గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

24, సెప్టెంబర్ 2017, ఆదివారం

కూష్మాండ ( కామాక్షి ) .. .. .. చిత్ర బంధ గర్భ కవితాదులు.,

 జైశ్రీరామ్.
ఆర్యులారా! నేడు నాలుగవ రోజున జగన్మాత కూష్మాండ రూపమున మనలనఉ కటాక్షించుచున్నది.
దరహాసము చేయుచు (అవలీలగా) బ్రహ్మాండమును సృజించునది గావున ఈ దేవి 'కూష్మాండ' అను పేరుతో విఖ్యాత యయ్యెను. ఈమె సూర్య మండలాంతర్వర్తిని. ఈమె తేజస్సు నిరుపమానము. ఈమె యొక్క తేజోమండల ప్రభావముననే దశదిశలు వెలుగొందుచున్నవి. బ్రహ్మాండము లోని సకల వస్తువులలో, ప్రాణులలో గల తేజస్సు ఈమె ఛాయయే.

'అష్టభుజాదేవి' అని కూడా అనబడు ఈమె ఎనిమిది భుజములతో విరాజిల్లిచుండును. ఏడు చేతులలో వరుసగా కమండలువు, ధనుస్సు, బాణము, కమలము, అమృతకలశము, చక్రము, గద - అనునవి తేజరిల్లుచుండును. ఎనిమిదవ చేతితో సర్వసిద్ధులను, నిధులను ప్రసాదించు జపమాల యుండును. ఈమెయు సింహవాహనయే.

భక్తులు ఈ దేవిని చక్కగా ఉపాసించుటచే పరితృప్తయై ఈమె వారి రోగములను, శోకములను రూపుమాపును. ఈమె భక్తులకు ఆయుర్యశోబలములు, ఆరోగ్యభాగ్యములు వృద్ధిచెందును. కొద్దిపాటి భక్తిసేవలకును ఈదేవి ప్రసన్నురాలగును.ఈ జగన్మాత మిమ్ములను సరా నీడవోలె ఉండి రక్షించుగాక.
కూష్మాండ ( కామాక్షి )
శ్లో||  సురా సంపూర్ణకలశం రుధిరాప్లుతమేవ చ|
దధానా హస్త పద్మభ్యాం కూష్మాండా శుభ దాస్తుమే ||
ప్రణవ వృత్త గర్భ సీసము. ( ప్రణవ వృత్తము - మ న య గ .. యతి 6 )
నిర్మల రూప! నే నిన్ మ్రొక్కెద నిల కూ  ష్మాండా! జగన్మాత! శంభురాణి!
నోరార పిల్తు దీనున్ నన్ గని తెరవున్  జూపన్ గదే తల్లి! శోభఁ గొలుప.
ఆనంద పూర్ణజ్ఞానాంభోధివి కనవే  మమ్మా! మహా దేవి! సమ్మతమున.
నవతేజ పూజ్య! ప్రాణంబీవెగ పరమే  శానీ! మహాదేవి! జ్ఞానమిమ్ము.
తే.గీ. 
నిత్యకల్యాణివీవమ్మ! నిరుపమాన! - సత్య సన్మార్గ గా సలుపు నన్ను.
బంధ చిత్రాదులన్ గల భారతాంబ! - సుందరోజ్వల తేజమా! చూపు భవిత.
సీసగర్భస్థ ప్రణవ వృత్తము
నే నిన్ మ్రొక్కెద నిల కూష్మాండా! - దీనున్ నన్ గని తెరవున్ జూపన్ 

జ్ఞానాంభోధివి కనవేమమ్మా! - ప్రాణంబీవెగ పరమేశానీ!
నైవేద్యం : చిల్లులులేని అల్లం గారెలు
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
కూష్మాండ రూపిణి ఐన అమ్మవారు అష్ట భుజములతో విరాజిల్లుతూ లోకరక్షణము గావించు తల్లికి సాష్టాంగ ప్రణామములు .

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.