జైశ్రీరామ్.
ఒక్కో అక్షరములో, ఒక్కో బీజములో మహా విస్పోటనము కలిగించే శక్తి వున్నది. దేనికీ లేనటువంటి శక్తి శబ్దమునకు కలదు.సంగీతముతో రోగములను నయం చేయవచ్చును. మంచి మాటలతో కాలిన గాయములను మాన్పించ వచ్చును.మంత్రముతో ఎండిపోయిన చెట్టును బ్రతికించ వచ్చును. పోబోయే ప్రాణములను నిలబెట్ట వచ్చును. భూత ప్రేతాదులను పారద్రోల వచ్చును. ఒక్కటేల ప్రపంచాన్నే గడ గడ లాడించ వచ్చును. ఒక్కో అక్షరములో ఒక్కో శక్తి దాగి వున్నది. అది తెలుసుకోవడమే మన కర్తవ్యం. సప్త స్వరముల వలే వేద మంత్రములకు స్వరము గలదు. ఆ స్వరముతో తప్పులు లేకుండా మంత్ర ఉపాసన చేయ వలెను. మంత్రము బీజాక్షరములతో కూడినది. బీజములో ప్రాణ శక్తి దాగి ఉండును. దానిని విస్పోటనం చేయడమే మంత్ర లక్ష్యం. ఆ మంత్రాన్ని పదే పదే స్మరించడంవలన శబ్దంలో నుంచి శక్తి ఉద్భవించును. అరణిని మధింప అగ్ని ఎట్లు జనించునో, అట్లు బీజాక్షరములతో గూడిన మంత్రమును పలు మార్లు జపించుట చేత శక్తి ఉద్భవించును. దేవత సాక్షాత్కారము అగును. మంత్ర సిద్ది కలుగును.మంత్ర శాస్త్రమును, మంత్రములను గుహ్యముగా వుంచవలెను అని పెద్దలు పదే పదే చెప్పడానికి కారణం ఎవ్వరికీ చెప్పకూడదని కాదు, ఎవ్వరినీ భయపెట్టాలని కాదు. ఈ శాస్త్రము పడ కూడని వాళ్ళ చేతులలో పడ కూడదు అని. అన్ని వర్ణములు వారు వారి వారి అర్హతను బట్టి,స్థాయిని బట్టి ఈ శాస్త్రాన్ని, విద్యనూ బడయ వచ్చును. సర్వ జనులకు మంత్ర శాస్త్రము అనుకూలమైనది. జగద్గురువులు ఆది శంకరాచార్యులు పరిష్కరించి ఇచ్చిన తంత్ర, మంత్ర యంత్ర, శాస్త్రమును, వేద సమ్మతమైన ఆచారమును దక్షిణాచారమని, తద్విరుద్దమైనది వామాచారమని రెండు రకములు.
వామాచారం అనాగరికులకు చెందినది. ఆ పద్దతులు,ఆచారములు మనకు నిషేధించబడినవి. వాటి జోలికి మనము ఎంత మాత్రమూ పోగూడదు. కావున వాటిల్ని మనము ఇక్కడ స్పృశించుట లేదు. వేదానుసారముగా, వేదములలో, పురాణములలో చెప్పబడిన మంత్రములనే, పద్ధతులనే మనము ఇక్కడ తెలుసుకోనేదము.
