గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

28, సెప్టెంబర్ 2017, గురువారం

మహాగౌరి( దుర్గ ) .. .. .. చిత్ర బంధ గర్భ కవితాదులు.,

 జైశ్రీరామ్.
ఆర్యులారా! ఈరోజు మన అమ్మ మహాగౌరిగా మనలను కరుణించుచున్నది.
అష్టవర్షా భవేద్గౌరీ - "మహాగౌరి" అష్టవర్ష ప్రాయము గలది. ఈమె గౌర వర్ణ శోభలు మల్లెపూవులను, శంఖమును, చంద్రుని తలపింపజేయును.ఈమె ధరించు వస్త్రములును, ఆభరణములును ధవళ కాంతులను వెదజల్లుచుండును. ఈమె చతుర్భుజ, వృషభవాహన. తన కుడిచేతులలో ఒకదానియందు అభయముద్రను, మఱియొకదానియందు త్రిశూలమును వహించియుండును. అట్లే ఎడమచేతులలో ఒకదానియందు డమరుకమును, వేఱొకదానియందు వరముద్రను కలిగియుండును. ఈమె దర్శనము ప్రశాంతము.

పార్వతి యవతారమున పరమశివుని పతిగా పొందుటకు కఠోరమైన తపస్సు చేయగా ఈమె శరీరము పూర్తిగా నలుపెక్కెను. ప్రసన్నుడైన శివుడు గంగాజలముతో అభిషేకించగా ఈమె శ్వేత వర్ణశోభితయై విద్యుత్కాంతులను విరజిమ్ముచు "మహాగౌరి" యని వాసిగాంచెను. ఈమె శక్తి అమోఘము. సద్యఃఫలదాయకము. ఈమెను ఉపాసించిన భక్తుల కల్మషములన్నియును ప్రక్షాళితమగును. వారి పూర్వ సంచిత పాపములును పూర్తిగా నశించును. భవిష్యత్తులో గూడ పాపతాపములుగాని, దైన్య దుఃఖములుగాని వారిని దరిజేరవు. వారు సర్వవిధముల పునీతులై, ఆక్షయముగా పుణ్యఫలములను పొందుదురు. ఈ దేవి పాదారవిందములను సేవించుటవలన కష్టములు మటుమాయమగును. ఈమె యుపాసన ప్రభావమున అసంభవములైన కార్యముల సైతము సంభవములే యగును.
ఈ తల్లి ఆశీస్సులు మీకు లభించుగాక.
మహాగౌరి( దుర్గ )
శ్లో|| శ్వేతే వృషే సమారూడా స్వేతాంబరధరా శుచిః|
మహాగౌరీ శుభం దద్యాత్, మహాదేవ ప్రమోదదా ||
నిశావృత్త గర్భ సీసము ( నిశావృత్తము న న ర ర ర ర .. యతి 9 )
సతి! కృపను గనుమ శాంభవీ! తల్లి! మా శ్రీమహాగౌరివై! చేదుకొనుము.
ఇక తపము జపములేల తల్లీల వమ్మౌనె నిన్ గాంచినన్. జ్ఞాన తేజ!
నిలు. నెపము వలదు నేను నిన్నే మదిన్ నిల్పి ధ్యానించెదన్. నేర్పు మీర.
ఇట ప్రపగ దొరికితీవ, భారంబు నీదే. జగద్రక్షిణీ! దివ్య తేజ!
తే.గీ. ఘన నిశా వృత్త గర్భస్థ గణ్య సీస
వినుత శ్రీమహా గౌరీ! వివేకమిమ్ము.
శారదానవరాత్రుల చలువనెపుడు
మమ్ము కాంచుచు రక్షించుమమ్మ! దేవి!
సీస గర్భస్థ నిశావృత్తము .( న న ర ర ర ర .. యతి 9 )
కృపను గనుమ శాంభవీ! తల్లి! మా శ్రీమహాగౌరివై!
తపము జపములేల తల్లీల వమ్మౌనె నిన్ గాంచినన్.
నెపము వలదు నేను నిన్నే మదిన్ నిల్పి ధ్యానించెదన్.
ప్రపగ దొరికితీవ, భారంబు నీదే. జగద్రక్షిణీ! దివ్య తేజ!
నైవేద్యం : చక్కెర పొంగలి (గుఢాన్నం)
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
మహాగౌరి దుర్గామాతా నమొనమ:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.