గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

21, సెప్టెంబర్ 2017, గురువారం

శైలపుత్రీ : (బాలా త్రిపుర సుందరి) ఉపజాతి వృత్త గర్భ సీసము.చిత్ర బంధ గర్భ కవితాదులు.,

జైశ్రీరామ్.
ఆర్యులారా! శరన్నవరాత్రులలో మొదటి రోజు జగన్మాత శైలపుత్రీ నామంతో మనకు దర్శనమిచ్చి కటాక్షిస్తుంది.
సతీదేవి యోగాగ్నిలో తనువును త్యజించి, పిదప పర్వతరాజైన హిమవంతుని యింట పుత్రికయై అవతరించినందున ఆమెకు శైలపుత్రి అను నామము. వృషభవాహనారూఢయైన ఈ మాతకు కుడిచేతిలో త్రిశూలము, ఎడమచేతిలో కమలము విరాజిల్లుచుండును. తలపై చంద్రవంకను ధరించియుండును. పార్వతి, హైమవతి అనునవియు ఆమె పేర్లే. శైలపుత్రి మహిమలు, శక్తులు అనంతములు. వాంఛితములను ప్రసాదించు తల్లి.
ఆ జగన్మాత కృప మీ అందరిపై ఉండాలని మీకు శుభాలు కలగాలని మనసారా కోరుకొంటున్నాను.
శైలపుత్రీ : (బాలా త్రిపుర సుందరి)
శ్లో|| వందే వాంఛిత లాభాయ చంద్రార్ధకృతశేఖరాం
వృషారూఢాం శూలధరాం శైలపుత్రీ యశస్వినీమ్ ||
ఉపజాతి వృత్త గర్భ సీసము.
ఈశ్వరీ! శరణు. జాగేల నన్ గావఁగ - శైల పుత్రీ కృపన్ జేర్చుకొమ్ము
కారుణ్య రూపా! ప్రగణ్య విశ్వార్చిత - వామ నేత్రీ సదా ప్రాపు నిలుమ.
అద్భుతంబైన భోగాదులంగూర్చిన - పూజ్య మాతా లసన్మూర్తి జనని
కంజాత నేత్రీ జగంబులోనంచిత శాంతినిమ్మా మాకు సంతసమున..
తే.గీ. నీదు నవరాత్రులన్ మాకు బోధఁ గొలిపి, సత్కవిత్వబు సలిపిశక్తినిచ్చి,
బంధ గర్భసుచిత్రంబులందుగొలుపు నేర్పునొసగి మమ్మేలుమా నిఖిల జనని.
సీస గర్భస్థ ఉపజాతి వృత్తము.
జాగేల నన్ గావఁగ శైల పుత్రీ!
                              ప్రగణ్య విశ్వార్చిత వామ నేత్రీ!                                  భోగాదులంగూర్చిన పూజ్య మాతా!
జగంబులోనంచిత శాంతినిమ్మా!
నైవేద్యం :  కట్టు పొంగలి
జైహింద్. 


Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
జగన్మాత " బాలాత్రిపుర సుందరి " తన కరుణారస వీక్షణములను అందరిపై ప్రసరించుగాక .దశహరా శుభాకాంక్షలు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.