గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

9, జనవరి 2013, బుధవారం

సాలగ్రామములు - శ్రీ భాస్కరానంద నాథ


జైశ్రీరామ్.
పాఠకప్రియబాంధవులారా!మనము సాలగ్రామ శిలావారి ప్రాముఖ్యతను తెలియనివారము కాము. ఆ ఉదకము ప్రాప్తించినప్పుడు మనము 
శ్లో:-సాలగ్రామ శిలా వారీ పాప హారీ విశేషతః.
ఆజన్మ కృత పాపానాం ప్రాయశ్చిత్తం దినే దినే.
ప్రథమం కార్య సిద్ధిశ్చ - ద్వితీయం జ్ఞానమేవచ
తృతీయం మోక్షమాప్నోతి. ఏవం తీర్థః త్రిభిస్త్రిభిః. 
అనే శ్లోకం చెప్పుకుంటూ ముమ్మారు ఆ జల పానం చేసి పునీతులమవతాము.
శా:- సాలగ్రామ శిలా విముక్త జలముల్ సర్వాఘ సంహారముల్.
క్రోలన్ బాపములెల్ల బాపు, సతమున్ రోగార్తి పోకార్పుచున్
క్రాలున్. కార్యపు సిద్ధి కూర్చు మొదటన్. జ్ఞానంబు రెంటన్. సదా
మూడింటన్ శుభ ముక్తి గూర్చు జలమున్ ముమ్మారు సేవించినన్.
దీని భావము.
సాలిగ్రామ శిలకు అభిషేకము చేసినప్పుడు ఆ సాలిగ్రామ తీర్థమును మనము సేవించినట్లైతే అది పాపములను హరించును.జన్మాదిగా చేసినపాప పరిహారమునకు ప్రాయశ్చిత్తము. ఒకసారి పానము చేసినట్లైతే శరీరశిద్ధి కలుగుతుంది. రెండవపర్యాయము పానము చేసినట్లైతే జ్ఞానము ప్రాప్తిస్తుంది. మూడవ పర్యాయము పానము చేసినట్లైతే మోక్షము ప్రాప్తిస్తుంది. ఇంతటి చక్కని ఫలదాయకమైన ఆ సాలగ్రామ విషయమై శ్రీ భాస్కరానందానంద గారు ఏమంటున్నారో చూద్దాము.
సాలగ్రామము విష్ణుప్రతీకమైన , విశిష్ట ప్రాముఖ్యం కలిగిన ఒక శిలా విశేషము. కలికాలంలో భక్తుల అర్చనాదుల సౌలభ్యం కోసం నారాయణుడు సాలగ్రామ రూపం ధరించాడని దేవీభాగవతం చెబుతుంది. అందుచేతే గృహదేవతార్చనలలోగానీ, దేవాలయాలలోగానీ సాలగ్రామము (మూర్తి) లేకుండా పూజలు కొనసాగవు.
ద్వైతులు, విశిష్టాద్వైతులు, అద్వైతులు తమతమ దేవతార్చనలలో సాలగ్రామములను పూజకు ఉపయోగిస్తారు. భారతదేశంలో సాలగ్రామ పూజ బహు పురాతనమైనది. క్రీస్తు కంటే ప్రాచీనుడైన అపస్తంబుడు సాలగ్రామ పూజను పేర్కొన్నాడు. త్రిమతాచార్యులు తమతమ భాష్యాలలో సాలగ్రామాలు విష్ణురూపాలని వివరించారు.
దేవాలయాలలో పంచాయతన మూర్తులకు శిలా ప్రతిమలు ఉంటే గృహస్థులకు మణి, స్వర్ణ నిర్మితమైన మూర్తులు, సాలగ్రామములు ఉంటాయి. సాధారణంగా ప్రతిమలకు నిత్య పూజా సమయంలో ఆవాహనాది షోడశోపచారాలు చేయాలి. సాలగ్రామాలలో దేవత నిత్యం సన్నిహితమై ఉండడం వల్ల వాటికి పూజా సమయంలో అవాహనాది ఉపచారాలు అవసరం లేదు అని పెద్దలు అంటారు. ఈ సాలగ్రామములు గండకీ నదిలో దొరకడం విశేషం.
పంచాయతనం లో ఉండే ఐదు మూర్తులు:
ఆదిత్యం - స్ఫటికం
అంబికాం - లోహం
విష్ణుం - సాలగ్రామం
గణనాథం - ఎర్రరాయి
మహేశ్వరం - బాణం
ఈ ఐదింటికీ పూజ చేయడాన్ని పంచాయతన పూజ అంటారు. వీటిలో ఏది మధ్యలో ఉంటే ఆ పంచాయతనం అంటారు. సాలగ్రామాన్ని మధ్యలో ఉంచితే 'ఆదివిష్ణు పంచాయతనం' అంటారు. అంబిక వుంటే అంబికా పంచాయతనం అని అంటారు. ఇవి గృహములో వుంటే రోజు ధూప, దీప, నైవేద్యములను తప్పక చేయ వలెను.
మడి, శుచి ఎంతో అవసరము.  ఎంతో పుణ్య ఫలము వుంటే గానీ ఈ పంచాయతనము ఇంటికి రాదు. చేసుకొనే అదృష్టం కలుగదు.
కానీ ఈ మధ్య చాలా మంది "మేము చేసుకోలేము అని, మడి కుదరదు అని ".. వీటిల్ని గంగ పాలు చేస్తున్నారు. ఇది ఎంతో అనిష్టము. ఇలా చేయకూడదు. తరాల నుంచి వస్తున్న ఆచారమును ఇలా గంగ పాలు చేయ కూడదు. కొన్ని ఏళ్ళు మీ ముత్తాతలు చేసిన పూజలు వలన దేవతలు ఆ మూర్తులలో,
సాలగ్రామములలో వసించి వుంటారు. ఇలా చేయడం మనకు, మన వంశమునకు మంచిది కాదు.
ఇదే పెద్దలు ఇచ్చిన అసలు సిసలైన ఆస్తి. దానిని జాగ్రత్తగా కాపాడి మన తరువాత తరము వారికి ఇవ్వాలి వాటిల్ని. వంశ పారంపర్యముగా వచ్చే ఇటువంటి పూజలు అన్ని దోషములను, ఆపదలను పోగొట్టి, వంశమును కాపాడును.
పంచ పూజలతో పాలు నైవేద్యము పెట్టండి, చాలు సంతోషిస్తారు దేవతలు.
శ్రీ భాస్కరానంద నాథ
చూచారు కదండీ! మీకు తెలిసిన మరిన్ని క్రొత్త క్రొత్త విషయాలను పదిమందికీ తెలియజెయ్యండి. 
జైహింద్.

Print this post

2 comments:

Pandita Nemani చెప్పారు...

సాలగ్రామముల ఉపయోగములను చక్కగా వివరించేరు. ఒక మంచి వ్యాసము. ధన్యవాదములు. స్వస్తి.

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
ఎంతో మహిమాన్విత మైన సాల గ్రామములను వాటి పూజా విధానమును గురించి మంచి విషయములను తెలియ జెప్పి నందుకు ధన్య వాదములు

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.