గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

7, జనవరి 2013, సోమవారం

సంస్కృత కళాశాలలకు పట్టిన ఈ దుస్థితిని మాపండి. విద్యార్థినుల విజ్ఞప్తి

జైశ్రీరామ్.
శ్రీమదాంద్రభాషాభూషణులైన సహోదరీ సహోదరులారా! ఆంధ్రభాషామతల్లి వేడుకోలును (సదనం) విద్యార్థినుల విజ్ఞప్తిలో తిలకించండి.
ఆంధ్ర యువతీ సంస్కృత కళాశాల(సదనం)
రాజమహేంద్రవరము.
విజ్ఞప్తి.
రాష్ట్రంలో జరుగుచున్న ప్రపంచ తెలుగు మహోత్సవాల సమావేశాలలో అనేక మంది కవులు పండితులు వక్తలు, ప్రజా ప్రతినిధులు తెలుగును మరచిపో కూడదని, తెలుగు భాషను బ్రతికించుకోవాలని, అది మన మాతృ భాష అని, ప్రభుత్వ కార్యాలయాలలో తెలుగులోనే ఉత్తర ప్రత్యుత్తరాలు జరపాలని, బోర్డులన్నీ తెలుగులోనే వ్రాయాలనీ, ఉపన్యాసాలు ఇస్తున్నారు.ఇది చాలా సంతోషించ తగ్గ విషయము. ఐతే తెలుగు భాష నేర్చుకొనుటకు ఆయువుపట్టైన ప్రాచ్య కళాశాలల(ఓరియంటల్ కాలేజస్)పరిస్థితి చాలా దయనీయంగా ఉంది.
ఆంధ్ర ప్రదేశ్ లో దక్షిణ కాశీగా పిలవబడే రాజమహేంద్రవరము పట్టణ నడిబొడ్డున పవిత్ర గోదావరీ తీరమున"ఆంధ్ర మహిళా సంస్కృత కళాశాల" క్రీ.శ.1931లో స్థాపించబడి, కుల మత వర్గ విచక్షణ లేకుండా బాలికలను చేర్చుకొని,తెలుగు సంస్కృత సంప్రదాయ భాషా బోధన గావించుచు, అప్పటి నుండి ఇప్పటి(2012)వరకు నిరాటంకంగా నిరంతర వాహిని గోదావరిలా కొనసాగుతూ, అనేకమంది విద్యార్థినులను ఉద్దండ పండితులుగా, అవధానులుగా తీర్చి దిద్ది, తెలుగు సంస్కృత సొగసుల గుబాళింపును, భాషా వికాసమును నలు దెసలా ప్రజ్వరిల్ల జేసిన యీ కళాశాల ఈ నాడు ప్రభుత్వ పాలకుల నిర్లక్ష్యానికి గిరియై, రేపో మాపో కళాశాల మూతపడే ప్రమాదమేర్పడినది. ఎందు చేతననగా ప్రభుత్వము వారు జారీ చేసిన ఉత్తరువు సంఖ్య.35 ప్రకారము పదవీ విరమణ చేసిన ఖాళీలలో క్రొత్తవారిని నియమించక పోవుటయే. అందు వలన అధ్యాపకులు లేక బోధన కుంటువడు చున్నది.తత్ఫలితముగా కళాశాల మూతపడే ప్రమాదమేర్పడినది. అందువలన  తెలుగు, సంస్కృత భాషలు కనుమఱుగయ్యే ప్రమాదమున్నది.
ఒకప్పుడు భాషాప్రవీణగా, సాహిత్య విద్యాప్రవీణగా పిలువబడే ఈ చదువును పెఅస్తుతము B.A.O.L. DEGREE గా పిలుస్తారు.తెలుగు భాషాశాస్త్ర, వ్యాకరణ, అలంకార, కావ్యాదులను క్షుణ్ణంగా బోధిస్తారు.తెలుగు భాషా గౌరవమునకు ఆయువుపట్టైన అవధాన ప్రక్రియ కుంటుపడుతున్న ఈ రోజులలో మహిళలు అవధాన ప్రక్రియలో రాణిస్తూ, పెద్దపెద్ద నగరాలలో ప్రదర్శనలిస్తూ, అవధాన సౌరభాన్ని అంతటా వ్యాపింప చేస్తూ, పేరు ప్రఖ్యాతులు గైకొంటున్న మహిళా అవధానులకు ఆట పట్టు ఈ కళాశాల. నేడు కూడా SV channel మా విద్యార్తినుల అవధానములను ప్రసారం చేయుచున్న విషయము ప్రేక్షకులకు సువిదితమే.
శ్రీ నాళం రామలింగయ్య గారి ఆర్ధిక సహాయం, గౌరవనీయులైన బత్తుల కామాక్షమ్మ గారి సేవా దృక్పథంతో వృద్ధి చెందిన యీ కళా శాలలో పదవీ విరమణ చేసిన వారి స్థానములు ప్రభుత్వ ఉత్తరువు 35 కారణముగా ఖాళీగా ఉంచివేసిన కారణముగా  బోధన కరువైనది. దాతలు, స్థానిక ప్రజా ప్రతినిధులు, ధార్మిక సంస్థలు సహకరిస్తూ అతి కష్టం మీద ఇప్పుడు ఈ కళా శాలలో బోధన సాగుచున్నది. సిబ్బందిని నియమింప వలసినదిగా ప్రభుత్వమునకు ఎన్ని పర్యాయములు విన్నవించుకున్నను, అరణ్య రోదనయే అగుచున్నది.
తెలుగు మహా సభలలో ఉపన్యసించు కవులు, వక్తలు, పండితులు, ప్రజా ప్రతినిధులు, తెలుగు భాషాధ్యయనమునకాటపట్టైన సంస్కృత కళాశాలలు మూత పడకుండా ఉండుటకై ప్రభుత్వముపై ఒత్తిడి తెచ్చి, సిబ్బంది నియామకము జరిగేలా చూడవలసిన అవసరమెంతైనా ఉంది. మన భాషా సంస్కృతీ సంప్రదాయాలను తరువాత తరముల వారికి అంద జేయ వలసిన కనీస ధర్మము అందరిపైనా ఉందని విన్నవించుకొనుచున్నాము. మీరూ ఒక్క సారి మనసు పెట్టి ఆలోచించి మా విన్నపము యొక్క పరమార్థము నెరవేరే మార్గంలో కృషి చేసి తెలుగు భాషామతల్లిని రక్షిస్తారని ఆశిస్తున్నాము.
ఇట్లు
కళాశాల కమిటీ, మరియు విద్యార్థినులు.
చూచారు కదండి. మీ పరిధిలో ఏమి చేయగలరో అది చేస్తారనే విశ్వాసం నాకు ఉంది. మీ బ్లాగులద్వారా పదిమందిదృష్టికీ ఈ దుస్థితిని తీసుకురండి. ప్రభుత్వం నుండి సానుకూల స్పందనను సాధించండి. ఈ విషయంలో మీ సహాయ సహకారాలందించనున్న మీ అందరికీ నా కైమోడ్పులు.
జైహింద్.
Print this post