పరమ శివుడు జగత్తు నందు గల ప్రాణుల కామ్య సిద్దుల కొరకు చతుషష్టి (64) తంత్రములను సృష్టించెను.కామేశ్వరి కోరిక మేరకు చతుర్విధ పురుషార్ధములు ఒక్క మంత్ర, తంత్రము నందు కలుగునట్లుగా శ్రీవిద్యా తంత్రమును నోసంగబడినది. ఈ శ్రీవిద్యా తంత్రమును,మంత్రములను మునుపు ఎందరో మునులు, ఋషులు ఆచరించినారు. వారిలో అగ్రగణ్యులు విష్ణువు,శివుడు, బ్రహ్మ, మనువు, చంద్రుడు, కుబేరుడు, లోపాముద్ర, అగస్త్యుడు, కుమారస్వామి,మన్మధుడు, ఇంద్రుడు, బలరాముడు, దత్తాత్రేయుడు, దూర్వాసుడు, పరుశురాముడు ఇలా ఎందరో శ్రీదేవీ ఉపాసకులు గలరు. పంచదశీ మహా మంత్రమునకు సాక్షాత్తు దక్షిణామూర్తి ఋషి,ద్రష్ట. చండీ మహా మంత్రమునకు శ్రీ మహావిష్ణువు ఋషి,మంత్ర ద్రష్ట. మంత్ర ద్రష్ట అనగా ఆ మంత్రాన్ని దర్శించిన వాడు, మొట్ట మొదటగా ఆ మంత్రాన్ని ఉపాసన చేసి, దర్శించి, ఈ లోకానికి తెచ్చిన వాడు అని అర్ధము.
శ్రీ గౌడపాదాచార్యులు, శ్రీ గోవింద పాదాచార్యులు, శ్రీ విద్యారణ్య మహా స్వాములు, శ్రీ రామకృష్ణ పరమ హంస, శ్రీ గణపతి ముని..... ఇలా ఎందరో మహానుభావులు, జగద్గురువులు, ఋషులు ఆనాటి నుంచి ఈనాటి వరకు శ్రీవిద్యా తంత్రములను అనుష్టించుచూ శ్రీవిద్యామంత్రములను వ్యాప్తి చేయుచూ వస్తున్న వారు. నేటికీ జగద్గురువులు స్థాపించిన నాలుగు పీఠములలో ఇదే సాంప్రదాయము కొనసాగుతూనే వున్నది. మన కంచి పీఠము లో కూడా జగద్గురువులు శ్రీవిద్యా తంత్రానుసారము శ్రీవిద్యామంత్రములు, శ్రీచక్ర పూజ, శ్రీ చంద్ర మౌళీశ్వర పూజ నిత్యమూ అనాదిగా జరుగుతూనే వున్నది. ఆనాటి నుంచీ ఈ శ్రీవిద్యామంత్రములు, తంత్రములు పీఠముల ద్వారా, పీఠాథిపతుల ద్వారా, గురువుల ద్వారా లోకమునకు అందజేయ బడుతూ శ్రీవిద్యా దీక్షాగా, శ్రీవిద్యోపాసనగా అలరారుచున్నది.
ఒకసారి మా ఇంట్లో ఒక బిల్వ మొక్క అతి కష్టం మీద సంపాదించినది బ్రతికినది.ఉన్నట్లుండి అది కొన్ని రోజుల తర్వాత ఎండిపోయినది. నాకు చాలా బాధ వేసినది. ఏమీ పాలు పోక 11రోజులు రుద్రం చదివి ఆ వదిలిన నీళ్ళు ఆ చెట్టు మొదల్లో పోసినాను, విచిత్రం సరిగ్గా 12వ రోజు అది చిగురించినది. ఒక చిన్ని ఆకు వేసినది. ఎంత సంతోషమో, ఎంత ఆనందమో ఆ చెట్టు బ్రతికినది. ఇప్పటికి అది చాలా పెద్ద చెట్టు అయినది. ఒక చెట్టును బ్రతికించిన వాళ్ళము ఒక మనిషిని బ్రతికించ లేమా? ప్రకృతిని నీవు కాపాడితే అది నిన్ను కాపాడుతుంది. మొక్కే గదా అని దానిని నీవు పీకేస్తే, అది కూడా ఒక రోజు నిన్ను పీకేస్తుంది.పంచ భూతములను మనము గౌరవించాలి, కాపాడాలి, పూజించాలి. పంచ భూతములకు పంచ బీజాక్షరములు గలవు. వాటితో పూజించి స్వాధీనము చేసుకోవచ్చును. పంచ భూతములకు సంకేతములు ఇవి. పృధ్వీ(ల౦), ఆకాశము(హ౦), వాయు(య౦), అగ్ని(ర౦), జలము(వ౦). వీటినే పంచోపచార పూజలు అని అందురు.
