గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

12, జనవరి 2013, శనివారం

ఓ భారతీయ యువజనులారా! సంఘటితం కండి.కార్యోన్ముఖులవండి

జైశ్రీరామ్.
సోదర భారతీయులారా! ఈ రోజు స్వామీ వివేకానంద 150 వ జయంతి. ప్రతీ సంవత్సరము ఈ తేదీన యువ జన దినోత్సవము జరుపుకొనుచున్న విషయము మీకు తెలియనిది కాదు. దానికి కారణము యువకుడైన మన వివేకానంద మన భారతాంబ కీర్తి పతాకను ప్రపంచం అంతటా ఎగురవేశాడు.ఆత్మ నిగ్రహము, జ్ఞాన దీప్తి, అకుంఠిత దీక్ష అనే సద్గుణాలే వివేకానందుని ప్రపంచంలో స్వామీ వివేకానందగా తీర్చిదిద్దాయి.
ఈరోజునే యువ జన దినోత్సవము జరుపుకొనుటలో గల అసలు సత్యమేమిటంటే యువ భారతీయులు యావన్మందీ తర తమ భేదాలు వీడి, కులాతీతముగా, మతాతీతముగా, సత్యమార్గైకవర్తులై మన అమ్మ భారతిని
తమ సత్ప్రవర్తనతో సంతోష పరచాలని. ప్రపంచ దేశాలను మన భారతమ్మ కీర్తిచంద్రికల చలువదనంతో నింపాలని ఆశించేనండి.
ఈనాడు ఈ చీకాకుల చీకటులు అలముకొనటానికి, అశాంతి పెరగటాబికి, దుర్మార్గము పెచ్చురేగటానికి కారణం కేవలం కరడు కట్టుకుపోయిన స్వార్థం. దుష్టమైన మత మౌడ్యం. అర్థ రహితమైన ఆలోచనా సరళి. అన్నిటికీ మించి అవివేకము.
జ్ఞాన దృష్టి కలిగి అవివేకాన్ని పారద్రోల గలిగితే మిగిలేది వివేకమే. దానితో ఆనందుడౌతాడు మానవుడు అప్పుడు వివేకానండే కదా? 
ఈ అనంత దౌర్భాగ్య స్థితి గతులను అలవోకగా మార్చ గలిగే మహా శక్తి యువతయే. ఇది యువతకు తప్ప మరెవరికీ సాధ్యము కాదు.
భారతీయ యువజనులారా! స్పందించండి. మన వివేకానందుని ఆదర్శ భావాలను స్వీకరించి, త్రికరణ శుద్ధిగా అనుసరించి, మీరేమిటో నిరూపించుకోండి. ఈ భారాతాంబ మీ వంటి యువ యోధుల సేవ కొఱకై తపిస్తోంది. స్వార్థపరుల కబంద హస్తాలలో నలిగిపోతున్న తన నిరు పేద ప్రజానీకాన్ని, వారి కష్టాలను కడగళ్ళను చూడలేక విలవిలలాడిపోతోంది. మీరే సమర్థులు. మీకే సాధ్యం మన భారతదేశమునకు దుష్టచరితులవలన కలిగిన కళంకమును కడిగివేయటానికి. మీ యువశక్తే మీకు అండ. ఏ పెద్దలు మీకు అక్కర లేదు. మీ సమర్థతే మీ గురువు. నిష్కల్మష హృదయంతో, నిస్వార్థ తత్వంతో, నిరుపమాన సేవా దృక్పథంతో మన భారతిని స్వర్ణ భారతిగా మార్చటానికి, నేటి బాలురకు రేపటికి బంగారు బాట వేయటానికి నడుం బిగించండి. చేయీ చేయీ కలపండి. యువకులంతా ఒక్కటి కండి. ఆడా మగా తేడ లేకుండా పరస్పర భావ సమైక్యం కలిగి, ప్రణాళికా బద్ధంగా అడుగులు వేసుకొంటూ, ప్రగతి మార్గంలో ముందుకు నడవడం ద్వారా నేటి బాలురకు బంగారు భవితను ఏర్పాటు చేయండి. నేటి స్వార్థపరుల కుత్సిత రాజకీయాలనుండి మన ప్రజానీకం యొక్క భవితను కాపాడండి. తలచుకుంటే మీరు చేయలేనిది లేదని మీరు గ్రహించండి. మీ ఆలోచనలకు పదును పెట్టండి. 
బద్ధకం అన్ని దరిద్రాలకు మూలం. అన్ని అభివృద్ధులకు నిరోధకం. అటువంటి బద్ధకాన్ని మీ దరి చేరనీయకండి. ఒక్క క్షణం గడిచిపోయిందా అది వెనుకకింక రాదు. కాలం చాలా విలువైనది. విలువైన సమయాన్ని పొదుపుగా వాడండి. ఎప్పుడు పూర్తి చేయవలసిన పని అప్పుడు పూర్తి చెయ్యండి. ఇవన్నీ మీకు మీరే సాధించ గలిగినవి. కేవలం మిమ్మల్ని మీరు జయించ కలిగినప్పుడు మాత్రమే ఇది సాధ్యం. ప్రపంచాన్ని మీరు జయించాలంటే ముందు మిమ్మల్ని మీరు జయించ గలగాలి. ఇంద్రియ లోలురు కాకూడదు. అర్థ రహితమైన తాత్కాలిక అశాశ్విత ఇంద్రియ సౌక్యము కొఱకై అపురూపమై నీ ఆశయాన్ని విడనాడటం మూఢత్వమే ఔతుందని మరువకండి.
విజయోస్తు. యువశక్తి యొక్క అనంత సద్భావనా గరిమ ఇటుపై యావద్భారత జాతికీ ఉషోదయం కావాలి. బంగారు భవితను ఏర్పరచ గలగాలి. జీవితముపై ఆసక్తిని, అపురూపమైన ఆనందాన్ని ఇవ్వ గలగాలి.
మీ అందరికీ ఇవే ఇవే ఇవే నా హృదయ పూర్వకమైన శుభాభినందనలు. దీర్ఘాయుష్మంతులై ఆశయ సాధనలో విజయ పథ గాము లగుదురు గాక. పరమాత్మ మీ వెంట నుండును గాక.
శుభం
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.