, దహించగ నుపేక్ష యదేలనమ్మా!
మలినాత్ములన్ మడచి, మా మది నుండిపొమ్మా!
నైవేద్యం : కూరగాయలతో వండిన అన్నము.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
కాళరాత్రీ స్వరూపముతోనున్న సరస్వతీ మాతను చిత్రీకరించి ఆమె యొక్కవిశిష్టతను చక్కగా వివరించి నందులకు ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.