పంచ భూతములకు పంచ పూజలు.
ల౦ ... పృధ్వీ తత్త్వాత్మికాయైనమః ............ గంధం ... సమర్పయామి.
హం ... ఆకాశ తత్త్వాత్మికాయైనమః ..............పుష్పం ...సమర్పయామి.
య౦ ... వాయుతత్త్వాత్మికాయైనమః ............ ధూపం ... సమర్పయామి.
ర౦ .... వహ్ని తత్త్వాత్మికాయైనమః ............. దీపం ... సమర్పయామి.
వ౦ .... అమృత తత్త్వాత్మికాయైనమః ........... అమృత నైవేద్యం ... సమర్పయామి.
స౦ .... సర్వ తత్త్వాత్మికాయైనమః............. సర్వోపచార పూజా౦ ...సమర్పయామి.
ల౦... బీజ ఉపాసనతోమూలాధార చక్రములోని కుండలిని ప్రేరేపించ వచ్చును. కుండలిని ఉత్కీలనం జరుగును. మూలాధారము నందలి గుహ్య రోగము లన్నింటిని దూరం చేయ వచ్చును.
హం ... బీజ ఉపాసనతో సహస్రారం లోని కపాల భేదనము గావించ వచ్చును.శిరస్సునకు, గొంతునకు సంబంధించిన వ్యాదులన్నీ నయం చేసుకోవచ్చును.
య౦... బీజ ఉపాసనతోఉపిరి తిత్తుల రోగమును, హృద్రోగమును నయం చేయ వచ్చును. ప్రాణాయామ నియంత్రణ పొందవచ్చును.
ర౦.... బీజ ఉపాసనతోదావాగ్ని రగిలించ వచ్చును, జఠరాగ్ని కలిగించ వచ్చును. జీర్ణకోశ వ్యాధులను నయం చేయవచ్చును. బ్రహ్మా తేజస్సును, మంచి రంగును, కళను బడయ వచ్చును. మలినమును శుద్ధి చేయవచ్చును.
వ౦.... బీజ ఉపాసనతోశరీరమును అమృత తుల్యం చేసుకోవచ్చును. విష జ్వరములను, విషమును హరించ వచ్చును. శరీర రుగ్మతలను అన్నింటినీ పారద్రోల వచ్చును. సంతాన సమస్యలను అధిగమించ వచ్చును.
స౦.... బీజ ఉపాసనతోమనస్సును శుద్ధి చేసుకొని, మనో లయం గావించుకో వచ్చను. పవిత్ర ఆత్మగా మార్చుకొని భగవంతున్ని చేరవచ్చును.
ఈ పంచ బీజ ఉపాసనతో శరీరాన్ని, మనస్సును శుద్ధి చేసుకొని పరమాత్ముని నామమును, మంత్రమును జపించ వలెను. భగవంతుని నామముతో పాప కర్మరాశిని దగ్ధం చేయవచ్చును.
శ్రీ భాస్కరానంద నాథ
జైహింద్.
1 comments:
నమస్కారములు
చాలా మంచి పూజా విధానాన్ని తెలియ జెప్పారు ధన్య వాదములు
ఐతే వేదాను సారముగా చెప్ప బడిన శ్రీ విద్యా మంత్రములను , వాటి విశిష్టతను గురించీ చక్కగా వివరించారు. " నిజానికి ఎండిన మొక్క చిగురించినది అంటే , ఆ మంత్ర శక్తి ఎంతటిదో గ్రహించ వచ్చును .మరి పంచ భూతములకు సంకేతము లైన బీజాక్షరములను చెప్పారు కదా , అంటే
లం . పృధ్వీ తత్వాత్వి కాయైన మ ...గంధం సమర్ప యామి నుంచి
సం . సర్వ తత్వాత్మి కాయైన మ: ...సర్వో పచార పూజాం సమర్పయామి వరకు చదివి నైవేద్య మిడితే చాలా ?
నైవేద్యమునకు ఏమైనా ముఖ్య మైన పదార్ధము ఉందా ? దయచేసి తెలుప గలరు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.