గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

26, సెప్టెంబర్ 2017, మంగళవారం

కాత్యాయని (లక్ష్మి) .. .. .. చిత్ర బంధ గర్భ కవితాదులు.,

జైశ్రీరామ్.
ఆర్యులారా! నేడు కాత్యనీ నామముతో దర్శనమిచ్చుచున్నది మన జగన్మాత. 
"కాత్యాయనీ మాత" బాధ్రపదబహుళ చతుర్దశి (ఉత్తరభారత పంచాంగ సంప్రదాయము ననుసరించి ఆశ్వయుజ కృష్ణ చతుర్దశి) నాడు, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల తేజస్సుతో కాత్యాయన మహర్షి యింట పుత్రికగా అవతరించింది. ఈమె ఆశ్వయుజ శుక్ల సప్తమి, అష్టమి, నవమి తిథుల యందు కాత్యాయన మహర్షి పూజలందుకొని విజయదశమినాడు మహిషాసురుని వధించెను.

కాత్యాయనీ దేవి అమోఘ ఫలదాయిని. కృష్ణ భగవానుని పడయుటకు గోకులములోని గోపికలందఱును యమునాతీరమున ఈమెను పూజించిరి. ఈమె స్వరూపము దివ్యము, భవ్యము. బంగారు వర్ణము గలది. నాలుగు భుజములతో విరాజిల్లుచుండును. ఈమె కుడిచేతిలో ఒకటి అభయ ముద్రను, మఱియొకటి వరముద్రను కలిగియుండును. ఎడమచేతిలో ఒకదానియందు ఖడ్గము, వేఱొకదానియందు పద్మము శోభిల్లుచుండును. ఈమెయు సింహవాహన.

ఈ దేవిని భక్తితో సేవించినవారికి ధర్మార్ధకామమోక్షములనెడి చతుర్విధ పురుషార్ధముల ఫలములు లభించును. రోగములు, శోకములు, సంతాపములు, భయములు దూరమగును. జన్మజన్మాంతర పాపములు నశించును.

మన జగన్మాత కటాక్షం మీకు లభించాలని కోరుకొంటున్నాను.
కాత్యాయని (లక్ష్మి)
శ్లో|| చంద్రహాసోజ్జ్వలకరా శార్దూల వరవాహనా |
కాత్యాయనీ శుభం దద్యాద్దేవీ దానవఘాతినీ ||
దండక గర్భ సీసము. (దండకము త త త త త త  . . . . . )
కాత్యాయనీ నీదు కారుణ్యమున్నన్ బ్ర కాశింతుమే మేము ఘనతరముగ.
నీకన్న మాకున్న లోకేశ్వరెన్నంగ లేదమ్మ.మాయమ్మ! మోదమిమ్మ.
నీపాద పద్మంబులేపార జూడంగ దీపించు సత్యంబు తేజమబ్బు
పాపాలు పోకార్పి కోపాలనే బాపి మాపాల నీవుండుమా కృపాబ్ధి.
తే.గీ. దండకంబందు నీవేను తలచి చూడ.
మెండుగాతోచు. మదినిండి యుండుమమ్మ.
పండు వెన్నెల చలువలు నిండియుండు
నీదు చూపులు మమ్ముల సేద తీర్చు.
సీస గర్భస్థ దండకము. (త త త త త త  . . . . . )
కాత్యాయనీ నీదు కారుణ్యమున్నన్ బ్రకాశింతుమే మేము.
నీకన్న మాకున్న లోకేశ్వరెన్నంగ లేదమ్మ.మాయమ్మ!
నీపాద పద్మంబులేపార జూడంగ దీపించు సత్యంబు.
పాపాలు పోకార్పి కోపాలనే బాపి మాపాల నీవుండుమా!
నైవేద్యం : రవ్వ కేసరి.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
వివిధ ఛందస్సులను అవలీలగా నేర్పు తున్నందులకు కృతజ్ఞతలు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.