గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

6, జులై 2017, గురువారం

పద్య పక్షమ్. ఛందస్సు ముగింపు వాక్యములు.

జైశ్రీరామ్.
పద్య పక్షమ్. ఛందస్సు
ముగింపు వాక్యములు.
శ్రీమత్ ప్రజ పద్యం పఠనాభిలాషులైన ఆర్యులారా! ప్రణామములు.
శ్రీమత్ ప్రజ పద్యం వేదికగా ఛందస్సునందించమని
శ్రీమాన్ అనంతకృష్ణ సహోదరులు, శ్రీపటువర్ధనులు, శ్రీ గణపతి గారు
ఆదేశించిన మేరకు
నాకు పరమాత్మ అనుగ్రహించిన మిడిమిడి జ్ఞానముతో
తొమ్మిది భాగములలో ఛందస్సునకు సంబంధించిన ప్రాథమికాంశములను ప్రచురింపగా,
అసాధారణముగా చూపిన మీ ఆదరణ మరువ రానిది.
ఈ అవకాశ నాకొసగిన ప్రజ పద్యం నిర్వాకల మూర్తిత్రయమునకు,
అసాధారణ ఆదరణ కనఁబరచిన మీ అందరికీ
నా ధన్యవాదములు తెలుపుకొనుచున్నాను.
నాకు శక్తినొసగి నన్ను నడిపిన ఆపరమాత్మకు
హృదయపూర్వక నమస్కృతులర్పించుకొనుచున్నాను.

శా. శ్రీమన్మానస మందిరస్థ కవితాశ్రీ తేజ సంభాసితుల్,
ప్రేమోద్భాసులు, పూజ్యభావులు, మహచ్ఛ్రేయోను సంధాయకుల్,
మీమీ స్వార్థము వీడి నన్ను కృపతో మేల్బంతిలో నిల్పినా
రే మిమ్మున్ మరువంగ లేను. కను మాహేశుండు ప్రీతిన్ మిమున్.

చ. కవన కుతూహలంబు కల గౌరవ మూర్తు లెఱుంగునట్లుగా
సవినయమున్ మనోజ్ఞమగు ఛందము ప్రాథమికాంశ సంపదన్
భవుని యనుజ్ఞగా తలచి వ్రాసితి సత్ ప్రజ పద్య రాశిలోన్
ప్రవిమల మానసుల్ చదివి వర్ధిల నన్ను ప్రశంస చేసిరే!

ఉ. తొమ్మిది భాగముల్ గొలిపి తోచిన రీతిని నేను వ్రాసితిన్.
సమ్ముదమంది నాకృషిని చక్కగ మెచ్చిన మీకు సన్నుతుల్.
కమ్మని మాటలన్ మది సుఖమ్ము కనంగను పల్కుమీరు వే
గమ్ముగ కావ్య కర్తలయి కాంచుత కీర్తి దిశాళినెల్లెడన్.

ఉ. చిత్ర కవిత్వ సద్రచన చేయుచునుండుడు చేవ చూప. స
న్మిత్ర సుసమ్మతమ్ముగ వినిర్మితి చేయుఁడు కావ్యరాజమున్.
ధాత్రిని భారతాంబ వరదాయిని మీకృషి చూచి మెచ్చుతన్
మిత్రునిగా తలంచి నను మేలుగ చూడఁగ వేడెదన్ మిమున్.

ఉ. ఛందములెల్ల మీ కెరుక సాధన చేయుచునుండిరీర లిం
కెందుల కిత్తరిన్ దెలుప నిచ్చట యంచు ముగించుచుంటి నో
సుందర సత్కవిత్వ గుణ శోభలెఱింగిన మిత్రులార! న
న్నందరనుగ్రహింపుడు. జయంబగు మీకును, భారతాంబకున్.
#CRKRchandassu .( ముఖ పుస్త్కము )

జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
ముగింపు వాఖ్యములు హృద్యమముగా నున్నవి .సరస్వతీ కటాక్షము నిరంతరము లభించ గలదని ఆశీర్వదించి అక్క

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.