గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

25, జనవరి 2013, శుక్రవారం

ఆర్యులారా!"హర్మ్యము నందు సంచరిలె హాయిగ పార్వతి విష్ణుమూర్తితో"సమస్యాపూరణ చేయ మనవి.

జైశ్రీరామ్.
తెలుగు కవితాభిమానులారా!
"హర్మ్యము నందు సంచరిలె హాయిగ పార్వతి విష్ణుమూర్తితో" 
అనే సమస్యకు నాపూరణనను తిలకింప మనవి. 
:-హర్మ్యము లందు సంచరిలు హాయిగ మానవు లంచుశంభుతో
హర్మ్యము
 నందు సంచరిలె హాయిగ పార్వతి . విష్ణుమూర్తితో.
హర్మ్యము నందు సంచరిలె హాయిగ లక్ష్మిమహత్వ బ్రహ్మతో
హర్మ్యమునందు సంచరిలె హాయిగ వాణి . అదెంత భాగ్యమో!
మీరు కూడా పూరించినట్లైతే వ్యాఖ్యానం ద్వారా పంప గలందులకు మనవి్చేయుచున్నాను.
జైహింద్.
Print this post

11 comments:

Pandita Nemani చెప్పారు...

ఏదో సరదాకి గాని ఇందులో సమస్య దుష్కర ప్రాస మాత్రమే.

హర్మ్యములోన నాడవలె నప్పుడు పెక్కగు నాటకమ్ములా
హర్మ్యములోన హెచ్చగుట నాత్రము లందరు పాత్రధారులన్
హర్మ్యములోని వారలకు నాదర బాదరయైన రీతిలో
హర్మ్యములోన సంచరిలె హాయిగ పార్వతి విష్ణుమూర్తితో

తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ చెప్పారు...

ధర్మ్యపు మానసమ్మునను ధారణ చేయుచు యోగమార్గ సౌ
ధర్మ్యముతోడ భావనలు తథ్యము మోక్షము “పంచవక్త్రునితో
హర్మ్యము నందు సంచరిలె హాయిగ పార్వతి, విష్ణుమూర్తితో
హర్మ్యము నందు సంచరిలె హాయిగ శ్రీ" యని నాచరింపగన్.

తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ చెప్పారు...

ధర్మ్యపు మానసమ్మునను ధారణ చేయుచు యోగమార్గ సౌ
ధర్మ్యముతోడ భావనలు తథ్యము మోక్షము “పంచవక్త్రునితో
హర్మ్యము నందు సంచరిలె హాయిగ పార్వతి, విష్ణుమూర్తితో
హర్మ్యము నందు సంచరిలె హాయిగ శ్రీ" యని నాచరింపగన్.

గోలి హనుమచ్చాస్త్రి చెప్పారు...

హర్మ్యము లేక నుండుటకు నద్దెల కొంపల నుండె నప్పుడే
హర్మ్యము గట్ట నప్పులను నందెడు వీలగు వాయిదాలతో
' హర్మ్యము ' స్కీము బ్యాంకునను నాదరమొప్పగ రాగ కట్టి తా
హర్మ్యము నందు సంచరిలె హాయిగ పార్వతి విష్ణుమూర్తితో

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

ఆర్యా! హనుమచ్ఛాస్త్రి గారూ! ఇక్కడ సమస్య పార్వతి విష్ణుమూర్తితో ఉండడము. దానిలోని ఆ దోషభావ స్ఫురణను పరిహరిస్తూ పూరణ చేయడమే మన ముందున్న సమస్య. ఆ దృక్కోణంలో పూరింప గలరు మీరు. ప్రయత్నించండి.
ధన్యవాదములు.
నమస్తే.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

శ్రీ తోపెల్ల బాల సుబ్రహ్మణ్యము గారూ! చక్కగా ఉంది మీ పూరణము. రెండవ పాదములో మాత్రం పంచ వక్త్రునితో అనడానికి బదులు పంచ వక్త్రుతో అంటే సరిపోతుందండి. ధన్యవాదములు.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

ఆర్యా! శ్రీ నేమాని వారూ! నమో వాకములు. బలే రక్తికట్టించారండి నాటకాన్ని. చాలా అద్భుతంగా ఉంది మీ పూరణము. ధన్యవాదములు.

గోలి హనుమచ్చాస్త్రి చెప్పారు...

ఇసుకతో పెద్ద పెద్ద సైకత శిల్పములు చేయుట చూస్తున్నాం. అలాగే మంచు తో గణపతి, కుమారస్వామి ఆడుకుంటూ ముచ్చటగా చేసిన హర్మ్యమును చూడటానికి హరి కైలాసానికి వచ్చినట్లు భావించాను.


హర్మ్యము మంచు కొండ సతి నర్థము దాల్చిన దేవదేవుకున్
హర్మ్యము జేసి మంచునట నాడుచునుండగ స్కందు డన్నయున్
హర్మ్యము జూడ వచ్చె నుమ కన్నయ సంతసమంది శంభుడే
హర్మ్యము లోన సంచరిలె హాయిగ పార్వతి విష్ణుమూర్తితో

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

హనుమచ్ఛాస్త్రిగారూ! అద్భుతం మీ భావనా పూరణాకూడా.అభినందన పూర్వక ధన్యవాదములు.

గోలి హనుమచ్చాస్త్రి చెప్పారు...

ఆర్యా ! ధన్యవాదపూర్వక నమస్సులు.

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

హర్మ్యము మంచు కొండ దరి యాదర మొప్పును మీరు మెచ్చగా
హర్మ్యము గట్టితిన్ యనుచు హాయిగ నుండగ తల్లి దం డ్రులన్
హర్మ్యము లోని కేగుచును వారల గైకొని పోయె స్కందుడే
హర్మ్యము నందు సంచరిలె హాయిగ పార్వతి విష్ణు మూర్తితో !

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.