5 comments:

Gopal చెప్పారు...

కనీసం మనమందరం కామెంట్లు వ్రాసినా వారికి కాస్త ఊరట కలుగుతుంది. ఖాళీ అయిన పోస్టులను త్వరగా భర్తీ చేసి కళాశాల మూత పడకుండా చూడాలని ప్రభుత్వాన్ని అందరూ కోరండి.

శ్యామలీయం చెప్పారు...

ఆవేదన అర్థం అయింది. చాలా విచారించవలసిన దుస్థితి.

ఎక్కడెక్కడ డబ్బులు రాలవో అక్కడ రాజకీయ కాకులు వాలవు.
ప్రభుత్వాలు రాజకీయుల చేతిలోని సర్కస్సులు కాబట్టి వాళ్ళు డబ్బులు రాని చోట దృష్టి పెట్టరు. అదే కారణం.

మన సంస్కృతిని బ్రతికించుకోవటం కోసం మనమే పూనుకొని యేమన్నా చేయాలి కాని యీ అకటావికటపు రాజకీయుల దయను ఆశ్రయించి ప్రయోజనం లేదనటానికి ఈ వ్యవహారం ఒక ఉదాహరణ.

తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ చెప్పారు...

హంగు ఆర్భాటాలకు, విందు వినొదాలకు, ప్రజాసమీకరణాలకూ లెక్కకుమించిన ఖర్చు చేస్తారు రాజకీయనాయక పరిపాలనలో"తన కడుపే కైలాసం" అన్నచందాన.ఏ విద్యనేర్వడానికైనా ప్రాతిపదిక మాతృభాష.1980 ల వరకూ ఉచ్చస్థితిలో ఉన్న ప్రాచ్య కళాశాలలు క్రమంగా క్షీణ దశకు చేరేలా కర్ణుని చావుకన్నట్లు అందరూ తలోచేయ్యి వేసారు.చాల కళాశాలలు వదాన్యుల ప్రొద్బలంతో ప్రారంభమై ఉద్దండ పండితులను తయారుచేసినవి.క్రమేపి ప్రభుత్వ కనుసన్నలలోకి వచ్చి ముందు చూపు లేని పథక ప్రకార పథకాలతో అణగారే స్థితికి తిసికోని రాబడినవి. ప్రభుత్వ కార్యాలయాల్లో అవుట్ రిసోర్సింగు విధానాన పోస్టులు భర్తీ చేస్తున్నప్పుడు విశ్రాంత మహా పండితులను తీసికొన్నచో వారి విశేషానుభవం విద్యార్థుల కెంతో ఉపయోగ పడుతుంది.వయసు పెరిగే కొలది చదివి నేర్చుకున్నదానికి అనుభవం వన్నెతెస్తుంది.అటువంటి పెద్దలతో బోధన చేయించుటకు ప్రభుత్వానికయ్యే ఖర్చు అది దుబారాగా చేసే దాంట్లో సహస్రాంశం ఉంటుంది. దీనిపై ప్రభుత్వ కార్యదర్శులకు నిజమైన శ్రద్ధ ఉంటే, మాతృభాషపై సవతి తల్లి ప్రేమ చూపకుండగ ప్రభుత్వాన్ని చేతన పరిస్తే, ఇది పెద్ద సమస్య కాదని నాభావన.ఎంతగా కార్పోరేట్ విద్య బలీయమైనా మాతృభాషా బోధన కూడ ముఖ్యమేగదా!

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
ఈ వ్యవస్త మారాలంటే స్తాని కంగా ఉన్న మంచి వ్యక్తులు నిలబడి నిజాయితీగా కృషి చేయాలి .రాజ కీయ రాబందుల పాలనలో ఎందరు నడుం కట్టినా ఎంత వసూలు చేసినా దండగే . నిస్వ్వార్ధం గా ఓర్పు నేర్పు తో ఎందరు ముందు కొస్తారు ? ఇది పిల్లి మెడలో గంట కట్టడం లాంటిదే మరి విజయ నగరంలో కుడా ఒక సంస్కృత కళా శాల ఉన్నట్టు గుర్తు. మరి అదెలా ఉందో ?

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

అమ్మనే మమ్మీని చేసిన ఈ వ్యవస్త భాషా దాకా ఎక్కడ ?

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.